
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ.. రూట్ తప్పింది. నష్టాలబాటలో సాగుతోంది. ఆర్థికభారంతో ఆగమాగమవుతోంది. టీఎస్ ఆర్టీసీకి ఇప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలకుతోడు రోజురోజుకు పెరుగుతున్న ఇంధనధరలు మరింత కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సంస్థకు రూ.3,000 కోట్ల వరకు అప్పులున్నాయి. ఏటా రూ.250 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తోంది. దీనికితోడు నిర్వహణపరంగా ఏటా రూ.700 వరకు నష్టం వాటిల్లుతోంది. నెలనెలా నష్టాలు పెరుగుతుండటం ఆర్టీసీని కలవరపాటుకు గురి చేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి రూ.273.15 కోట్ల నష్టాలు వాటిల్లడం ఆర్టీసీ యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. కేవలం 6 నెలల్లో ఇంత భారీగా నష్టాలు రావడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి రూ.241 కోట్ల నష్టాలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే రూ.32 కోట్లు అధికంగా నష్టాలు రావడం గమనార్హం.