msrtc
-
ఆర్టీసీ కార్మికుల సమ్మె.. శరద్ పవార్ ఇంటిపై చెప్పులు విసిరిన కార్మికులు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎమ్‌ఎస్‌అర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంస్థకు చెందిన కార్మికులు ముంబైలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని చుట్టుముట్టారు. దక్షిణ ముంబైలోని పవార్ నివాసం 'సిల్వర్ ఓక్' వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన శరద్ పవర్.. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల్లో కొందరు రోడ్డుపై బైఠాయించగా మరికొందరు ఆగ్రహం పట్టలేక శరద్ పవర్ ఇంటిపై రాళ్లు, చెప్పులు, బూట్లు విసిరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో శరద్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భద్రత బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ గత నవంబర్ నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: గవర్నర్, సీఎం... విభేదాల పర్వం ఆ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘సమ్మె మొదలైనప్పటి నుంచి 120 మంది కార్మికులు మరణించారు. ఇవన్నీ ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ విధానం వల్ల జరిగిన హత్యలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్సీపీ చీఫ్ సమస్యను పరిష్కరించేందుకు ఏ కృషి చేయలేదు. హైకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మేము ప్రభుత్వంతో మా సమస్యల గురించి చర్చిస్తున్నాం. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రభుత్వం నేడు మా కోసం ఏం చేయడం లేదు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వంలో చాణక్యగా వ్యవహరించే శరద్ పవార్ కూడా మా కార్మికుల మరణాలకు కారణం.’ అంటూ మండిపడ్డారు కాగా ఏప్రిల్ 22 నాటికి సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బొంబాయి హైకోర్టు ఆదేశించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు గడువులోపు విధుల్లో చేరే కార్మికులపై ఎటువంటి చర్య తీసుకోమని కోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ హామీ ఇచ్చారు. -
ఒలెక్ట్రాకు ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సులకు ఆర్డరు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్ కన్సార్షియంనకు లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) అందినట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ సుమారు రూ. 250 కోట్లు. రాబోయే 10 నెలల వ్యవధిలో వీటిని అందించాల్సి ఉంటుంది. ఈ బస్సులను ముంబై–పుణె మధ్య నడుపుతారు. కొత్త ఆర్డరుతో ఒలెక్ట్రా ఆర్డర్ల సంఖ్య 1,550కి చేరింది. మరోవైపు, సీతారాంపూర్ పారిశ్రామిక పార్కు ప్లాంటులో ఉత్పత్తి 2022–23 నుంచి ప్రారంభం కాగలదని ఒలెక్ట్రా చైర్మన్ కేవీ ప్రదీప్ వెల్లడించారు. అత్యాధునికమైన పూర్తి స్థాయి ఆటోమేటెడ్ ప్లాంటులో ఏటా 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ట్రక్కులు, త్రిచక్ర వాహనాలు, తేలికపాటి.. మధ్య స్థాయి వాణిజ్య వాహనాలు కూడా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. దీనితో ఉపాధి అవకాశాలు పెరగగలవని, ఎకానమీ వృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడగలదని ప్రదీప్ వివరించారు. ఒలెక్ట్రాకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామిక పార్కులో.. టీఎస్ఐఐసీ 150 ఎకరాల స్థలం కేటాయించింది. రూ. 69 కోట్లకు ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయం 38 శాతం పెరిగి రూ. 69 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 50 కోట్లు. 2020 రెండో త్రైమాసికంలో ఏడు బస్సులు సరఫరా చేయగా తాజా క్యూ2లో 18 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసినట్లు, పుణెలో కార్యకలాపాల ఊతంతో నిర్వహణ ఆదాయం మరింత పెరిగినట్లు సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల విభాగం ఆదాయం రూ. 17.8 కోట్ల నుంచి రూ.42.1 కోట్లకు పెరగ్గా, ఇన్సులేటర్స్ విభాగం మాత్రం 17 శాతం క్షీణించిందని పేర్కొంది. సమీక్షాకాలంలో కంపెనీ నికర లాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్లకు చేరింది. -
అహంభావంతోనే సమ్మెకు దిగారు..
సాక్షి, ముంబయి : కార్మిక సంఘాలపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రవోటే ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) ఉద్యోగులు, కార్మికులు ఇటీవల చేపట్టిన సమ్మె కార్మిక సంఘాల అహంభావ సమస్యల ఫలితమేనని వ్యాఖ్యానించారు. వేతన పెంపును కోరుతూ శుక్రవారం ఎంఎస్ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం పలు డిపోల ఎదుట ఆందోళనలతో సమ్మె బాట పట్టారు. సమ్మె కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోయి వేలాది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రి రవోటేతో కార్మిక సంఘాల సంప్రదింపుల నేపథ్యంలో శనివారం సమ్మెను నిలిపివేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నేరుగా ఉద్యోగులు సమ్మెకు దిగరాదని తాను ఎంఎస్ఆర్టీసీ ఎండీకి స్పష్టం చేశానని చెప్పారు. ఉద్యోగులందరూ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నారని రవోటే తెలిపారు. కార్మిక సంఘాల అహంభావ ధోరణి కారణంగానే కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టారని వ్యాఖ్యానించారు. జూన్ 1న ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపుపై ప్రభుత్వంతో వారు అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయని చెప్పారు. వారు కొత్తగా ఎలాంటి వేతన పెంపునూ కోరలేదని..వారి డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా వారి మంకుపట్టును తాను సంతృప్తిపరిచానని మంత్రి చెప్పుకొచ్చారు. -
నష్టాల బాటలో ఎంఎస్ఆర్టీసీ
సాక్షి, ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్‌లైన్‌గా పేరొందిన మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఆర్టీసీకి చెందిన 250 డిపోలున్నాయి. వీటిలో 52 మినహా మిగిలిన 198 బస్సు డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. నష్టాలకు టోల్ పన్ను, ఇంధనం ధరలతోపాటు అనేక కారాణాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ఆర్టీసీని ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతేను కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఎంఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ మాఫి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మాత్రం ఎంఎస్ఆర్టీసీ బస్సులకు టోల్‌మాఫీ చేయలేదు. ప్రభుత్వ పన్నుల పరంగా ఎంఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం సుమారు రూ. 850 కోట్లు చెల్లిస్తోంది. వీటిలో టోల్ మాఫీ అయితే కొంతమేర ఊరట లభించనుంది. 2014 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు ముంబై, పుణేలో అత్యధిక లాభాలు ఎంఎస్ఆర్టీసీకి వచ్చాయి. అనంతరం ఔరంగాబాగ్ డివిజన్లో రూ. 19 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవి మినహా మిగిలిన ప్రాంతాల్లో నష్టాన్ని చవిచూడాల్సివస్తోంది. డిపోల వారీగా పరిశీస్తే దేవరుఖ్, పాల్ఘర్, పన్వేల్, నాసాసపారా, విఠల్‌వాడీ తదితర డిపోల పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఆర్టీసీని ఆదుకునేందుకు టోల్‌మాఫీ చేయడంతోపాటు వివిధ పన్నులను మాఫీ చేయాలని లేదా రాయితీలు ఇవ్వాలని ఎంఎస్ఆర్టీసీ పదాధికారులు కోరుతున్నారు. -
ఏసీ వోల్వోతో నష్టమే..
ముంబై-నాగపూర్ మధ్య నడుస్తున్న సర్వీసులు పయాణికుల నుంచి స్పందన నిల్ సాక్షి, ముంబై: నాగపూర్-ముంబై ప్రధాన నగరాల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ప్రవేశపెట్టిన ఏసీ వోల్వో బస్సుకు ప్రయాణికుల నుంచి తగినంత స్పందన రావడం లేదు. దీంతో ఈ సేవలు నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు మరింత మెరుగ్గా, వేగవంతంగా సాగేందుకు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల ఆరో తేదీన ఏసీ వోల్వో బస్సు సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతుండటంతో ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు పెరిగి మంచి కలెక్షన్లు వస్తాయని ఆర్టీసీ భావించింది. కాని సేవలు ప్రారంభించి సుమారు వారం రోజులు కావస్తున్నప్పటికీ వేళ్లపై లెక్కించే విధంగా ప్రయాణికులు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులతో పోలిస్తే వీటిలో చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ముంబై-నాగపూర్ మధ్య సుమారు 900 కి.మీ. దూరం ఉండగా గమ్యం చేరడానికి 17 గంటల సమయం పడుతుంది. దీని నిమిత్తం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2,370 చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రయాణానికి ట్రిప్పునకు 225 లీటర్ల డీజిల్ (సుమారు రూ.15 వేలు) అవసరముంటుంది. దూర ప్రయాణం కావడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు మధ్యలో మారాల్సి వస్తుంది. అందుకు వారికి రూ.ఐదు వేలు (వేతనం, ఇతర భత్యాలు కలిపి), అదే విధంగా బస్సు నిర్వహణకు (ఇంజిన్ అయిల్ ఇతర పనులకు) రూ.ఐదు వేలు ఖర్చవుతాయి. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.25 వేలు ఖర్చవుతున్నాయి. గడిచిన ఈ వారం రోజుల్లో ఒక్కో బస్సుకు సరాసరి ఆదాయం రూ.28 వేల చొప్పున వచ్చింది. దీంతో ఈ బస్సులు నడిపి ప్రయోజనం లేకుండా పోయింది. అదే ప్రైవేటు ఏసీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి రూ.1400 వసూలు చేస్తున్నారు. దీంతో చార్జీలు రూ. ఏడు, ఎనిమిది వందల వరకు తగ్గించాలని ఆర్టీసీ ఫేస్ బుక్‌లో, వాట్సప్‌లో ప్రయాణికులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలాగే సమయానికి గమ్యస్థానం చేర్చడం లేదనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. -
ఎమ్మెస్సార్టీసీకీ భారీ ఆదాయం
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) గణేశ్ ఉత్సవాల పుణ్యమా.. గట్టెక్కింది. ఉత్సవాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంకణ్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్వాడి తదితరా జిల్లాలకు లక్షలాది ప్రయాణికులను ఎమ్మెస్సార్టీసీ చేరవేసింది. ఆర్టీసీ బస్సులన్నీ వంద శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించాయి. ఈ వారం, పది రోజుల్లో మంచి ఆదాయం వచ్చిందని ముంబై రీజియన్ ఆర్టీసీ జనరల్ మేనేజరు రాహుల్ తోరో తెలిపారు. ఉత్సవాల సమయంలో మొత్తం 7,984 ట్రిప్పులు నడిపి 3.51 లక్షల మందిని చేరవేసింది. ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే రైళ్లు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నడిచాయి. అందులో ఉత్సవాలకు రెండు రోజుల ముందు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, రైళ్ల రాకపోక వేళలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక రైళ్లను రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఇక కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించక తప్పలేదు. ఇది ఆర్టీసీకి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో.. సాధారణ రోజుల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోని వివిధ బస్ డిపోల నుంచి కొంకణ్ దిశగా 1,686 ట్రిప్పులు నడుస్తాయి. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 26-29 మధ్యన అదనంగా 1,924 ట్రిప్పులు నడిపారు. ఈ నెల 8వ తేదీన ఉత్సవాలు పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో సుమారు అంతే సంఖ్యలో ట్రిప్పులు, అంతే సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ మంచి ఆదాయాన్ని రాబట్టింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గణేశ్ ఉత్సవాలు కొంత మేర ఆదుకున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. -
ఆర్టీసీపై బస్సు ఆపరేటర్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) గణేశ్ ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సును నడపడం ప్రైవేట్ వాహనాల యజమానులకు మింగుడుపడడం లేదు. తమ లాభాలను ఎమ్మెస్సార్టీసీ మింగేస్తుందని మండిపడుతున్నారు. ఎమ్మెస్సార్టీసీ.. కొంకణ్ వరకు ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సులను నడుపుతోంది. వాషికి చెందిన ట్రావెల్ ఏజెంట్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘గణేశ్ చవితి నిమిత్తం ఎమ్మెస్సార్టీసీ అదనంగా బస్సు సేవలను అందిస్తుండడంతో మేం భారీమొత్తంలో నష్టాలను చవి చూస్తున్నాం. ప్రయాణికులు కూడా విలాసవంతమైన ప్రయాణానికి ఆశ పడకుండా చౌక ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఎమ్మెస్సార్టీసీ అదనపు బస్సు సేవలను ప్రారంభించి మా లాభాలను మింగేస్తోంది’ అని అన్నారు. మరో ట్రావెల్ ఏజెంట్ గులాబ్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఈసారి గణేశోత్సవాల నిమిత్తం కొంకణ్ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో ఎమ్మెస్సార్టీటీ ఈసారి అదనంగా కొంకణ్‌కు బస్సు సేవలను ప్రారంభించిందని చెప్పారు. ప్రయాణికులు పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో బంధువుల ఇళ్లకి వెళుతుంటారు. వీరిలో చాలా మంది తక్కువ చార్జీలు ఉండే ఎమ్మెస్సార్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారని తెలిపారు. దీంతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఇదిలా వుండగా కొంత మంది ఏజెంట్లు సాధారణంగా కొంకణ్‌కు 25 నుంచి 30 బస్సులను మాత్రమే నడుపుతారు. పండుగలు పురస్కరించుకొని ఏడు నుంచి ఎనిమిది బస్సులను అదనంగా నడుపుతారు. అయితే ప్రస్తుతం గణేశ్ చతుర్థి నిమిత్తం చాలా తక్కువ బస్సులను ప్రారంభించారు. ఈసారి తాము కేవలం రెండు బస్సులను మాత్రమే అదనంగా ప్రారంభించామని గులాబ్ వివరించారు. రద్దీ సీజన్లో తమ ఆదాయం 50 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్టీసీ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి గణేశోత్సవాలకు కొంకణ్‌కు తరలి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడాన్ని గమనించి ఈసారి దాదాపు 500 బస్సులను అదనంగా ప్రారంభించామన్నారు. కొంకణ్‌కు చెందిన ప్రయాణికుడు ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గణేశ్ చతుర్థి నిమిత్తం రత్నగిరికి కుటుంబ సమేతంగా తరలి వెళుతుంటామని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే టికెట్ చార్జీలు అధికంగా ఉంటాయని తెలిపారు. అందుకే తామంతా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎంచుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణ సౌకర్యం కంటే గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. -
బకాయిల చెల్లింపు కోసం బాదుడు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఎమ్మెస్సార్టీసీ) బస్ చార్జీలను 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన చార్జీలు మొదటి రెండు స్టేజీ (12 కి.మీ.)లకు వర్తించవని, ఆపై ప్రయాణానికి 2.5 శాతం చొప్పున చార్జీలు వసూలు చేస్తారన్నారు. ఎమ్మెస్సార్టీసీ ఉద్యోగులకు ఏరియర్స్‌ను పెంచి ఇచ్చేందుకే ఈ చార్జీలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ఏరియర్స్ పెంచకపోతే జూన్ 4 నుంచి ఆందోళనకు దిగుతామని సిబ్బంది, యూనియన్లు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో ఏసీ బస్సు చార్జీలు కూడా... ఏసీ బస్సుల చార్జీలను కూడా పెంచే అవకాశముందని, త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు పెంచాలని నిర్ణయించిన చార్జీల పట్టిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారని, పట్టిక సిద్ధమవుతోందన్నారు. శ్రమ ఫలించింది..: యూనియన్లు ఏరియర్స్ పెంపు కోసం తాము చేస్తున్న ఆందోళన సత్ఫలితాలనిచ్చిందని యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏరియర్స్, కరవు భత్యాన్ని పెంచాలని కొన్ని నెలలుగా కోరుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో మంగళవారం పలు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, జూన్ 4వ తేదీన 80 వేలకుపైగా సిబ్బందితో ఆందోళనకు దిగుతామని హెచ్చరించామని యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చార్జీలను పెంచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏరియర్స్‌ను చెల్లించేందుకు నిరాకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు నెలల్లోపే... మార్చిలో చార్జీలను పెంచుతూ ప్రయాణికులపై భారం మోపిన ఎమ్మెస్సార్టీసీ మూడు నెలలు తిరగకుండానే మరోసారి చార్జీలను పెంచింది. గత మార్చిలో ఏసీ బస్ చార్జీలను రూ.15 పెంచారు. దాదర్-పుణే ఏసీ బస్ చార్జీలను రూ.390 నుంచి 405కు పెంచారు. బోరివలి నుంచి పుణే వరకు ప్రయాణించేవారికి రూ.465 నుంచి 480 వరకు చార్జీలను పెంచారు. ఏసీ బస్సు చార్జీలను కూడా త్వరలో పెంచనున్నారు. -
ప్రయాణం మరింత భారం
సాక్షి, ముంబై: ముంబై నుంచి పుణే వరకు శివ నేరి వోల్వో బస్సుల్లో రాకపోకలు సాగించేవారికి ఇకనుంచి ప్రయాణం మరింత భారం కానుంది. శీతల బస్సుల చార్జీలను ఎంఎస్ఆర్టీసీ 2.54 శాతం మేర పెంచింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పెరిగిన చార్జీల భారం మోయలేక సతమతమవుతున్న నగరవాసుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. పెంచిన చార్జీలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ముంబై నుంచి పుణే వరకు ప్రయాణ చార్జీని రూ.15 మేర పెంచారు. దీంతో దాదర్-పుణే ఏసీ బస్సు టికెట్ చార్జీ రూ.390 నుంచి 405కు చేరుకుంది. అదేవిధంగా బోరివలి-పుణే ఏసీ బస్సు చార్జీని రూ.465 నుంచి 480కి పెంచారు. ఇంధన ధరలు తరచూ మారుతున్న కారణంగా శివనేరి ఏసీ బస్సులతోపాటు సాధారణ, సెమీ లగ్జరీ బస్సుల చార్జీలను పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎమ్మెస్సార్టీసీ ప్రజాసంబంధాల అధికారి ముకుంద్ వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయాణం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ప్రయాణ సమయంలోనే ఈ పెరిగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
లోయలో ఘోరకలి
సాక్షి, ముంబై: కన్ను మూసి తెరిచేలోపు 27 మంది ప్రాణాలు గాలిలోకి కలసి పోయాయి. నిత్యం పచ్చగా కనిపించే మాల్శేజ్లోయ ఎరుపురంగులోకి మారింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎంఎస్ఆర్టీసీ) బస్సు గురువారం ఘోరప్రమాదానికి గురికావడంతో 27 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మద్‌నగర్ బయలుదేరిన బయల్దేరిన ఈ బస్సు ఠాణే-నాసిక్ జిల్లా సరిహద్దులో ఉన్న మాల్శేజ్‌ఘాట్ లోయలో పడింది. సుమారు 300 అడుగులకుపైగా లోతున్న లోయలో పడడంతో బస్సు మూడు ముక్కలుగా మారి నుజ్జునుజ్జయింది. ఈ సందర్భంగా గాయపడ్డ 11 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ కండక్టర్లతోపాటు ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు. విఠల్వాడి డిపోకు చెందిన ఈ బస్సు ఉదయం సుమారు 5.45 గంటలకు ఠాణేలోని లోకమాన్యనగర్ నుంచి నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మద్‌నగర్‌కు బయలుదేరింది. కండక్టర్, డ్రైవర్ సహా ఇందులో మొత్తం 38 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు జున్నర్ తీర్థయాత్రకు బయలుదేరారు. వీరి ప్రయాణం మాల్శేజ్ ఘాట్ వరకు బాగానే సాగింది. టోకావడే పోలీసు స్టేషన్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని శంకర్ మందిరం సమీపంలో ఒక లారీ ఎదురు వచ్చింది. కలపతో నిండి ఉన్న లారీ, ఆర్టీసీ బస్సు కుడివైపు స్వల్పంగా ఢీకొంది. దీన్ని తప్పించాలనే తాపత్రయంతో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తిప్పాడు. దీంతో అది ఒక్కసారిగా సుమారు 300 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భీతిల్లి ఆర్తనాదాలు మొదలుపెట్టారు. బస్సు కుదుపులతోపాటు మెల్లమెల్లగా భారీ శబ్దంతో కిందికి జారిపోవడంతో ముక్కలైంది. అందులోని ప్రయాణికులు కూడా చెల్లాచెదురయ్యారు. లోయలోని చెట్లు, బండరాళ్లపై పడిపోయారు. ఎటు చూసిన ఆర్తనాదాలు, రోదనలతో పరిసరాలు మార్మోగాయి. అనేక మంది అప్పటికే విగత జీవులయ్యారు. మరికొందరు కొనఊపిరితో రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలైన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించి శవాలను వెలికితీశారు. ఈ లోయలో సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో సమాచారం అందడం జాప్యమయింది. లోయ కింది భాగానికి వెళ్లడానికి ఇబ్బందులు రావడంతో కొనఊపిరితో ఉన్న కొందరిని కాపాడలేకపోయారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్టు టోకవాడే పోలీసు స్టేషన్ అధికారి పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు.. మాల్శేజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎంస్ఆర్టీసీ ప్రకటించింది. గాయపడినవారి వైద్యఖర్చులు భరిస్తామని తెలిపింది. మృతుల వివరాలు... పూనం ఆహేర్, కిషన్ చౌదరి, కారభారి కురకుంటే, బాలు ఆహేర్, తుకారాం భవారీ, పరశురాం సోనవణే, విజయ్ కులకర్ణి, పోపట్ దాతే, మేఘాహాండే, బబన్ ఆహేర్, సరస్వతి ఆహేర్, ముకుంద్ పాలేకర్, విమల్ పాలేకర్, సాయిబాయి ఆహేర్, ప్రశాంత్ ఆమ్టే, కళ్యాణ్ జాధవ్, వైశాలీ ఆహేర్, కె.ఎన్.చౌదరి (డ్రైవర్), డి.బి.గోండకే (కండక్టర్)గా గుర్తించారు. మిగతా ఎనిమిది మంది పేర్లు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి నాసిక్ -వణీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న క్వాలిస్, గూడ్స్ వాహనాలు గుద్దుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు నాసిక్ జిల్లా ఉణందానగర్ గ్రామ సమీపంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులతోపాటు గాయపడిన వారందరూ నాసిక్ కు చెందినవారేనని తెలిసింది. మృతుల్లో గుల్షన్ఖాన్ పఠాన్ (38), ఆయన భార్య రుబీనా పఠాన్ (35), కుమారుడు సోను అలియాస్ ఆసీఫ్ పఠాన్(14)లున్నారు. గాయాలపాలైనవారిలో సాది క్ షేక్(35), గుడ్డి అలియాస్ సిమ్రాన్ పఠాన్ (18)లతోపాటు క్వాలిస్ డ్రైవర్ కూడా ఉన్నారు. పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు. -
చార్జీలు పెంచిన ఎంఎస్ఆర్టీసీ
సాక్షి, ముంబై: బస్సు ప్రయాణం మరింత భారమయింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎమ్మెస్సార్టీసీ) బస్సు చార్జీలను మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో చార్జీలను పెంచడం ఇది రెండోసారి. రాష్ట్ర రవాణాసంస్థ (ఎస్టీయే) ఎమ్మెస్సార్టీసీ బస్సు చార్జీలను 2.6 శాతం పెంచేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ గతంలోనూ చార్జీలను 6.48 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు జూలై రెండో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే కొత్తగా పెరిగిన చార్జీలను శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తింపజేయడానికి ఎస్టీయే అంగీకరించింది. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు 2.6 శాతం మేర బస్సు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఎమ్మెస్సార్టీసీ ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన రవాణాశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటీవల ఎస్టీయే సమావేశం నిర్వహించారు. చార్జీలను పెంచేందుకు ఎస్టీయే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెస్ఆర్టీసీ దేశంలోనే రెండో అతిపెద్ద ప్రజారవాణాసంస్థగా పేరుపొందింది. దీనిదగ్గర 17 వేల బస్సులు ఉన్నాయి. ఇవి ముంబై నుంచి పుణే, ముంబై నుంచి గోవా, ముంబై నుంచి బెంగుళూరు..తదితర మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. ఎమ్మెస్సార్టీసీ బస్సుల్లో రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ముంబైలోని చాలా ప్రాంతాల్లోనూ ఈ బస్సులు సేవలను అందజేస్తున్నాయి. బాంద్రాకుర్లా కాంప్లెక్స్ నుంచి బోరివలి వరకు, పన్వేల్ నుంచి మంత్రాలయ వరకు బస్సులు నడుపుతున్నారు. ఒకే ఏడాదిలో రెండోసారి చార్జీలను పెంచడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
పెరిగిన స్లీపర్‌బస్సు చార్జీలు
పింప్రి, న్యూస్‌లైన్: మహారాష్ర్ట రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆకస్మాత్తుగా వోల్వో ఏసీ స్లీపర్ బస్సుల చార్జీలు పెంచడంతో దీపావళికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్రభారం పడుతోంది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు డిమాండ్ పెరగడంతో అవి తమ ఇష్టం వచ్చినట్లు చార్జీలను వసూలు చేస్తున్నాయని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నుంచి చాలా మంది నిత్యం హైదరాబాద్, విజయవాడ, ఔరంగాబాద్, బెల్గావ్, హుబ్లీ, సూరత్, అకోలా, నాగ్‌పూర్‌కు వె ళ్తుంటారు. వోల్వో బస్సులో అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,000 ఉండగా దానిని ఇప్పుడు రూ.2,500లకు పెంచారు. నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. హుబ్లీకి ప్రస్తుత చార్జీ ధర 1,000 ఉండగా రూ.2,000లకు పెంచారు. హైదరాబాద్‌కు ప్రస్తుతం రూ.1,500 ఉండగా రూ.3,000లకు పెంచారు, బెంగుళూరు రూ.1,300 ఉండగా, రూ.2,500లకు పెంచారు. సూరత్‌కు వెళ్లేందుకు ప్రస్తుత చార్జీ రూ.500 ఉండగా రూ.1,000, అకోలాకు రూ.600 ఉండగా, రూ.1,600లకు పెంచారు. బెల్గావ్‌కు ప్రస్తుత చార్జీ రూ.400 కాగా ఇక నుంచి రూ.900 చెల్లించాలి. ఇక ప్రైవేట్ బస్సుల్లో వేర్వేరు చార్జీలతో టికెట్లు విక్రయించడంతో సామాన్య ప్రజలు దేనిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది తమ ప్రయాణాలనే వాయిదా వేసుకుంటున్నారని బాంద్రాకు చెందిన తెలుగువ్యక్తి ఒకరు అన్నారు. రైళ్లలో వెళ్దామనుకున్నా ఏ బోగీ చూసినా కిక్కిరిసి కనిపిస్తోందని, రోజూ రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల చుట్టూ తిరగలేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నామని వివరించారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇది వరకే పూర్తి కావడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో సెలవులు వృథా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అధ్వానంగా ఉంటుందన్నాయని చెబుతున్నారు. రైల్వే పండగ సమయాల్లోనైనా జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
‘ప్రైవేటు’ దోపిడీ
గణేశుడి ఉత్సవాల కోసం ముంబై నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతగ్రామాలకు వెళ్తుండడంతో ప్రైవేటు బస్సుల యజమానులు నిలువు దోపిడీకి తెరలేపారు. చార్జీలను ఏకంగా మూడురెట్లు పెంచారు. వారాంతాల్లో అదనంగా రూ.200 వరకు వసూలు చేస్తున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంకణ్ ప్రాంతం దిశగావెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు విచ్చలవిడి దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు లగ్జరీ బస్సుల బాటపట్టారు. ఒక్కసారిగా పెరిగిన రద్దీని అదనుగా చేసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు చార్జీలు ఏకంగా మూడురెట్లు పెంచి జేబులు నింపుకుంటున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ైరె ల్వేశాఖ సాధారణంగా నడిపించే రైళ్లతోపాటు 66 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది. అదేవిధంగా ఎమ్మెస్సార్టీసీ కూడా రోజు బయలుదేరే బస్సులతోపాటు అదనంగా వివిధ డిపోల నుంచి 1,800లకుపైగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయినప్పటికీ ఇవన్నీ ఎంతమాత్రమూ చాలకపోవడంతో అదనంగా 100 బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తికావడంతోపాటు వెయిటింగ్ లిస్టు వెయ్యికిపైబడిన విషయం తెలిసిందే. దీంతో ఈ టికెట్లు ‘కన్ఫర్మ్’ అవుతాయనే నమ్మకం లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు లగ్జరీబస్సులు, క్వాలిస్, సుమోలు, కార్ల వైపు దృష్టిసారించారు. ఉత్సవాలు దగ్గరపడడంతో స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.350 చొప్పున చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు వాహన యజమానులు ఉత్సవాలు దగ్గర పడడంతో రూ.850 వరకు వసూలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అదనంగా రూ.200 వసూలు అవకాశాలున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఇలా ప్రైవేటు వాహన యజమానులు రద్దీని అదనుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. చాలా వరకు ప్రైవేటు బస్సులు పాతవే ఉంటాయని, వాటిలో వసతులూ అంతంతమాత్రమేనని కుర్లావాసి ఒకరు అన్నారు. ప్రైవేటు వాహనాల్లో చాలా వరకు వేగపరిమితి నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబెసైంట్రల్, పరేల్, వర్లి, లాల్బాగ్, బోరివలి, కుర్లా, శాంతాక్రజ్ నుంచి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతాయి. రాత్రిపూట ఈ ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముంబై-గోవా జాతీయ రహదారిపై ఏర్పాట్లు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆర్టీసీ ముంబై-గోవా జాతీయ రహదారిపై అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించనుంది. నాలుగు మెకానిక్‌ల బృందాలను ఏర్పాటు చేయనుంది. మార్గమధ్యలో బస్సులకు రిపేరు వస్తే వెంటనే మరమ్మతులు పూర్తిచేసి పంపించేందుకు వీరిని నియమిస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు. వీరంతా 24 గంటలు అందుబాటులో ఉంటారు. పోలీసుశాఖ కూడా తమవంతుగా 500పైగా సిబ్బందిని నియమించింది. ఉత్సవాలప్పుడు రహదారిపై భారీ రద్దీ ఉంటుంది. ప్రమాదం జరిగి ట్రాఫిక్ స్తంభిస్తే వాహనాలను దారి మళ్లించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. -
ఫ్లైఓవర్ కింద ‘నో పార్కింగ్’!
సాక్షి, ముంబై: నగరంలోని ఫ్లై ఓవర్ల కింద నిలిపి ఉంచిన వాహనాలను జప్తు చేయనున్నట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశానుశారం ఈ చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎంఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం 11 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటి దిగువ భాగంలో వేలాది వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. 2010లో నగరవ్యాప్తంగా ఉన్న ఫ్లై ఓవర్ల దిగువ భాగాన వాహనాలను పార్కింగ్ చేయడాన్ని నిషేధించింది. నగరానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఆర్టీసీ తగిన ప్రణాళికను తయారుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ వాహనాలను నిలిపి ఉంచడం నిషేధమని రెండు నెలల కిందటే ఎంఎస్ఆర్టీసీ ఆయా వాహనాల యజమానులను ఆదేశించింది. ఇప్పటికే నిలిచి ఉంచిన వాహనాలను తొలగించకుంటే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించింది. అయితే సంస్థ ఆదేశాలను నగరవాసులు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇదిలా ఉండగా ఆరే మిల్క్ కాలనీ ఫ్లై ఓవర్, ఠాణేలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న క్యాడ్బరీ జంక్షన్ ఫ్లై ఓవర్ దిగువన ఎప్పటినుంచో ధ్వంసమైన కార్లు అధిక సంఖ్యలో పడి ఉన్నాయి. కాగా, ఎంఎస్ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్ బిపిన్ శ్రీమల్ మాట్లాడుతూ .. ఎంఎస్ఆర్టీసీ పరిధిలోని ఫ్లై ఓవర్ల దిగువ భాగంలో పార్క్చేసిన వాహనాల తొలగింపు చేపట్టామన్నారు. తాము ఇప్పటికే ఏడు, ఎనిమిది ఫ్లై ఓవర్ల దిగువన పార్క్ చేసిన వాహనాలను తొలగించి, ఆ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే మొత్తం ఫ్లై ఓవర్ల కింద వాహనాల తొలగింపును పూర్తిచేస్తామన్నారు. కాగా వకోలా జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్ ఫ్లై ఓవర్, కుర్లా-సీఎస్టీ ఫ్లై ఓవర్, అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్ ఫ్లై ఓవర్, వకోల ఫ్లై ఓవర్, గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్, చెడా నగర్ ఫ్లై ఓవర్, వకోల, నితిన్ క్యాస్టింగ్, గోల్డెన్ డైస్, క్యాడ్బెరీ, ఫర్గ్యూసన్ రోడ్ ఫ్లై ఓవర్లు ఎంఎస్ఆర్టీసీ పరిధిలోకి వస్తాయి.