fuel prices
-
పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!
దేశంలో సెప్టెంబర్ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 2% ఉంది. డీజిల్ 1.7%, ఎల్పీజీ 4.5%, పెట్రోల్ ధరలు 5.8% సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్‌పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Petrol and Diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్జీసీఎన్ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్‌లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్‌లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
పెట్రోడాలర్‌కు రష్యా చెక్..!
రష్యా–ఉక్రెయిన్ వార్... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్‌పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి. ఈ ఉక్రెయిన్ వార్... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్ చెబుతోంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్‌గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!! ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్‌లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులపై జెలెన్స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్ కన్నెర్రకు కారణమే. దీనికితోడు ఉక్రెయిన్‌తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాన్ని జెలెన్స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్‌పై దండెత్తింది. మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా. కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంక్షల అస్త్రం... రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం. రూబుల్ ‘రబుల్’ కాదు.. డబుల్! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్.. రబుల్ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు. వార్ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్.. క్రూడ్, గ్యాస్ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్ పడింది. రష్యా క్రూడ్, గ్యాస్‌కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్‌తో యూరోపియన్ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్ ‘నో రూబుల్.. నో క్రూడ్–గ్యాస్’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్ పేమెంట్‌కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది. 140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్ విసిరిన ‘రూబుల్’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్‌లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం. పెట్రోడాలర్ సంగతేంటంటే! 1970వ దశకంలో ప్రపంచం క్రూడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్‌టైమ్ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థనే ‘పెట్రోడాలర్’గా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్ సిస్టమ్ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్ కరెన్సీగా ‘డాలర్’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు పుతిన్ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్ వ్యవస్థ ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)’ నుంచి వెలేస్తారని పుతిన్‌కు ముందే తెలుసు. దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్ గ్యాస్ ఉత్పత్తులకు రూబుల్ లేదంటే డాలర్ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం. ‘స్విఫ్ట్’కు షాక్... అమెరికా, యూరప్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్ వ్యవస్థ అనేది డాలర్‌ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో రష్యా పూర్తిగా స్విఫ్ట్ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్–చైనా యువాన్, రూబుల్–ఇండియన్ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది. అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్‌లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్–యువాన్ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్ కూడా రూపాయి–రూబుల్ పేమెంట్‌కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి. రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్ (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ రూపొందించింది. ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను చైనాకు చెందిన క్రాస్–బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్పీఐఎఫ్ను బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్ సదస్సులో రష్యా ప్రతిపాదించింది. అలాగే, బ్రిక్స్ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్‌లోనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు.. అంతిమంగా డాలర్ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్ వన్ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్‌తో సహా తమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్ సిస్టమ్‌లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు! రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం. 2030 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్‌తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం మరో విశేషం. అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!! ధరదడ.. మాంద్యం భయం! ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్‌పై నిషేధంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. యూరప్ గజగజ..! అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్ మొత్తం క్రూడ్, గ్యాస్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్–గ్యాస్ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్) ద్వారా యూరప్ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గనుక గ్యాస్ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన బీఏఎస్ఎఫ్.. తమకు గ్యాస్ గనుక కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్‌ఫైర్ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి. చైనా, భారత్‌కు ‘రష్యా క్రూడ్’ పంట! ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌కు రష్యా–ఉక్రెయిన్ వార్ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఇస్తుండటం విశేషం. ఉక్రెయిన్‌తో వార్ మొదలయ్యాక మూడు నెలల్లో రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి -
‘తాజ్‌మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్‌మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‌ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది. నేడు(సోమవారం) సీఎం షిండే బల నిరూపణలో సైతం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా.. ఇంధన ధరలను తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించనున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది నవంబర్‌లో, కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాయి. ఇక, మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను మరింత తగ్గించాయి. అయితే, ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. కాగా, మహారాష్ట్రలో అప్పుడున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ వ్యాట్‌ను తగ్గించలేదు. తాజాగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు -
పెట్రో షాక్‌తో సీఎన్జీ వాహనాలకు గిరాకీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలేమో ఖరీదు ఎక్కువ. ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో (సీఎన్జీ) నడిచే వాహనాలు వినియోగదార్లకు ప్రత్యామ్నాయం అయ్యాయని ఎన్ఆర్ఐ (నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్) కన్సల్టింగ్, సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2021-22లో దేశంలో సీఎన్జీ వాహనాలు 2,65,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. 2018 నాటికి దేశవ్యాప్తంగా 30.9 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 37.97 లక్షల యూనిట్లకు చేరుకుంది. బీఎస్-6 ఇంధన ప్రమాణాలు అమలయ్యాక యాజమాన్య ఖర్చులు తక్కువగా ఉండడంతో సీఎన్జీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక ఇంధన సామర్థ్యంతో.. సాంకేతికత అందిపుచ్చుకున్న ఇక్కడి తయారీ కంపెనీలు తక్కువ ధరలో అధిక ఇంధన సామర్థ్యం ఉన్న సీఎన్జీ వేరియంట్లను ప్రవేశ పెడుతున్నాయి. సీఎన్జీ విక్రయ కేంద్రాలు విస్తరించడం, నియంత్రణ వ్యవస్థ మద్దతు ఈ విభాగం వృద్ధికి తోడ్పడుతోంది. మరోవైపు అధిక గ్యాస్ ధరలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమల నెట్వర్క్ విస్తరణను పరిమితం చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బయో సీఎన్జీ పర్యావరణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. భారత బయో సీఎన్జీ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా చేరుకున్నట్లయితే.. దేశంలోని ప్రస్తుత సహజ వాయువు డిమాండ్‌ను తీర్చగలదు. 54 లక్షల అదనపు వాహనాలకు శక్తినివ్వగలదని అంచనా. -
శ్రీలంక సంక్షోభం, భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది. ఏప్రిల్ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఫ్యూయల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా దూసుకుపోవడం, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి కాంచన విజే శేఖర ట్విటర్లో తెలిపారు. (1) Fuel Price will be revised from 3am today. Fuel pricing formula that was approved by the cabinet was applied to revise the prices. Price revision includes all costs incurred in importing, unloading, distribution to the stations and taxes. Profits not calculated and included. — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 (3) Public sector workforce will be called to work on the direction of the head of the institute from today. Work from home will be encouraged to minimize the use of fuel and to manage the energy crisis. pic.twitter.com/JVKrmSYnoc — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన జత చేశారు. It is always people first for us! Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh — Narendra Modi (@narendramodi) May 21, 2022 Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets. https://t.co/tHNKmoinHH — Narendra Modi (@narendramodi) May 21, 2022 -
‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్
మీర్‌పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్‌షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణుల మహాధర్నా. (ఇన్సెట్లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్‌రెడ్డి, అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ రేటు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి. ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి, కోల్‌కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్..డీజిల్ రేట్లను రోజువారీ సవరిస్తారు. -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
ఫ్లైట్ ఫ్యూయల్ ఆల్‌టైం హై! కిలో లీటరు ధర రూ. 1.10 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో విమాన ఇంధన ధరలు కనీనివినీ ఎరుగని స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా చమురు ధర బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత భారత్‌లో తొలిసారిగా కిలోలీటర్ (1,000 లీటర్లు) ధర రూ.1 లక్ష దాటి ఆల్‌టైమ్ హై రికార్డు నమోదు చేసింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటర్ ధర ఢిల్లీలో 18.3 శాతం ఎగసి రూ.1,10,666.29కు చేరింది. ఈ ఏడాది ధర పెరగడం ఇది ఆరవసారి. గడిచిన పక్షం రోజులలో సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా జెట్ ఇంధన ధరలు ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తున్నారు. 2022 జనవరి 1 నుంచి చూస్తే కిలో లీటర్‌కు మొత్తం రూ.36,643.88 ఎగసింది. అంటే దాదాపు 50 శాతం అధికమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధర బ్యారెల్‌కు గత వారం 14 ఏళ్ల గరిష్టం 140 డాలర్లకు చేరింది. ధర ప్రస్తుతం 100 డాలర్లకు వచ్చి చేరింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో జెట్ ఇంధనం వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ ధర రూ.71,028.26 నమోదైంది. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధర బ్యారెల్‌కు 147 డాలర్లుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గతేడాది నవంబర్ 4 నుంచి భారత్‌లో అదే రీతిలో కొనసాగుతున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యమే ఇందుకు కారణం. ఎల్పీజీ ధరలో సైతం 2021 అక్టోబర్ నుంచి ఎటువంటి మార్పు లేదు. -
నష్టాల ఊబిలో ఏవియేషన్
ముంబై: విమానయాన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనూ భారీ నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రూ.25,000–26,000 కోట్ల మేర నష్టాలను నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెట్ ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరిగిపోవడం, టికెట్ చార్జీలపై పరిమితులు కంపెనీలకు ప్రతికూల అంశాలుగా తెలిపింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నష్టాలు రూ.14,000–16,000 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిశ్రమకు అదనంగా రూ.20,000–22,000 కోట్ల వరకు నిధుల అవసరం ఉంటుందని తెలిపింది. పెరిగిన రద్దీ దేశీయ ప్రయాణికుల రద్దీ వార్షికంగా చూస్తే 2021–22లో 50–55 శాతం మేర వృద్ధి చెందుతుందని ఇక్రా పేర్కొంది. టీకాలు ఎక్కువ మందికి ఇవ్వడం, ఆంక్షలు సడలిపోవడం అనుకూలించే అంశాలని తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందస్తు గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2023–24 సంవత్సరంలోనే కరోనా ముందున్న స్థాయికి విమాన ప్రయాణికుల రద్దీ చేరుకుంటుందని పేర్కొంది. కరోనా రెండో విడత తీవ్రంగా ఉండడం, ఆ వెంటే ఒమిక్రాన్ వెలుగు చూడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదల నిదానంగా ఉన్నట్టు వివరించింది. వ్యయాల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఏటీఎఫ్ సగటు ధరలను పరిశీలించినప్పుడు, గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగాయని.. అదే సమయంలో టికెట్ చార్జీలపై పరిమితులు నష్టాలకు దారితీస్తున్నట్టు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు త్వరలో అనుమతిస్తుండడం, ఒమిక్రాన్ తగ్గిపోవడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో ప్రయాణికుల రద్దీ పుంజుకుంటుందని ఇక్రా తెలిపింది. ఎయిర్‌లైన్స్ రుణ భారం తక్కువగా ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు తగ్గేందుకు సాయపడుతుందని పేర్కొంది. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో 2022–23 సంవత్సరంలో ఏటీఎఫ్ కోసం ఎయిర్‌లైన్స్ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా విక్రయానికి ముందు రుణ భారం గణనీయంగా తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత ఏవియేషన్ పరిశ్రమపై నెగెటివ్ అవుట్‌లుక్ (ప్రతికూల దృక్పథం)ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. పనితీరును మెరుగుపరుచుకోవడం, రుణభారాన్ని తగ్గించుకునే వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
తాలిబన్ల వల్లే పెట్రోల్ ధర పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం ప్రారంభం అయిన నాటి నుంచి మన దేశంలో వారి ప్రస్తావన బాగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకునే క్రమంలో నేతలను తాలిబన్లతో పోలుస్తూ.. తిడుతున్నారు. మరి కొందరు నాయకులు ఓ అడుగు ముందుకు వేసి.. దేశంలో ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే అని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. ఫలితంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత) అరవింద్ వ్యాఖ్యలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్‌లో తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందేమో. కానీ దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు జనాలు. (చదవండి: అఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్) ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక రాయిటర్స్ ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి ఇరాక్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్‌కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అఫ్గనిస్తాన్ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఇంధన ధరల పెంపు అంశంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు పెంచుతూ ఇప్పటికే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు 44 శాతం, డీజిల్ ధరలు 55 శాతం పెరిగినట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. చదవండి: అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం -
చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత
భోపాల్: కరోనా మహమ్మారి దేశాన్ని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియా మిత్రులతో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే అఫ్గనిస్తాన్ కి వెళ్లండి.. అక్కడైతే చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు. కట్నిలో ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్ని ఇంధన ధరలపై ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వివరణగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలా కుతలం చేసిందని.. త్వరలో థర్డ్ వేవ్ రాబోతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల బదులుగా కోవిడ్ మూడవ వేవ్ గురించి ఆలోచించాలని రిపోర్టర్‌కు సూచించారు. అయితే, ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు. ఇక బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చౌకబారు మాటలు మట్లాడుతున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్ ధర రూ.89.27 ఉంది. -
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
తెలుగుగడ్డపై సెంచరీ దాటిన డీజిల్
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయంటూ మరోసారి ధరలు పెంచాయి చమురు కంపెనీలు. ఈసారి లీటరు పెట్రోలుపై రూ. 43 పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 34 పైసుల వంతున ఛార్జీలు పెంచాయి. ఇలా వరుసగా పెరుగుతున్న ధరలతో తెలుగు గడ్డపై లీటరు డీజిల్ ధర సెంచరీ దాటింది. ఏపిలో చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 100.25కి చేరుకుంది. ఇక్కడ పెట్రోలు ధర 107.82గా ఉంది. మిగిలిన జిల్లాలలో సెంచరీకి చేరువగా వచ్చింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 104.93, లీటరు డీజిల్ 98.02గా ఉంది. ఇదే అత్యధికం జులైలో నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గరిష్టంగా లీటరు పెట్రోలుపై 36 పైసలు అత్యధికంగా ధర పెరిగింది. కానీ శనివారం పెరిగిన ధరల్లో లీటరు పెట్రోలుపై 43 పైసల వంతున ధర పెంచారు. ఇంకా పెరగొచ్చు ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. -
ఇండిగోకు ఇంధన సెగ..
-
ఇండిగోకు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 2017–18 క్యూ3లో ఇండిగో రూ.762 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఇండిగో మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం పెరిగి రూ.6,409 కోట్ల నుంచి రూ.8,229 కోట్లకు చేరుకుంది. అధిక ఇంధన ధరలు, కరెన్సీ పతనం తదితర అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. బీఎస్ఈలో బుధవారం ఇండిగో షేరు 0.89 శాతం క్షీణించి రూ. 1,108 వద్ద క్లోజయ్యింది.