pallevelugu bus
-
పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్
సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్‌కు అదే వర్తిస్తుంది. విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది. ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్గేట్ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. ఆటోల దూకుడుకు కళ్లెం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం ‘టీ-9 టీకెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను ఇప్పటీకే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టీకెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో శుక్రవారం ‘టీ-9 టీకెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టీకెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ►‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. ►ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ► ‘టీ-9 టీకెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రకటీంచింది. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్లను కండక్టర్లు ఇస్తారు. ►తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి! ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటీజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టీ-9 టీకెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టీంది. ఈ టీకెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటీకే టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటీకి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టీకెట్లకు మంచి స్పందన వస్తుండటంతో తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం ‘టీ-9 టీకెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టీకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ‘టీ-9 టీకెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వెలుగులే నాన్‌స్టాప్‌లు
రాజమహేంద్రవరం సిటీ: పల్లె వెలుగు బస్సు ఏర్పాటు చేసి ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీ వసూలు చేస్తూ ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం డిపో నుంచి కాకినాడకు నిత్యం తెల్లవారు జాము నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు చొప్పున నాన్ స్టాప్ సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను నడపాల్సింది, రోజూకు రెండు నగరాల మధ్య 60 సర్వీసులను నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ రూ.65, ఆల్ట్రా డీలక్స్ రూ.80 సూపర్ డీలక్స్ రూ.85లు టిక్కెట్‌గా వసూలు చేస్తోంది. రాజమహేంద్రవరం– కాకినాడల మధ్య ఎక్స్‌ప్రెస్ బస్సు గంటన్నర సేపు ప్రయాణి స్తుంది. రూ.65లు వసూలు చేస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో ‘పల్లె వెలుగు’లను నడుపుతూ ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. రోజూ తిరిగే 60 సర్వీస్సుల్లో 40 సర్వీసులు పల్లె వెలుగు బస్సులను నడుపుతూ ఆర్టీసీ మోసాలకు పాల్పడుతోంది.ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో గంటన్నర సేపు జరగాల్సిన ప్రయాణం పల్లెవెలుగు బస్సుల్లో రెండున్నర గంటల సేపు ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయమై స్టేషన్ మేనేజర్ కొండలరావును వివరణ కోరగా బస్సులు కొరతవల్ల ‘పల్లె వెలుగు’లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో పల్లె వెలుగు బస్సు బోల్తా
చిత్తూరు : అనంతపురం జిల్లాలో పల్లె వెలుగు బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం మారుగానిపల్లె వద్ద శుక్రవారం ఉదయం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్ణాటక నుంచి మారుగానిపల్లె వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హఠాత్తుగా బస్సు ముందు చక్రాలు ఊడిపోయి అనంతరం కల్వర్టును ఢీకొని కాల్వలో పడినట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్లో లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
⇒కుదిస్తున్న పల్లెవెలుగు బస్సులతో విద్యార్థులకు కష్టం ⇒50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్లలో తగ్గిస్తున్న బస్సులు ⇒ఆర్టీసీ రీజియన్లలో పర్యటించని సేఫ్టీ ఆడిట్ టీంలు ⇒రోడ్ల అధ్వాన్న నిర్వహణపై లోపాలు చూపుతున్నా పట్టని ధోరణే సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో ‘అనంత’ దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బుధవారం అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ రవాణా లోపాలను బట్టబయలు చేస్తోంది. సంస్థలో రోడ్డు ప్రమాదాల రేటు 2014-15 సంవత్సరానికి 0.09గా ప్రకటించి నా బస్సుల నిర్వహణ, నడిపే విధానంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా పల్లెలకు తిరిగే బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులు కుదిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ప్రయాణికుల నిష్పత్తి 66 శాతానికి పెరుగుతున్నా, బస్సులను మాత్రం అందుకు తగ్గట్టు నడపడం లేదు. అనంతలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి రోడ్డు నిర్వహణతో పాటు విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడమేనన్నది ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు టాప్‌పైనా పదుల సంఖ్యలో కూర్చొని ప్రయాణిస్తున్నారంటే బస్సుల నిర్వహణా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌కే రూ.750 కోట్లు కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం బస్‌పాస్ రాయితీల రూపంలో రెండు రాష్ట్రాల్లో రూ.750 కోట్ల మేర ప్రతి ఏడాది చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే.. అందుకు తగ్గట్టు పలు ప్రధాన రూట్లలో బస్సులను మాత్రం ఆర్టీసీ నడపడం లేదు. ‘అనంత’ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఎక్కువ మంది విద్యార్థులే కాావడం గమనార్హం. బస్సులకు ‘పచ్చ’ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ బస్సుల నిర్వహణలో కనిపించడం లేదు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకున్న నిర్లక్ష్య ధోరణి ఈ దుర్ఘటనతో తేటతెల్లమవుతోంది. పల్లెవెలుగు బస్సులు నడిపితే 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కంటే తక్కువ ఉందని బస్సుల్ని రద్దు చేస్తున్నారు. ప్రతి రోజూ సగటున 46.26 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాల రేటు 0.09గా ఉంది. పల్లెవెలుగు బస్సులకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు, సూపర్వైజర్లు క్రమబద్ధంగా బస్సులను తనిఖీ చేయకపోవడం కూడా బ్రేక్ డౌన్లకు కారణమవుతోంది. కానరాని సేఫ్టీ ఆడిట్ బృందాల జాడ అత్యధిక ప్రమాదాల రికార్డు కలిగిన రీజియన్లలో ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాల్ని పరిశీలించేందుకు ఆయా రీజియన్లలో రోడ్ సేఫ్టీ ఆడిట్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం సర్క్యులర్ సూచనలు అమలు చేయడంతో పాటు ఈ బృందం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. అయితే ఆయా రీజియన్లలో ఈ బృందాల జాడ కనిపించడం లేదు.