⇒కుదిస్తున్న పల్లెవెలుగు బస్సులతో విద్యార్థులకు కష్టం
⇒50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్లలో తగ్గిస్తున్న బస్సులు
⇒ఆర్టీసీ రీజియన్లలో పర్యటించని సేఫ్టీ ఆడిట్ టీంలు
⇒రోడ్ల అధ్వాన్న నిర్వహణపై లోపాలు చూపుతున్నా పట్టని ధోరణే
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో ‘అనంత’ దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
బుధవారం అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ రవాణా లోపాలను బట్టబయలు చేస్తోంది. సంస్థలో రోడ్డు ప్రమాదాల రేటు 2014-15 సంవత్సరానికి 0.09గా ప్రకటించి నా బస్సుల నిర్వహణ, నడిపే విధానంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా పల్లెలకు తిరిగే బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది.
నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులు కుదిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ప్రయాణికుల నిష్పత్తి 66 శాతానికి పెరుగుతున్నా, బస్సులను మాత్రం అందుకు తగ్గట్టు నడపడం లేదు. అనంతలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి రోడ్డు నిర్వహణతో పాటు విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడమేనన్నది ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు టాప్‌పైనా పదుల సంఖ్యలో కూర్చొని ప్రయాణిస్తున్నారంటే బస్సుల నిర్వహణా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రీయింబర్స్‌మెంట్‌కే రూ.750 కోట్లు
కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం బస్‌పాస్ రాయితీల రూపంలో రెండు రాష్ట్రాల్లో రూ.750 కోట్ల మేర ప్రతి ఏడాది చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే.. అందుకు తగ్గట్టు పలు ప్రధాన రూట్లలో బస్సులను మాత్రం ఆర్టీసీ నడపడం లేదు. ‘అనంత’ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఎక్కువ మంది విద్యార్థులే కాావడం గమనార్హం. బస్సులకు ‘పచ్చ’ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ బస్సుల నిర్వహణలో కనిపించడం లేదు.
ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకున్న నిర్లక్ష్య ధోరణి ఈ దుర్ఘటనతో తేటతెల్లమవుతోంది. పల్లెవెలుగు బస్సులు నడిపితే 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కంటే తక్కువ ఉందని బస్సుల్ని రద్దు చేస్తున్నారు. ప్రతి రోజూ సగటున 46.26 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాల రేటు 0.09గా ఉంది. పల్లెవెలుగు బస్సులకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు, సూపర్‌వైజర్లు క్రమబద్ధంగా బస్సులను తనిఖీ చేయకపోవడం కూడా బ్రేక్ డౌన్లకు కారణమవుతోంది.
కానరాని సేఫ్టీ ఆడిట్ బృందాల జాడ
అత్యధిక ప్రమాదాల రికార్డు కలిగిన రీజియన్లలో ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాల్ని పరిశీలించేందుకు ఆయా రీజియన్లలో రోడ్ సేఫ్టీ ఆడిట్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం సర్క్యులర్ సూచనలు అమలు చేయడంతో పాటు ఈ బృందం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. అయితే ఆయా రీజియన్లలో ఈ బృందాల జాడ కనిపించడం లేదు.
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
Published Thu, Jan 8 2015 6:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement