
బడ్జెట్‌లో మహిళలకు ‘ఉచిత బస్’ ఊసే లేదు
మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
నేనే మా ఆడబిడ్డలను.. వంట ఇంటికి పరిమితం అయితే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేసి ఆఫీసులకు పంపించా. అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్లీ ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. టీవీల్లో చూసే మా ఆడబిడ్డలూ.. మీరు కూడా చప్పట్లు కొట్టండి. అభినందించండి. ఆశీర్వదించండి. ఇదీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. –2023 మే 28న మహానాడులో చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను బురిడీ బాబునని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని 20025–26 వార్షిక బడ్జెట్ సాక్షిగా మళ్లీ ప్రదర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రెడ్ సిగ్నల్ చూపించారు. ఈ పథకం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ)కి అరకొర కేటాయింపులతో సరిపెట్టి... ఈ ఏడాది కూడా మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేసేది లేదని తేల్చేశారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం దసరాకు వాయిదా వేశారు.
ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్‌లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు. 2025–26 వార్షిక బడ్జెట్‌లో ఆర్టీసీకి కేవలం రూ.4,309.85 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలకే ఏడాదికి రూ.3,600కోట్లు వెచ్చించాలి. మిగిలిన రూ.700 కోట్లు ఆర్టీసీ సాధారణ నిర్వహణ వ్యయానికే సరిపోవు. ఇక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు లేనట్టే.
చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,182 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదించారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కొత్తగా 2,045 బస్సులు కొనుగోలు చేయడంతోపాటు 11,479మంది అదనపు ఉద్యోగులను నియమించాలని స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూపాయి కేటాయించలేదు. ఇక కొత్త బస్సుల కొనుగోలు గురించి పట్టించుకోలేదు.
తీవ్రంగా నష్టపోతున్న మహిళలు
» ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు.
» రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం... అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా.మహిళల టికెట్ల ద్వారా నెలకు రూ.265కోట్లు రాబడి వస్తోంది.
» ఉచిత బస్ పథకాన్ని అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు నెలకు రూ.265కోట్లు చొప్పున నష్టపోతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు టీడీపీ కూటమి వల్ల గత 9 నెలల్లో మహిళలు రూ.2,385 కోట్లు నష్టపోయారు.
» 2025–26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేదని బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మహిళలు వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.3,182 కోట్లు నష్టపోవడం ఖాయమని తేటతెల్లమైంది. చంద్రబాబు మార్కు మోసం అంటే ఇదీ.