సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్‌కు అదే వర్తిస్తుంది.
విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది.
ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్‌గేట్ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది.
ఆటోల దూకుడుకు కళ్లెం
చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు.
కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment