సాక్షి, గుంటూరు: సంక్రాంతి పండగ సందర్భంగా ఆదివారం ఉదయం పలు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లలో తిరిగే బస్సులు రద్దీగా మారాయి. ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి విశాఖపట్నం బయల్దేరే సింహాద్రి, మాచర్ల, కాచిగూడ, రేపల్లె, తెనాలి ప్యాసింజర్ రైళ్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి పలు కార్పొరేట్ కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఆదివారం ఉదయమే సొంతూళ్లకు ప్రయాణమయ్యారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ గుంటూరు బస్టాండ్, రైల్వేస్టేషన్లు వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులో రద్దీగా కనిపించాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు గుంటూరు-ఒంగోలు, గుంటూరు-విజయవాడ, గుంటూరు-మాచర్ల, గుంటూరు-బాపట్ల రూట్లలో అదనంగా బస్సుల్ని నడిపారు. ఇందుకోసం అధికారులు 150కి పైగా బస్సుల్ని ఏర్పాటు చేశారు. రోజువారీగా తిరిగే ప్రయాణికులే కాకుండా అదనంగా మరో పది వేల మంది గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారుల అంచనా.
సందడిగా ప్లాట్‌ఫాంలు... పండగ ప్రయాణికులతో గుంటూరు రైల్వేస్టేషన్‌లోని 1, 2, 4 నంబరు ప్లాట్‌ఫాంలు ఆదివారం సందడిగా మారాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ప్రయాణికుల హడావుడి సాయంత్రం 3 గంటల వరకూ కొనసాగింది. గుంటూరు మీదగా నడిచిన అన్ని రైళ్లూ కాలు మోపేందుకు సైతం చోటు లేక కిక్కిరిసిపోయాయి. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు ఉదయం 8 గంటలకు బయల్దేరిన సింహాద్రి ఫాస్ట్ ఫ్యాసింజర్ ఎక్కారు.
ఉదయం 6 గంటలకు గుంటూరు నుంచి సికింద్రాబాద్ మీదగా వికారాబాద్ వరకూ వెళ్లే పల్నాడులోనూ ఆదివారం రెట్టింపు ప్రయాణికులు బయల్దేరారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ వెళ్లే విద్యార్థులు కూడా ఈ బండిలోనే ప్రయాణించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వ్‌డ్ బోగీలు సైతం సాధారణ ప్రయాణికులతో నిండిపోయాయి. అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు 40 శాతం పెరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
పెరిగిన ఆర్టీసీ ఆదాయం...
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆదివారాల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో బాగా త క్కువగా ఉంటుంది. ఈ ఆదివారం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. బస్సులన్నీ కిటకిటలాడాయి. వివిధ రూట్లల్లో ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేశారు. దీనివల్ల రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు రూ.20 లక్షలకు పైగా అదనపు ఆదాయం సమకూరి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నాయి. రైల్వేకు కూడా ఆదాయం పెరిగింది. పెరిగిన ప్రయాణికుల కారణంగా ఆదివారం ఒక్కరోజే అదనంగా 20 శాతం ఆదాయం లభించే అవకాశాలున్నాయని సమాచారం.
రైళ్లు కిటకిట
Published Mon, Jan 13 2014 12:21 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement