నష్టాల బాటలో ఎంఎస్‌ఆర్‌టీసీ
సాక్షి, ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్‌లైన్‌గా పేరొందిన మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్‌ఆర్‌టీసీ) నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఆర్‌టీసీకి చెందిన 250 డిపోలున్నాయి. వీటిలో 52 మినహా మిగిలిన 198 బస్సు డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. నష్టాలకు టోల్ పన్ను, ఇంధనం ధరలతోపాటు అనేక కారాణాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఆర్‌టీసీని ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతేను కోరారు.
దీనిపై స్పందించిన ఆయన ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సులకు టోల్ మాఫి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మాత్రం ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సులకు టోల్‌మాఫీ చేయలేదు. ప్రభుత్వ పన్నుల పరంగా ఎంఎస్‌ఆర్‌టీసీ ప్రతి సంవత్సరం సుమారు రూ. 850 కోట్లు చెల్లిస్తోంది. వీటిలో టోల్ మాఫీ అయితే కొంతమేర ఊరట లభించనుంది. 2014 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు ముంబై, పుణేలో అత్యధిక లాభాలు ఎంఎస్‌ఆర్‌టీసీకి వచ్చాయి. అనంతరం ఔరంగాబాగ్ డివిజన్‌లో రూ. 19 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇవి మినహా మిగిలిన ప్రాంతాల్లో నష్టాన్ని చవిచూడాల్సివస్తోంది. డిపోల వారీగా పరిశీస్తే దేవరుఖ్, పాల్ఘర్, పన్వేల్, నాసాసపారా, విఠల్‌వాడీ తదితర డిపోల పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఆర్‌టీసీని ఆదుకునేందుకు టోల్‌మాఫీ చేయడంతోపాటు వివిధ పన్నులను మాఫీ చేయాలని లేదా రాయితీలు ఇవ్వాలని ఎంఎస్‌ఆర్‌టీసీ పదాధికారులు కోరుతున్నారు.