occupancy ratio
-
56% యువత, ఉద్యోగులే..
పట్టాలెక్కిన కొద్ది నెలల్లోనే ప్రయాణికులను వేగంగా తనవైపు ఆకర్షించుకుంటోందివందేభారత్ రైలు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి రూట్లలో మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడింటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతానికి పైగానే నమోదవుతోంది. ఆ రూట్లలో రెండో వందేభారత్ రైలును ప్రవేశపెట్టినా, ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్న కేటగిరీలపై ఓ సర్వే నిర్వహించింది. మొత్తం ప్రయాణికుల్లో 56 శాతం మంది యువకులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. –సాక్షి, హైదరాబాద్ యువకులే ఎక్కువ వందేభారత్ రైళ్లలో సగటున 29.08 శాతం యువతీయువకులే ఉన్నారు. 25–34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్టు తేలింది. వేగంగా గమ్యం చేరుతుండటంతో ఈ రైలులో ప్రయాణానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చదువు, ఉద్యోగ ప్రయత్నం, టూర్లు.. ఇతర పనులకు వెళ్లేందుకు ఈ రైలు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో పనులు వేగంగా చేసుకునే వీలు ఉండటం వీరికి కలిసి వస్తోంది. భద్రత పరంగా మెరుగ్గా ఉండటంతో ఒంటరిగా వెళ్లే యువతులు ఇందులో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్నారు. ఈ రైలు ఒకవైపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వరకు, రెండో వైపు మధ్యాహ్నం బయలు దేరి రాత్రి 11 వరకు గమ్యం చేరుతోంది. దీంతో అది సురక్షిత సమయంగా యువతులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులూ ఎక్కువే వందేభారత్ రైళ్లలో 26.85 శాతం మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు సర్వేలో తేలింది. గరుడ ప్లస్ బస్సు చార్జీతో వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు ఉండటాన్ని ఉద్యోగులు పరిగణిస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందేభారత్ దెబ్బకు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ చార్జీలను సవరించే పరిస్థితి వస్తోందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చని అంటున్నారు. ఈ సర్వే నివేదికను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, దాని ఆధారంగా వందేభారత్ రైళ్లలో మరిన్ని మార్పు చేర్పులు చేసే వీలుందని పేర్కొంటున్నారు. కాగా, 11.81 శాతం మంది వయో వృద్ధులు ఉంటున్నట్టు తేలింది. ప్రయాణాన్ని ఆస్వాదించండి వేగంగా గమ్యం చేరటంతోపాటు ప్రయాణికులు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల అవసరాలు గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మరింత ఉన్నతీకరిస్తున్నాం. అనతికాలంలోనే లక్షల మంది వాటిల్లో ప్రయాణించారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మిగతా ప్రయాణికులు కూడా వాటి సేవలను పొందాలని ఆశిస్తున్నాం. – అరుణ్‌కుమార్ జైన్, జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. కార్పొరేట్ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్ ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ ఉంటుందని ఇక్రా పేర్కొంది. అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది. ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది. -
ఆర్టీసీ.. టార్గెట్ మండే
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారాల్లో వివిధ పనులపై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రతి సోమవారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వారా టికెట్ ఆదాయం అధికంగా వచ్చేలా చర్యలు ప్రారంభించింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేసిన కసరత్తు సత్ఫలితం ఇవ్వడంతో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రత్యేక కసరత్తు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. దీంతో ఈ సోమవారానికి సంబంధించి కూడా ఆదివారం నుంచే కసరత్తు ప్రారంభించారు. డిపోల్లోని స్పేర్ బస్సులన్నింటినీ రోడెక్కించడంతోపాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు. ఇక సర్వీసులను అటూఇటూ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో ఎక్కువ బస్సులు తిప్పేందుకు రూట్లను మారుస్తున్నారు. గత సోమవారం 73 డిపోల లాభార్జన గత సోమవారం అంటే.. మే 15న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ. 20 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో సమకూరింది. గత సంవత్సర కాలంలో సంక్రాంతి ముగిసిన మర్నాడు, హోలీ రోజుల్లోనే ఇలా రూ. 20 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. కానీ ఇప్పుడు ఎలాంటి పండుగలు లేకున్నా సాధారణ రోజునే అలా రూ. 20 కోట్ల ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో రికార్డే. మే 15న ట్రాఫిక్ రెవెన్యూకు ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్, టోల్ సెస్‌లను కలపడం ద్వారా ఈ మొత్తం రికార్డయింది. టార్గెట్‌ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతంగా నమోదైంది. అధికారులు చేసిన ప్రత్యేక కసరత్తు వల్ల సాధారణ సోమవారాల్లో వచ్చే ఆదాయం కంటే దాదాపు రూ. 3 కోట్లు అదనంగా వచ్చింది. 96 డిపోలకుగాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జించాయి. -
16 రోజులు.. రూ. 29.44 కోట్లు
సాక్షి, అమరావతి: గత నెల 21 నుంచి రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రం.. 16 రోజుల్లో రూ. 29.44 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంటే సగటున రోజుకు రూ. 1.84 కోట్ల ఆదాయం సాధించింది. ఇందులో ఆన్లైన్ ద్వారా రూ. 58 లక్షలు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.1.26 కోట్ల ఆదాయం వచ్చింది. సాధారణంగా గతంలో 12 శాతం మాత్రమే ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్ జరిగేది. కరోనా కారణంగా ఆన్లైన్ లావాదేవీలు 32 శాతానికి చేరుకున్నాయి. ఆఫ్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు సగటున 1,922 గ్రౌండ్ బుకింగ్ పాయింట్లు పనిచేశాయి. మొదట్లో కేవలం 17 శాతం ఆపరేషన్స్ మాత్రమే ఏపీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. (బియ్యం డోర్ డెలివరీకి 8న ట్రయల్‌రన్) సంస్థలో అన్ని రకాల సర్వీసులు కలుపుకుని 14 వేలకు పైగా బస్సులుంటే, రోజుకు సగటున 2,323 బస్సుల్ని తిప్పుతోంది. తెలంగాణలో 70 శాతం బస్సులు తిప్పినా మొదట్లో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. ఏపీఎస్ఆర్టీసీ మాత్రం సగటున 49 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. సగటున రోజుకు 8.05 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. ఒక్కో బస్సుకు రోజుకు సగటున రూ. 7,955 ఆదాయం వచ్చింది. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసులు పెంచేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీట్ల సంఖ్యను కుదించి ఇప్పటివరకు నడుపుతున్న మాదిరిగానే బస్సులు తిప్పనున్నారు. ఇటు అంతర్ రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు సీఎస్ నీలం సాహ్ని లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ అంశం నేడు కొలిక్కి రానుంది. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ కాలంలో ఆర్టీసీకి రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. (‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ) -
ఆక్యుపెన్సీ రేషియో పెంచాలి
సాక్షి, హైదరాబాద్: బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (ఓ ఆర్)ను 80 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో డిపోలకు వెళ్లి అక్కడి ఉద్యోగులకు సంస్థపై నమ్మకం కలిగేలా చూడాలన్నారు. రాష్ట్ర రవాణా సంస్థ పురోగతి, ఉద్యోగుల సంక్షేమంపై శనివారం సంస్థ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రయాణికులు చేయెత్తిన చోట ఆపడం, అడిగిన చోట దింప డం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. -
ఏపీఎస్ఆర్టీసీకి 229 కోట్ల ఆదాయం
-
ఏపీఎస్ ఆర్టీసీకి దసరా ధమాకా
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) భారీగా ఆదాయం ఆర్జించింది. ఈ సీజన్లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గతఏడాది దసరా సీజన్ కంటే ఈసారి రూ.20 కోట్లు అధికంగా రావడం గమనార్హం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) ఏకంగా 103 శాతంగా నమోదైంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ఆదరణ మరింత పెరిగింది. మొత్తం పండగ సీజన్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి లభించింది. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిరోజూ సాధారణంగా రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 71 లక్షల మంది ప్రయాణిస్తారు. కలిసొచ్చిన టీఎస్ ఆర్టీసీ సమ్మె దసరా సీజన్ ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ చక్కగా వినియోగించుకుంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపారు. హైదరాబాద్‌లో ఈడీ స్థాయి అధికారిని అందుబాటులో ఉంచి, అక్కడి నుంచి రెగ్యులర్ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులను తిప్పారు. ప్రతిరోజూ దాదాపు 40 వేల మంది ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటారు. దసరా పండుగ సమయంలో ఈ సంఖ్య 75 వేలకు చేరింది. -
అయ్యో.. ఆర్టీసీ!
పెరగని ఆక్యుపెన్సీరేషియో రూ.2.20కోట్ల నష్టాల్లో ఎమ్మిగనూరు డిపో ఎమ్మిగనూరు: సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయివేటు వాహనాల తాకిడి.. పని చేయని పరిరక్షణ కమిటీ.. వెరసి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నష్టాల బాటలో నడుస్తోంది. డిపోలో ఆక్యుపెన్సీరేషియో పెరగకపోగా మరింత దిగజారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎమ్మిగనూరు డిపో ఒకప్పుడు లాభాలబాటలో ఉండేది. ప్రయివేటు వాహనాలు.. స్టీరింగ్, మాక్సి ఆటోలు ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సమయ పాలన కొరవడడం కూడా నష్టాలకు కొంత కారణంగా తెలుస్తోంది. సమయానికి బస్సులు రాని పరిస్థితి ఉండటంతో ప్రయాణీకులు అందుబాటులో ఉన్న ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సంపూర్ణంగా అమలు కావడంలేదన్న ఆరోపణలున్నాయి. డిపోకు సంబంధించి 84 బస్సులుండగా 48 సర్వీసులు పల్లెవెలుగులే. మిగతా వాటిలో 10 సూపర్ లక్జరీ, 24 ఎక్స్‌ప్రెస్, 2 ఆల్ట్రాడీలక్స్ బస్సులున్నాయి. వీటిలో సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైగా ఉండగా, పల్లెవెలుగు బస్సులకు 55శాతానికి మించడం లేదు. అధిక సర్వీసులుండే పల్లెవెలుగు బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి కనీసం 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో వస్తేనే రాబడికి, వ్యయానికి సరిపోతుంది. ప్రస్తుతం 75శాతం వరకు ఆక్యుపెన్సీ పెరిగినా నష్టాలు నివారించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో కూడా 2 నుంచి 3శాతం వరకు స్కూల్ పిల్లల బస్ పాసుల రీయింబర్స్మెంట్ డబ్బు కలుస్తోంది . అక్రమ రవాణాను అరికట్టకుండా ఆక్యుపెన్సీరేషియో పెంచాలనడం సమంజసం కాదని, వీటిని అరికడితే సీట్ల భర్తీ శాతం పెంచడం పెద్ద కష్టమేమికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా దిగువ చూపులు.. మూడేళ్లుగా ఎమ్మిగనూరు డిపో ఆక్యుపెన్సీ రేషియో హెచ్చుతగ్గులుగా ఉంటూ అసలైన రేషియోకు చేరుకోవడంలేదు. 2015–16లో 71శాతం, 2016–17లో 68శాతంగా ఉండగా 2017–18కి సంబంధించి ఇప్పటి వరకు 74శాతం మాత్రమే ఉంది. ఈ రేషియో 80శాతం వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమంటున్నారు ఆర్టీసీ అధికారులు. వరుసగా నష్టాలు.. ఎమ్మిగనూరు డిపో సుమారు రూ.3.90కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంగా రూ.1.68కోట్ల నష్టాన్ని పూడ్చినా రూ.2.20కోట్ల నష్టం మిగిలే ఉంది. అభయ పథకం, సేవాకేంద్రాలు, ట్రాఫిక్ గైడ్స్ నియామకం, గిఫ్ట్ స్కీం, వనిత, క్యాట్ కార్డులు తదితర పథకాలు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. పనిచేయని ఆర్టీసీ పరిరక్షణ కమిటీ.. ప్రయివేటు వాహనాలను నియంత్రిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏర్పాటు చేసిన ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు. కమిటీలో భాగస్వాములుగా ఉన్న డిపో మేనేజర్, స్థానిక ఎస్ఐ, ఆర్టీఓ.. నెలలో కనీసం రెండుసార్లు ఆయా రూట్లలో పర్యటించి అక్రమ వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు లైసెన్సులున్నాయో లేదో పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే డిపో పరిధిలో చాలా కాలంగా పరిరక్షణ కమిటీ పనిచేయడంలేదు. అమలుకు నోచుకోని మోటార్‌వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం 1989, సెక్షన్ 185(సి) ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయివేటు వాహనాలు, ఆటోలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కిలోమీటరు బయట ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు పరిరక్షణ కమిటీకి ఉంది. కానీ ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద అమలు కావడం లేదు. కమిటీ తరఫున కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉంచడంతో వారి మాట ప్రయివేటు బస్సులు, ఆటో వాలాలు వినడంలేదు. నిత్యం బస్టాండ్ ప్రధాన ద్వారం వద్దే ఉండి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. -
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
⇒కుదిస్తున్న పల్లెవెలుగు బస్సులతో విద్యార్థులకు కష్టం ⇒50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్లలో తగ్గిస్తున్న బస్సులు ⇒ఆర్టీసీ రీజియన్లలో పర్యటించని సేఫ్టీ ఆడిట్ టీంలు ⇒రోడ్ల అధ్వాన్న నిర్వహణపై లోపాలు చూపుతున్నా పట్టని ధోరణే సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో ‘అనంత’ దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బుధవారం అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ రవాణా లోపాలను బట్టబయలు చేస్తోంది. సంస్థలో రోడ్డు ప్రమాదాల రేటు 2014-15 సంవత్సరానికి 0.09గా ప్రకటించి నా బస్సుల నిర్వహణ, నడిపే విధానంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా పల్లెలకు తిరిగే బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులు కుదిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ప్రయాణికుల నిష్పత్తి 66 శాతానికి పెరుగుతున్నా, బస్సులను మాత్రం అందుకు తగ్గట్టు నడపడం లేదు. అనంతలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి రోడ్డు నిర్వహణతో పాటు విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడమేనన్నది ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు టాప్‌పైనా పదుల సంఖ్యలో కూర్చొని ప్రయాణిస్తున్నారంటే బస్సుల నిర్వహణా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌కే రూ.750 కోట్లు కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం బస్‌పాస్ రాయితీల రూపంలో రెండు రాష్ట్రాల్లో రూ.750 కోట్ల మేర ప్రతి ఏడాది చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే.. అందుకు తగ్గట్టు పలు ప్రధాన రూట్లలో బస్సులను మాత్రం ఆర్టీసీ నడపడం లేదు. ‘అనంత’ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఎక్కువ మంది విద్యార్థులే కాావడం గమనార్హం. బస్సులకు ‘పచ్చ’ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ బస్సుల నిర్వహణలో కనిపించడం లేదు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకున్న నిర్లక్ష్య ధోరణి ఈ దుర్ఘటనతో తేటతెల్లమవుతోంది. పల్లెవెలుగు బస్సులు నడిపితే 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కంటే తక్కువ ఉందని బస్సుల్ని రద్దు చేస్తున్నారు. ప్రతి రోజూ సగటున 46.26 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాల రేటు 0.09గా ఉంది. పల్లెవెలుగు బస్సులకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు, సూపర్వైజర్లు క్రమబద్ధంగా బస్సులను తనిఖీ చేయకపోవడం కూడా బ్రేక్ డౌన్లకు కారణమవుతోంది. కానరాని సేఫ్టీ ఆడిట్ బృందాల జాడ అత్యధిక ప్రమాదాల రికార్డు కలిగిన రీజియన్లలో ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాల్ని పరిశీలించేందుకు ఆయా రీజియన్లలో రోడ్ సేఫ్టీ ఆడిట్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం సర్క్యులర్ సూచనలు అమలు చేయడంతో పాటు ఈ బృందం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. అయితే ఆయా రీజియన్లలో ఈ బృందాల జాడ కనిపించడం లేదు. -
వినోదం ముణ్నాళ్ల ముచ్చటేనా..?
నల్లగొండ అర్బన్ : ప్రయాణికులను ఆకట్టుకోవడానికి, ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచుకునేం దుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ఆడియో సిస్టమ్ల్, ఎల్సీడీ టీవీల సౌకర్యం అనతికాలంలోనే అటకెక్కింది. ప్రయాణంలో వినో దం అందిస్తామని ఊదరగొట్టినా అదంతా ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది. ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా సేవలు అందించాలని భావించిన ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ప్రయాణికులకు పలు పథకాలు, రాయితీలు ఇస్తే చాలదనే యోచనతో ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి బస్సుల్లో ఎల్సీడీ టీవీలతో వినో దం అందించే ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నల్లగొండ రీజియన్‌లోని 16 బస్సుల్లో ఎల్సీడీ టీవీ లను అమర్చారు. మిర్యాలగూడ డిపోకు చెందిన 12 లగ్జరీ, నల్లగొండకు చెందిన 4 బస్సుల్లో ప్ర యోగాత్మకంగా ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లోని మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొన్నాళ్ల పాటు నడిపి వెనక్కి తగ్గారు. అదేమంటే తక్కువ దూరం ప్రయాణానికి ఇవి ఏ మాత్రం ఉపయోగకరం కావని తేల్చేశారు. ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు టీవీలకు బదులుగా ఆడియో సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఆ ఊసే లేకుండా పోయింది. ఏవీ ఆడియో సేవలు...? బస్సులు ఆదాయ మార్గంగానే కాకుండా ప్రజలకు విసుగెత్తని ప్రయాణం అందించి ఆకట్టుకోవాలని ఆరాటపడిన ఆర్టీసీ వారు బస్సుల్లో ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆడియో పాటలు మోగిస్తూ రయ్‌మంటూ దూసుకెళ్లే ఆటోలకు దీటుగా బస్సుల్లో ఆడియో సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు పాటలు వినిపించే అవకాశాన్ని కొన్నేళ్ల క్రితం అమల్లోకి తెచ్చినా కొద్దిరోజుల్లోనే మూగబోయింది. సీడీలు, పెన్‌డ్రైవ్‌లతో పాటలు వినిపిం చినా ఆ తర్వాత కొనసాగించడంలో విఫలం చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో... దగ్గర, దూరం అనే తేడా లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ వారు కొన్ని బస్సుల్లో ఎల్సిడీ టీవీలద్వారా సినిమాలు, మరికొన్ని బస్సుల్లో ఆడియో సిస్టమ్‌ల ద్వారా పాటలు వినిపిస్తూ ప్రయాణికుల్ని ఆకర్శిస్తుండగా ఆర్టీసీ వారు మాత్రం పాతపోకడలనే అవలంభిస్తున్నారు. పెరిగిన సాంకేతికను వినియోగించుకునే పరిస్థితుల్లో లేరు. బస్సుల్లో ఎల్సీడీ టీవీల ఏర్పాటు చేస్తె వినోద కార్యక్రమాలతో పాటు, ప్రయాణి సమాచారం, ప్రకటనలతో ఆదాయం కూడా పెరిగే అవకాశాలుం టాయి. కానీ నిర్వహణ లోపాలతో కుంటిసాకులు చెబుతూ మసకబార్చారు. ప్రైవేటు రంగంలో ట్రావెల్స్ బస్సుల్లో అమలు చేయగలిగే సౌకర్యాలను దేశంలోనే అతిపెద్ద ప్రజారంజకమైన ప్రభుత్వరంగ సంస్థగా పేరొందిన ఆర్టీసీ వారు మాత్రం తీర్చలేకపోతున్నారు. -
రైళ్లు కిటకిట
సాక్షి, గుంటూరు: సంక్రాంతి పండగ సందర్భంగా ఆదివారం ఉదయం పలు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లలో తిరిగే బస్సులు రద్దీగా మారాయి. ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి విశాఖపట్నం బయల్దేరే సింహాద్రి, మాచర్ల, కాచిగూడ, రేపల్లె, తెనాలి ప్యాసింజర్ రైళ్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి పలు కార్పొరేట్ కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఆదివారం ఉదయమే సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ గుంటూరు బస్టాండ్, రైల్వేస్టేషన్లు వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులో రద్దీగా కనిపించాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు గుంటూరు-ఒంగోలు, గుంటూరు-విజయవాడ, గుంటూరు-మాచర్ల, గుంటూరు-బాపట్ల రూట్లలో అదనంగా బస్సుల్ని నడిపారు. ఇందుకోసం అధికారులు 150కి పైగా బస్సుల్ని ఏర్పాటు చేశారు. రోజువారీగా తిరిగే ప్రయాణికులే కాకుండా అదనంగా మరో పది వేల మంది గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారుల అంచనా. సందడిగా ప్లాట్‌ఫాంలు... పండగ ప్రయాణికులతో గుంటూరు రైల్వేస్టేషన్‌లోని 1, 2, 4 నంబరు ప్లాట్‌ఫాంలు ఆదివారం సందడిగా మారాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ప్రయాణికుల హడావుడి సాయంత్రం 3 గంటల వరకూ కొనసాగింది. గుంటూరు మీదగా నడిచిన అన్ని రైళ్లూ కాలు మోపేందుకు సైతం చోటు లేక కిక్కిరిసిపోయాయి. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు ఉదయం 8 గంటలకు బయల్దేరిన సింహాద్రి ఫాస్ట్ ఫ్యాసింజర్ ఎక్కారు. ఉదయం 6 గంటలకు గుంటూరు నుంచి సికింద్రాబాద్ మీదగా వికారాబాద్ వరకూ వెళ్లే పల్నాడులోనూ ఆదివారం రెట్టింపు ప్రయాణికులు బయల్దేరారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ వెళ్లే విద్యార్థులు కూడా ఈ బండిలోనే ప్రయాణించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వ్డ్ బోగీలు సైతం సాధారణ ప్రయాణికులతో నిండిపోయాయి. అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు 40 శాతం పెరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఆర్టీసీ ఆదాయం... సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆదివారాల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో బాగా త క్కువగా ఉంటుంది. ఈ ఆదివారం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. బస్సులన్నీ కిటకిటలాడాయి. వివిధ రూట్లల్లో ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేశారు. దీనివల్ల రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు రూ.20 లక్షలకు పైగా అదనపు ఆదాయం సమకూరి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నాయి. రైల్వేకు కూడా ఆదాయం పెరిగింది. పెరిగిన ప్రయాణికుల కారణంగా ఆదివారం ఒక్కరోజే అదనంగా 20 శాతం ఆదాయం లభించే అవకాశాలున్నాయని సమాచారం.