పెట్రోడాలర్‌కు రష్యా చెక్‌..! | Sakshi Funday Cover Story On Russia Ukraine War | Sakshi
Sakshi News home page

పెట్రోడాలర్‌కు రష్యా చెక్‌..!

Published Sun, Jul 17 2022 8:00 AM | Last Updated on Sun, Jul 17 2022 8:18 AM

Sakshi Funday Cover Story On Russia Ukraine War

రష్యా–ఉక్రెయిన్‌ వార్‌... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్‌ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్‌పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి.

ఈ ఉక్రెయిన్‌ వార్‌... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్‌ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్‌ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్‌ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్‌ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. 

అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్‌ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్‌ చెబుతోంది? ఉక్రెయిన్‌ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్‌గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్‌ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!!

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్‌లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్‌స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులపై జెలెన్‌స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్‌ కన్నెర్రకు కారణమే.

దీనికితోడు ఉక్రెయిన్‌తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్‌స్క్‌ ఒప్పందాన్ని జెలెన్‌స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్‌ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్‌ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్‌ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ పేరుతో ఉక్రెయిన్‌పై దండెత్తింది.

మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్‌ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్‌ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా.

కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్‌ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్‌ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఆంక్షల అస్త్రం...
రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్‌ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్‌ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన 600 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్‌ డాలర్లను అమెరికా, యూరప్‌ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం.

రూబుల్‌ ‘రబుల్‌’ కాదు.. డబుల్‌!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్‌ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్‌.. రబుల్‌ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు.

వార్‌ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్‌.. క్రూడ్, గ్యాస్‌ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్‌lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్‌ పడింది.

రష్యా క్రూడ్, గ్యాస్‌కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్‌లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్‌ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్‌) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్‌తో యూరోపియన్‌ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్‌ ‘నో రూబుల్‌.. నో క్రూడ్‌–గ్యాస్‌’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్‌ పేమెంట్‌కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్‌ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది.

140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్‌ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్‌ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్‌ విసిరిన ‘రూబుల్‌’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.

అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్‌లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్‌లో మాత్రమే పేమెంట్‌ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్‌ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్‌ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం.

పెట్రోడాలర్‌ సంగతేంటంటే!
1970వ దశకంలో ప్రపంచం క్రూడ్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్‌ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్‌ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్‌ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రత్యేక పేమెంట్‌ వ్యవస్థనే ‘పెట్రోడాలర్‌’గా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్‌ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్‌ సిస్టమ్‌ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్‌ కరెన్సీగా ‘డాలర్‌’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్‌లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్‌ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది.

అయితే, ఇప్పటిదాకా పుతిన్‌లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఇప్పుడు పుతిన్‌ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్‌ వ్యవస్థ ‘స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌)’ నుంచి వెలేస్తారని పుతిన్‌కు ముందే తెలుసు.

దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్‌ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్‌ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్‌ గ్యాస్‌ ఉత్పత్తులకు రూబుల్‌ లేదంటే డాలర్‌ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్‌ మార్కెట్లు షేక్‌ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్‌ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం.

‘స్విఫ్ట్‌’కు షాక్‌...
అమెరికా, యూరప్‌ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్‌ పేమెంట్‌ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్‌ వ్యవస్థ అనేది డాలర్‌ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్‌ వార్‌తో రష్యా పూర్తిగా స్విఫ్ట్‌ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్‌–చైనా యువాన్, రూబుల్‌–ఇండియన్‌ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది.

అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్‌లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్‌–యువాన్‌ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్‌ కూడా రూపాయి–రూబుల్‌ పేమెంట్‌కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి.

రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్‌ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ (సిస్టమ్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మెసేజెస్‌)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ రూపొందించింది. ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను చైనాకు చెందిన క్రాస్‌–బోర్డర్‌ ఇంటర్‌బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (సీఐపీఎస్‌)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్‌పీఐఎఫ్‌ను బ్రిక్స్‌ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్‌ సదస్సులో రష్యా ప్రతిపాదించింది.

అలాగే, బ్రిక్స్‌ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్‌ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్‌ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్‌ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్‌ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్‌లోనే సెటిల్‌ అవుతాయి.

ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్‌ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు.. అంతిమంగా డాలర్‌ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్‌ వన్‌ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్‌తో సహా తమ ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్‌ సిస్టమ్‌లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు!
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్‌ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం.

2030 నాటికి బ్రిక్స్‌ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్‌తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్‌ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్‌ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం మరో విశేషం.

అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్‌ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్‌’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!!

ధరదడ..  మాంద్యం భయం!
ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్‌పై నిషేధంతో ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్‌ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకాయి.

ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.  వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.

యూరప్‌ గజగజ..!
అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్‌ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్‌ మొత్తం క్రూడ్, గ్యాస్‌ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్‌–గ్యాస్‌ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్‌) ద్వారా యూరప్‌ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది.

అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్‌ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్‌ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది.

ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్‌ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గనుక గ్యాస్‌ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్‌ కంపెనీ అయిన బీఏఎస్‌ఎఫ్‌.. తమకు గ్యాస్‌ గనుక కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్‌ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం.

ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్‌ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్‌ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్‌ఫైర్‌ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి.

చైనా, భారత్‌కు ‘రష్యా క్రూడ్‌’ పంట!
ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్‌ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌కు రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్‌ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్‌ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్‌ రేటుకు క్రూడ్‌ ఇస్తుండటం విశేషం.

ఉక్రెయిన్‌తో వార్‌ మొదలయ్యాక మూడు నెలల్లో  రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్‌ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్‌ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్‌ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్‌ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్‌ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్‌ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్‌ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement