సాక్షి, ముంబై: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ) గణేశ్ ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సును నడపడం ప్రైవేట్ వాహనాల యజమానులకు మింగుడుపడడం లేదు. తమ లాభాలను ఎమ్మెస్సార్టీసీ మింగేస్తుందని మండిపడుతున్నారు. ఎమ్మెస్సార్టీసీ.. కొంకణ్ వరకు ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సులను నడుపుతోంది. వాషికి చెందిన ట్రావెల్ ఏజెంట్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘గణేశ్ చవితి నిమిత్తం ఎమ్మెస్సార్టీసీ అదనంగా బస్సు సేవలను అందిస్తుండడంతో మేం భారీమొత్తంలో నష్టాలను చవి చూస్తున్నాం.
ప్రయాణికులు కూడా విలాసవంతమైన ప్రయాణానికి ఆశ పడకుండా చౌక ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఎమ్మెస్సార్టీసీ అదనపు బస్సు సేవలను ప్రారంభించి మా లాభాలను మింగేస్తోంది’ అని అన్నారు. మరో ట్రావెల్ ఏజెంట్ గులాబ్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఈసారి గణేశోత్సవాల నిమిత్తం కొంకణ్ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో ఎమ్మెస్సార్టీటీ ఈసారి అదనంగా కొంకణ్‌కు బస్సు సేవలను ప్రారంభించిందని చెప్పారు. ప్రయాణికులు పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో బంధువుల ఇళ్లకి వెళుతుంటారు.
వీరిలో చాలా మంది తక్కువ చార్జీలు ఉండే ఎమ్మెస్సార్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారని తెలిపారు. దీంతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఇదిలా వుండగా కొంత మంది ఏజెంట్లు సాధారణంగా కొంకణ్‌కు 25 నుంచి 30 బస్సులను మాత్రమే నడుపుతారు. పండుగలు పురస్కరించుకొని ఏడు నుంచి ఎనిమిది బస్సులను అదనంగా నడుపుతారు. అయితే ప్రస్తుతం గణేశ్ చతుర్థి నిమిత్తం చాలా తక్కువ బస్సులను ప్రారంభించారు. ఈసారి తాము కేవలం రెండు బస్సులను మాత్రమే అదనంగా ప్రారంభించామని గులాబ్ వివరించారు. రద్దీ సీజన్‌లో తమ ఆదాయం 50 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఎమ్మెస్సార్టీసీ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి గణేశోత్సవాలకు కొంకణ్‌కు తరలి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడాన్ని గమనించి ఈసారి దాదాపు 500 బస్సులను అదనంగా ప్రారంభించామన్నారు. కొంకణ్‌కు చెందిన ప్రయాణికుడు ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గణేశ్ చతుర్థి నిమిత్తం రత్నగిరికి కుటుంబ సమేతంగా తరలి వెళుతుంటామని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే టికెట్ చార్జీలు అధికంగా ఉంటాయని తెలిపారు. అందుకే తామంతా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎంచుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణ సౌకర్యం కంటే గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీపై బస్సు ఆపరేటర్ల ఆగ్రహం
Published Sat, Aug 30 2014 11:05 PM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement