నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్‌ అయినా ఒకటే | Sakshi
Sakshi News home page

నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్‌ అయినా ఒకటే

Published Wed, Apr 10 2024 11:12 AM

Teja Manakames journey is an inspiration for many - Sakshi

ఫీల్డ్‌ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్‌ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్‌ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది.

కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్‌ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌) పాజెక్ట్స్‌ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కోర్సు చేసింది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తొలిసారిగా నాన్‌–మెడికల్‌ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరిపోయారు.

వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్‌గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీలోప్రాథమిక  శిక్షణ తరువాత మౌంట్‌ అబూలో పాస్టింగ్‌ ఇచ్చారు. మౌంట్‌ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్‌ రూమ్స్‌ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్‌ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది.

మన దేశాన్ని ఐటీ బూమ్‌ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్‌ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్‌(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్‌ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత   టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్‌ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఐటీ) స్థాయికి చేరింది.

జెండర్‌ స్టీరియో టైప్స్‌ను బ్రేక్‌ చేస్తూ డెల్‌ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్‌ ఫౌండేషన్‌లో సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్‌... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్‌ఆర్‌ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్‌ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్‌లో ‘మెంటర్‌ సర్కిల్‌ కాన్సెప్ట్‌’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్‌లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్‌ ఉంటారు. ఈ సర్కిల్‌లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు.

‘ఇంజినీరింగ్‌ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్‌ ఉమెన్‌ ఇంజనీర్‌ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ.
 

Advertisement
Advertisement