
ఆదర్శం అంటే దర్శనం చేయించేది: ‘చూపించేది’ అని అర్థం. మహనీయుల జీవితం మనకు సరైన నడవడిక ఎలా ఉండాలో చూపుతుంది కనుక అది మనకు ‘ఆదర్శం’. దస్తూరీ మెరుగు పరుచుకునేందుకు రాసే ‘కాపీ’ పుస్తకంలో, పేజీలో పైన ముద్రితమై ఉండే నమూనా పంక్తి– ‘మేలు బంతి’–ని చూసుకుంటూ, దాన్ని అనుకరిస్తూ కింద పదిసార్లు రాస్తే చేతి రాత బాగవుతుంది. ఆ నమూనా పంక్తిని కూడా ఆదర్శం అంటారు.
ఏదయినా జటిలమైన శాస్త్ర విషయానికి, ఆ శాస్త్రం బాగా నేర్చిన పండితుడు విపులంగా, సరళంగా వ్యాఖ్య రాసి పెడితే; అది ఆ శాస్త్రం తాలూకూ కిటుకులకూ, మర్మాలకూ అద్దం పట్టి మనకు చూపుతుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఆదర్శాలే. ఉదాహరణకు కావ్య లక్షణాల గురించి దండి రంన గ్రంథం పేరు ‘కావ్యాదర్శం’.
వేదాంతవేత్తలు వివిధ సందర్భాలలో మనసునూ, బుద్ధినీ, చైతన్యాన్నీ అద్దంతో పోలుస్తారు. రజోగుణ సముద్భవమైన కామ– క్రోధాలు అనే లక్షణాలు... శుద్ధమైన మనిషి బుద్ధిని, స్వచ్ఛమైన అద్దాన్ని; మాలిన్యమూ, మసీ కప్పివేసినట్టు ఒక్కొక్కప్పుడు కప్పి వేస్తాయి. అప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. అలాంటప్పుడే మనిషి పాపకర్మల ఫలాలు దారుణంగా ఉంటాయని తెలిసి కూడా పాత కాలు చేస్తాడు. నవ్వుతూ చేసిన పాపాల కర్మలను తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడని భగవద్గీత బోధిస్తుంది.
మనం చూసే విశ్వమంతా ‘దర్పణ దృశ్యమాన నగరి’ (అద్దంలో కనిపించే నగరపు ప్రతిబింబం) లాంటిది అన్నారు ఆదిశంకరులు. బాహ్య ప్రపంచంలో విశేషాలన్నీ మన అంతఃకరణలో ప్రతిబింబించడం వల్లనే మనకు గోచరిస్తున్నాయి. మన చేతోదర్ప ణంలో బాహ్య ప్రపంచపు విశేషాలు ప్రతిబింబించకపోతే వాటి రపురేఖల, లక్షణాలూ మనం గ్రహించలేం. ఈ అద్దం లేకపోతే ఆ విశ్వం మనకు గోచరించదు.
అద్దం మీద మోహమూ, భ్రాంతీ, అజ్ఞానమూ అనే మురికి పేరుకుపోతే కూడా మనకు మన కట్టెదుట ఉన్న సత్యం యథాతథంగా కనిపించదు. ఉన్నది కప్పబడి, లేనట్టుతోస్తుంది. అద్దం మీది మాలిన్యం వల్ల లేనిదేదో ఉన్నట్టు కనిపిస్తుంది. బుద్ధి అద్దానికి మకిలి పడితే మనం భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం. ‘చేతో దర్పణ మార్జనమ్’ (బుద్ధిని శుద్ధి చేసే సాధనం) శ్రీకృష్ణ నామ సంకీర్తనం’ అని చైతన్య మహాప్రభువుల ‘శిక్షాష్టకం’ అంటుంది. దానివల్లనే ‘సమ్యక్ దృష్టి’ కలుగుతుంది.
– ఎం. మారుతి శాస్త్రి