Travel Agent
-
కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు!
అవకాశం ఉన్నప్పుడే కలలను నెరవేర్చుకోవాలి. లేదంటే అవి ఎప్పటికీ కల్లలాగే మిగిలిపోతాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే వయసు అడ్డంకి ఎప్పుడూ కాదని ఈ జంటను చూస్తే తెలుస్తుంది. 27 యేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని కలగన్నారు. అంతటితో ఊరుకోలేదు. కార్యచరణ కూడా రూపొందించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 25 దేశాలకు వెళ్లివచ్చారు కూడా. ఈ నెలలో 26వ ట్రిప్పుకు వెళ్తున్నారు. కేవలం టీ దుకాణం జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నా ఈ వృద్ధ దంపతులు చెప్పే విశేషాలేమిటే తెలుసుకుందాం... కేరళలోని కొచ్చికి చెందిన కేఆర్ విజయన్ (71), అతని భార్య మోహన (69) ‘శ్రీబాలాజీ కాఫీ హౌస్’అనే కాఫీ షాప్ నడుపుతున్నారు. కాఫీ దుకాణం ద్వారా ఆర్జించిన సొమ్ము ద్వారా ప్రపంచదేశాలు తిరిగిరావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా వీరి ప్రయాణం రెండేళ్లు వాయిదా పడింది. మళ్లీ ఈ నెల21 న తమ ప్రయాణం తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రిప్‌లో రష్యాకెళ్లి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్ను కలవాలను కుంటున్నారట కూడా. 2007లో ఇజ్రాయెల్ సందర్శనతో వీరి మొదటి విదేశీ యాత్ర ప్రారంభమైంది. వీరి చివరి యాత్ర 2009 నవంబర్ - డిసెంబర్లో సాగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శించారు. ఈ ట్రిప్‌కు మహీంద్ర గ్రూప్ చైర్మాన్ ఆనంద్ మహీంద్ర స్పాంసర్ చేశారు కూడా. ఇలా అమెరికా, బ్రెజిల్, జర్మనీ.. వంటి ఇతర దేశాలను చుట్టేశారు. వీరు ట్రావెల్ ఏజెన్సీల సహాయంతో కేవలం బేసిక్ ఇంగ్లీష్‌తో విదేశీ యాత్రలు చేస్తున్నారు. ‘కోవిడ్ తర్వాత పర్యాటక ప్రదేశాలు తిరిగితెరిచినట్టు తెలిసింది. మా ట్రావెల్ ఏజెంట్ కూడా ఫోన్ చేసి, తర్వాత ట్రిప్ రష్యా అని చెప్పాడు. రష్యా టూర్లో మొదట మా ఇద్దరి పేర్లను తప్పక చేర్చమని చెప్పాను. ఈ ట్రిప్ అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మా మనుమలు కూడా పాల్గొంటున్నారని’ కేఆర్ విజయన్ మీడియాకు తెలిపాడు. "ఈ సారి రష్యా వెళ్లాలనుకుంటున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మళ్లీ ప్రయాణించే అవకాశం దక్కింది" అని మోహన అన్నారు. తీర్థయాత్రలకు వెళ్లే వయసులో ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని ఉవ్విళ్లూరుతున్న ఈ దంపతులు నేటి యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు కదా! చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
కష్టపడలేక మోసాలు మొదలెట్టాడు!
సాక్షి, సిటీబ్యూరో: బతుకుతెరువు కోసం మెడికల్ రిప్రజెంటేటివ్‌గా మారిన ఆ యువకుడు కష్టపడలేకపోయాడు... పెద్దగా ‘పని’ లేకుండా తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు... దీనికోసం ట్రావెల్ ఏజెంట్ అవతారం ఎత్తి మోసాలు మొదలెట్టాడు... మలేషియా సహా వివిధ దేశాల్లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో దండుకున్నాడు... ఇద్దరు అనుచరులతో కలిసి ఇప్పటి వరకు 20 మందిని మోసం చేసిన ఈ ఘరానా మోసగాడిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌పై నాలుగు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ముషీరాబాద్‌లోని ఎస్సార్కే నగర్ కాలనీకి చెందిన మజీద్ అహ్మద్ విద్యాభ్యాసం తర్వాత మెడికల్ రిప్రజెంటేవివ్గా ఉద్యోగం ప్రారంభించాడు. ఆ వృత్తిలో ఉండే టార్గెట్లు, నిత్య సంచారం తట్టుకోలేకపోయాడు. అలా కష్టపడటం తన వల్ల కాదని భావించిన మజీద్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అప్పటికే ఇతగాడికి వీసా ప్రాసెసింగ్, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంటేషన్‌పై పట్టు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయాలని భావించాడు. దీనికోసం ట్రావెల్ ఏజెంట్‌గా అవతారం ఎత్తిన అతను రెయిన్‌బజార్‌కు చెందిన అసద్, గోల్కొండకు చెందిన మహమూద్‌లను సబ్–ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరూ తమ తమ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేస్తారు. ఆసక్తి చూపిన వారిని తీసుకువచ్చి మజీద్‌కు అప్పగిస్తారు. ఇతగాడు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసి కొన్నాళ్ల పాటు వీసా ప్రాసెసింగ్ జరుగుతోందని చెప్తాడు. ఆపై కొందరికి విజిట్ వీసా అంటగట్టి అక్కడకు పంపిస్తాడు. ఇలా మోసపోయిన అనేక మంది కొన్ని రోజులకే తిరిగి వచ్చేశారు. మరికొందరిని మలేషియా విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునే అక్కడి మజీద్ ఏజెంట్లు వారి నుంచి పాస్పోర్ట్స్ స్వాధీనం చేసుకుని దారుణమైన ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇలా చేరిన వారిలో చాలీచాలని జీతంతో పాటు చిన్న చిన్న విషయాలకే వేధింపులు, శిక్షలు ఎదుర్కొన్న వారు ఎందరో ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రం ఇక్కడున్న తమ కుటుంబీకుల సాయంతో తిరిగి రాగలిగారు. వీరిపై రెయిన్‌బజార్, బంజారాహిల్స్, గోల్కొండ, లంగర్‌హౌస్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మజీద్ కదలికలపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్ వలపన్ని బుధవారం పట్టుకున్నారు. ఇతడిని రెయిన్‌బజార్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
ఆర్టీసీపై బస్సు ఆపరేటర్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) గణేశ్ ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సును నడపడం ప్రైవేట్ వాహనాల యజమానులకు మింగుడుపడడం లేదు. తమ లాభాలను ఎమ్మెస్సార్టీసీ మింగేస్తుందని మండిపడుతున్నారు. ఎమ్మెస్సార్టీసీ.. కొంకణ్ వరకు ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సులను నడుపుతోంది. వాషికి చెందిన ట్రావెల్ ఏజెంట్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘గణేశ్ చవితి నిమిత్తం ఎమ్మెస్సార్టీసీ అదనంగా బస్సు సేవలను అందిస్తుండడంతో మేం భారీమొత్తంలో నష్టాలను చవి చూస్తున్నాం. ప్రయాణికులు కూడా విలాసవంతమైన ప్రయాణానికి ఆశ పడకుండా చౌక ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఎమ్మెస్సార్టీసీ అదనపు బస్సు సేవలను ప్రారంభించి మా లాభాలను మింగేస్తోంది’ అని అన్నారు. మరో ట్రావెల్ ఏజెంట్ గులాబ్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఈసారి గణేశోత్సవాల నిమిత్తం కొంకణ్ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో ఎమ్మెస్సార్టీటీ ఈసారి అదనంగా కొంకణ్‌కు బస్సు సేవలను ప్రారంభించిందని చెప్పారు. ప్రయాణికులు పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో బంధువుల ఇళ్లకి వెళుతుంటారు. వీరిలో చాలా మంది తక్కువ చార్జీలు ఉండే ఎమ్మెస్సార్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారని తెలిపారు. దీంతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఇదిలా వుండగా కొంత మంది ఏజెంట్లు సాధారణంగా కొంకణ్‌కు 25 నుంచి 30 బస్సులను మాత్రమే నడుపుతారు. పండుగలు పురస్కరించుకొని ఏడు నుంచి ఎనిమిది బస్సులను అదనంగా నడుపుతారు. అయితే ప్రస్తుతం గణేశ్ చతుర్థి నిమిత్తం చాలా తక్కువ బస్సులను ప్రారంభించారు. ఈసారి తాము కేవలం రెండు బస్సులను మాత్రమే అదనంగా ప్రారంభించామని గులాబ్ వివరించారు. రద్దీ సీజన్లో తమ ఆదాయం 50 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్టీసీ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి గణేశోత్సవాలకు కొంకణ్‌కు తరలి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడాన్ని గమనించి ఈసారి దాదాపు 500 బస్సులను అదనంగా ప్రారంభించామన్నారు. కొంకణ్‌కు చెందిన ప్రయాణికుడు ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గణేశ్ చతుర్థి నిమిత్తం రత్నగిరికి కుటుంబ సమేతంగా తరలి వెళుతుంటామని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే టికెట్ చార్జీలు అధికంగా ఉంటాయని తెలిపారు. అందుకే తామంతా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎంచుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణ సౌకర్యం కంటే గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆడా? మగా? ఎవరు మంచి పైలెట్లు?
అంతరిక్షాన్ని అధిరోహించిన కల్పనాచావ్లా లాంటి వనితల ధైర్యసాహసాల గురించి తెలిసినా... మహిళల శక్తి సామర్థ్యాల పట్ల మనలో కొంతమంది ఆలోచన ఇంకా అథఃపాతాళంలోనే ఉంది. ఈ విషయాన్ని నిరూపించింది తాజాగా నిర్వహించిన ఓ సర్వే. పైలట్లుగా స్త్రీ పురుషుల్లో ఎవరిని విమాన ప్రయాణికులు ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే అంశంపై నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది పురుష పైలట్లపైనే ఎక్కువ నమ్మకాన్ని ఉంచారు. ట్రావెల్ ఏజెంట్ అయిన సన్‌షైన్ డాట్ కో యుకె ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది. పైలట్లు ఆడవారా, మగవారా అనేది విషయమే కాదని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 26శాతం మంది చెప్పగా, కేవలం 14శాతం మంది మాత్రమే పురుష పైలట్లను విశ్వసించం అని స్పష్టం చేశారు. ఆడవాళ్ల కన్నా పురుష పెలైట్లు మరింత ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారని 38 శాతం మంది అభిప్రాయపడగా, అదే సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో స్త్రీ పెలైట్ల సామర్థ్యంపై 28 శాతం మంది సందేహాలను వ్యక్తం చేశారు. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 10 శాతం మంది ఏం చెప్పారంటే...‘‘గతంలో మేం ప్రయాణించిన విమానాల్లో పైలట్ నుంచి కాక్‌పిట్ సిబ్బంది అంతా మగవాళ్లే ఉన్నారు. కాబట్టి మేం ఏం ఆశించాలో తెలీడం లేదు’’ అని. ఈ సర్వే ఫలితాలను వెల్లడిచేస్తున్న నేపథ్యంలో నిర్వాహక సంస్థ డెరైక్టర్ క్రిస్ క్లార్క్సన్ మాట్లాడుతూ...‘‘సగానికి పైగా విమాన ప్రయాణికులు మహిళా పైలట్లను విశ్వసించడం లేదని చెప్పడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి దుర భిప్రాయాలను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పైలట్లు పూర్తిగా అర్హతలుండి, లెసైన్స్ పొందినవారైతే... ఓ విమానాన్ని నడపడానికి వారు పూర్తి సామర్థ్యం కలవారే అని, క్షేమంగా మిమ్మల్ని గమ్యానికి చేర్చగలరు అనీ అర్థం. ఇందులో స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు’’ అన్నారాయన. ఈ సర్వే కోసం మొత్తం తీసుకున్న 2,367 మందిలో 1,195 మంది పురుషులు కాగా 1,172 మంది స్త్రీలు. వీరంతా గత 12 నెలలుగా హాలిడే ట్రిప్ విదేశాల్లో గడుపుతున్నవారు.