ఆడా? మగా? ఎవరు మంచి పైలెట్లు?
అంతరిక్షాన్ని అధిరోహించిన కల్పనాచావ్లా లాంటి వనితల ధైర్యసాహసాల గురించి తెలిసినా... మహిళల శక్తి సామర్థ్యాల పట్ల మనలో కొంతమంది ఆలోచన ఇంకా అథఃపాతాళంలోనే ఉంది. ఈ విషయాన్ని నిరూపించింది తాజాగా నిర్వహించిన ఓ సర్వే. పైలట్లుగా స్త్రీ పురుషుల్లో ఎవరిని విమాన ప్రయాణికులు ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే అంశంపై నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది పురుష పైలట్లపైనే ఎక్కువ నమ్మకాన్ని ఉంచారు. ట్రావెల్ ఏజెంట్ అయిన సన్‌షైన్ డాట్ కో యుకె ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది.
పైలట్‌లు ఆడవారా, మగవారా అనేది విషయమే కాదని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 26శాతం మంది చెప్పగా, కేవలం 14శాతం మంది మాత్రమే పురుష పైలట్లను విశ్వసించం అని స్పష్టం చేశారు. ఆడవాళ్ల కన్నా పురుష పెలైట్లు మరింత ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారని 38 శాతం మంది అభిప్రాయపడగా, అదే సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో స్త్రీ పెలైట్ల సామర్థ్యంపై 28 శాతం మంది సందేహాలను వ్యక్తం చేశారు. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 10 శాతం మంది ఏం చెప్పారంటే...‘‘గతంలో మేం ప్రయాణించిన విమానాల్లో పైలట్ నుంచి కాక్‌పిట్ సిబ్బంది అంతా మగవాళ్లే ఉన్నారు. కాబట్టి మేం ఏం ఆశించాలో తెలీడం లేదు’’ అని.
ఈ సర్వే ఫలితాలను వెల్లడిచేస్తున్న నేపథ్యంలో నిర్వాహక సంస్థ డెరైక్టర్ క్రిస్ క్లార్క్‌సన్ మాట్లాడుతూ...‘‘సగానికి పైగా విమాన ప్రయాణికులు మహిళా పైలట్లను విశ్వసించడం లేదని చెప్పడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి దుర భిప్రాయాలను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పైలట్లు పూర్తిగా అర్హతలుండి, లెసైన్స్ పొందినవారైతే... ఓ విమానాన్ని నడపడానికి వారు పూర్తి సామర్థ్యం కలవారే అని, క్షేమంగా మిమ్మల్ని గమ్యానికి చేర్చగలరు అనీ అర్థం. ఇందులో స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు’’ అన్నారాయన. ఈ సర్వే కోసం మొత్తం తీసుకున్న 2,367 మందిలో 1,195 మంది పురుషులు కాగా 1,172 మంది స్త్రీలు. వీరంతా గత 12 నెలలుగా హాలిడే ట్రిప్ విదేశాల్లో గడుపుతున్నవారు.