
ఆర్టీసీకి నిర్వహణ పరమైన ఖర్చుల భారం
5.10 కి.మీ. కంటే తగ్గిపోయిన కేఎంపీఎల్
ఏడాదికి అదనంగా వేయి టైర్లు కొనాల్సిన పరిస్థితి
వేగంగా దెబ్బతింటున్న కమాన్‌పట్టీలు
ప్రభుత్వానికి ఆర్టీసీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతితో నిర్వహణపరమైన ఖర్చులు కూడా తడిసిమోపెడవుతున్నట్టు ఆ సంస్థ లెక్కగట్టింది. కోల్పోతున్న టికెట్ ఆదాయానికి సరిపడా ప్రభుత్వం రీయింబర్స్ చేయటం లేదు. ఆ రూపంలో వస్తున్న నష్టానికి, ఇప్పుడు నిర్వహణపరమైన ఖర్చులు తోడవుతుండటంతో మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీపై భారం భారీగానే ఉంటోందని తెలుస్తోంది.
ఆక్యుపెన్సీ రేషియో వంద శాతానికి చేరటంతో బస్సుల్లో లోడ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆర్టీసీ బస్సుల మైలేజీ పతనమవుతోంది. ఇప్పటివరకు దేశంలో మెరుగైన కేఎంపీఎల్ (లీటరు డీజిల్‌కు వచ్చే మైలేజీ) విషయంలో తెలంగాణ ఆర్టీసీకి మెరుగైన రికార్డు ఉంది. సగటున తెలంగాణ ఆర్టీసీ బస్సులు లీటరు డీజిల్‌తో 5.18 కి.మీ.లు తిరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీ బస్సులను మినహాయిస్తే ఇది 5.5 కి.మీ.గా ఉంటోంది.
నగరంలో మైలేజీ తక్కువగా ఇచ్చే పరిస్థితులు ఉంటున్నందున అది సగటున 5.18గా నమోదవుతోంది. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి మైలేజీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కొన్ని నెలలుగా దాని సగటు 5.10 లోపే నమోదవుతోంది. ఈ రూపంలో డీజిల్ వినియోగం పెరిగింది. అది రోజుకు రూ.20 లక్షల వరకు ఉంటోందని సమాచారం. ఇక టైర్లు కూడా వేగంగా అరిగిపోతున్నాయి.
వాహన బరువు పెరిగేకొద్దీ టైర్ల జీవితం కాలం తగ్గుతుంది. సగటున 60 వేల కి.మీ. జీవితకాలం నుంచి 40 వేల కి.మీ.కు తగ్గినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సగటున సంవత్సరానికి 10 వేల వరకు టైర్లు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు అదనంగా మరో వేయి టైర్లు కొనాల్సి వస్తున్నట్టు సమాచారం. బస్సుల కమాన్‌పట్టీలు కూడా తొందరగా పాడవుతున్నాయి.
బస్‌పాస్ ఆదాయంలోనూ కోతే..
ఇక బస్ పాస్ ఆదాయంలో రోజుకు రూ.కోటి వరకు కోత పడుతోంది. గతంలో ఆర్టీసీ బస్‌పాస్‌లు తీసుకునే మహిళలు ఇప్పుడు ఉచితంగా ప్రయాణిస్తుండటంతో బస్‌పాస్‌ల సంఖ్య తగ్గిపోయింది. ఆ రూపంలో రోజుకు రూ.కోటి వరకు కోత పడుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమై ఏడాది దాటినందున, నిర్వహణ పరమైన భారంపై ఆర్టీసీకి స్పష్టత వచ్చింది.
దీంతో ఆర్టీసీకి మహాలక్ష్మి రూపంలో అందించే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచాలని కోరుతోంది. ప్రస్తుతం నెలకు రూ.310 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. అందులో కొంతమొత్తం బకాయి పెట్టి మిగతాది చెల్లిస్తోంది. ఇప్పుడు కనీసం దాన్ని రూ.400 కోట్లకు పెంచాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment