హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలేమో ఖరీదు ఎక్కువ. ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో (సీఎన్‌జీ) నడిచే వాహనాలు వినియోగదార్లకు ప్రత్యామ్నాయం అయ్యాయని ఎన్‌ఆర్‌ఐ (నోమురా రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్) కన్సల్టింగ్, సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2021-22లో దేశంలో సీఎన్‌జీ వాహనాలు 2,65,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. 2018 నాటికి దేశవ్యాప్తంగా 30.9 లక్షల యూనిట్ల సీఎన్‌జీ వెహికిల్స్ ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 37.97 లక్షల యూనిట్లకు చేరుకుంది. బీఎస్-6 ఇంధన ప్రమాణాలు అమలయ్యాక యాజమాన్య ఖర్చులు తక్కువగా ఉండడంతో సీఎన్‌జీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
అధిక ఇంధన సామర్థ్యంతో..
సాంకేతికత అందిపుచ్చుకున్న ఇక్కడి తయారీ కంపెనీలు తక్కువ ధరలో అధిక ఇంధన సామర్థ్యం ఉన్న సీఎన్‌జీ వేరియంట్లను ప్రవేశ పెడుతున్నాయి. సీఎన్‌జీ విక్రయ కేంద్రాలు విస్తరించడం, నియంత్రణ వ్యవస్థ మద్దతు ఈ విభాగం వృద్ధికి తోడ్పడుతోంది. మరోవైపు అధిక గ్యాస్ ధరలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమల నెట్‌వర్క్ విస్తరణను పరిమితం చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బయో సీఎన్‌జీ పర్యావరణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. భారత బయో సీఎన్‌జీ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా చేరుకున్నట్లయితే.. దేశంలోని ప్రస్తుత సహజ వాయువు డిమాండ్‌ను తీర్చగలదు. 54 లక్షల అదనపు వాహనాలకు శక్తినివ్వగలదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment