
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్‌పూర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.
చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
మాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.
అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్‌లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.
‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.
చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!