అయ్యో.. ఆర్టీసీ! | Occupancy Ratio staff neglect Yemmiganur RTC Depot | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఆర్టీసీ!

Published Fri, Sep 8 2017 11:50 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

అయ్యో.. ఆర్టీసీ!

అయ్యో.. ఆర్టీసీ!

పెరగని ఆక్యుపెన్సీరేషియో
రూ.2.20కోట్ల నష్టాల్లో ఎమ్మిగనూరు డిపో    


ఎమ్మిగనూరు:
సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయివేటు వాహనాల తాకిడి.. పని చేయని పరిరక్షణ కమిటీ.. వెరసి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నష్టాల బాటలో నడుస్తోంది. డిపోలో ఆక్యుపెన్సీరేషియో పెరగకపోగా మరింత దిగజారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎమ్మిగనూరు డిపో ఒకప్పుడు లాభాలబాటలో ఉండేది. ప్రయివేటు వాహనాలు.. స్టీరింగ్, మాక్సి ఆటోలు ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సమయ పాలన కొరవడడం కూడా నష్టాలకు కొంత కారణంగా తెలుస్తోంది. సమయానికి బస్సులు రాని పరిస్థితి ఉండటంతో ప్రయాణీకులు అందుబాటులో ఉన్న ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సంపూర్ణంగా అమలు కావడంలేదన్న ఆరోపణలున్నాయి.

డిపోకు సంబంధించి 84 బస్సులుండగా 48 సర్వీసులు పల్లెవెలుగులే. మిగతా వాటిలో 10 సూపర్‌ లక్జరీ, 24 ఎక్స్‌ప్రెస్, 2 ఆల్ట్రాడీలక్స్‌ బస్సులున్నాయి. వీటిలో సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైగా ఉండగా, పల్లెవెలుగు బస్సులకు 55శాతానికి మించడం లేదు. అధిక సర్వీసులుండే పల్లెవెలుగు బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల నుంచి కనీసం 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో వస్తేనే రాబడికి, వ్యయానికి సరిపోతుంది. ప్రస్తుతం 75శాతం వరకు ఆక్యుపెన్సీ పెరిగినా నష్టాలు నివారించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో కూడా 2 నుంచి 3శాతం వరకు స్కూల్‌ పిల్లల బస్‌ పాసుల రీయింబర్స్‌మెంట్‌ డబ్బు కలుస్తోంది . అక్రమ రవాణాను అరికట్టకుండా ఆక్యుపెన్సీరేషియో పెంచాలనడం సమంజసం కాదని, వీటిని అరికడితే సీట్ల భర్తీ శాతం పెంచడం పెద్ద కష్టమేమికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడేళ్లుగా దిగువ చూపులు..
మూడేళ్లుగా ఎమ్మిగనూరు డిపో ఆక్యుపెన్సీ      రేషియో హెచ్చుతగ్గులుగా ఉంటూ అసలైన రేషియోకు చేరుకోవడంలేదు.  2015–16లో 71శాతం, 2016–17లో 68శాతంగా ఉండగా 2017–18కి సంబంధించి ఇప్పటి వరకు 74శాతం మాత్రమే ఉంది. ఈ రేషియో 80శాతం వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమంటున్నారు ఆర్టీసీ అధికారులు.   

వరుసగా నష్టాలు..
ఎమ్మిగనూరు డిపో సుమారు రూ.3.90కోట్ల నష్టాల్లో  ఉంది. ఏడాది కాలంగా రూ.1.68కోట్ల నష్టాన్ని పూడ్చినా రూ.2.20కోట్ల నష్టం మిగిలే ఉంది. అభయ పథకం, సేవాకేంద్రాలు, ట్రాఫిక్‌ గైడ్స్‌ నియామకం, గిఫ్ట్‌ స్కీం, వనిత, క్యాట్‌ కార్డులు తదితర పథకాలు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది.  

పనిచేయని ఆర్టీసీ పరిరక్షణ కమిటీ..  
ప్రయివేటు వాహనాలను నియంత్రిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏర్పాటు చేసిన ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు. కమిటీలో భాగస్వాములుగా ఉన్న డిపో మేనేజర్, స్థానిక ఎస్‌ఐ, ఆర్టీఓ.. నెలలో కనీసం రెండుసార్లు ఆయా రూట్లలో పర్యటించి అక్రమ వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు లైసెన్సులున్నాయో లేదో పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి.    అయితే డిపో పరిధిలో చాలా కాలంగా పరిరక్షణ కమిటీ పనిచేయడంలేదు.  

అమలుకు నోచుకోని  మోటార్‌వాహనాల చట్టం
ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల చట్టం 1989, సెక్షన్‌ 185(సి) ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయివేటు వాహనాలు, ఆటోలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కిలోమీటరు బయట ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు పరిరక్షణ కమిటీకి ఉంది. కానీ ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వద్ద అమలు కావడం లేదు. కమిటీ తరఫున కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఉంచడంతో వారి మాట ప్రయివేటు బస్సులు, ఆటో వాలాలు వినడంలేదు. నిత్యం బస్టాండ్‌ ప్రధాన ద్వారం వద్దే  ఉండి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement