సాక్షి, అమరావతి: ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. పెట్రోలు, డీజిల్ రేట్లతో ఖజానా నింపుకొంటున్నాయి. దీని కోసం ఎడా పెడా పన్నులు పెంచేస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆదాయం తగ్గుతోందని పన్నులు పెంచిన ప్రభుత్వాలు ఇప్పుడు దేశీయ మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరినా ఆ పెంచిన భారాన్ని తగ్గించడం లేదు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ. 79.81, డీజిల్ రూ.72.38కు చేరుకున్నాయి. గడిచిన రెండేళ్లలో పెట్రోలు ధరలు 22 శాతం, డీజిల్ ధరలు 34 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులే. ఈ రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై రూ. 11.47, డీజిల్‌పై రూ. 15.47 అదనపు పన్నులు విధించాయి. మోదీ ప్రభుత్వం సుంకాలను తొమ్మిదిసార్లు పెంచి ఒకసారి తగ్గించింది.
గత అక్టోబర్‌లో కేంద్రం సుంకం రూ. 2 తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి, 2015లో లీటర్‌కు రూ. 4 అదనపు వ్యాట్‌ను విధించింది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్‌ను తగ్గించమని రాష్ట్రాలకు కేంద్రం చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లోని బంకులు మూతపడుతున్నాయని పెట్రోలియం డీలర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఖజానా గలగలలు..
పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 15,000 కోట్ల ఆదాయం వస్తోంది. నేరుగా రాష్ట్రం విధించే వ్యాట్ ద్వారా గత ఏడాది రూ. 9,785.24 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 42 శాతం రాష్ట్ర వాటాను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ. 4,200 కోట్లు వస్తున్నాయి.
2015 ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధరలో రాష్ట్ర పన్నుల వాటా రూ. 13.99గా ఉంటే ఇప్పుడది సుమారు రూ. 22కు చేరింది. అదే విధంగా లీటరు డీజిల్ ధరలో పన్నుల వాట రూ. 8.86 నుంచి సుమారు రూ.16కు చేరింది. రాష్ట్రంలో ఏడాదికి సగటున పెట్రోల్ 320 కోట్ల లీటర్లు, డీజిల్ 125 కోట్ల లీటర్లు వినియోగం జరుగుతోంది. కేవలం రూ. 4 అదనపు వ్యాట్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 5,000 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది.
సంక్షోభంలో రవాణా రంగం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. దీంతో సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి లీటరు డీజిల్ ధర రూ. 48 వద్ద ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 72 దాటేసిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు వాపోయారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యాపారాలు లేక రవాణా చార్జీలు పెంచలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందన్నారు. ప్రతి కిలోమీటరు, టన్నుకు ఎంత ధర అన్నది నిర్ణయించమని ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పెడచెవినపెడుతోందన్నారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాట్ ఆదాయం
ఏడాది ఆదాయం (రూ. కోట్లలో) (జూన్–మార్చి)
2014-15 5,269.74
2015-16 8,074.71
2016-17 8,979.99
2017-18 9,785.24
నోట్: ఇది కాకుండా కేంద్రం వసూలు చేసే పన్నులో 42 శాతం రాష్ట్రానికి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment