కర్నాటకకు చెందిన ‘బజ్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్లి ఫైనాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ లాంటి అంశాలలో శిక్షణ ఇస్తోంది. అలా బజ్ ఉమెన్ గ్రామీణ ప్రాంతల ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చింది.
సురక్షితం కాని మాంసం తినడం వల్ల అనారోగ్యానికి గురైంది కర్నాటకలోని కడారిపుర గ్రామానికి చెందిన కాంతలక్ష్మి. ఇలాంటి మహిళల కోసం ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం గురించి అవగాహన కలిగించడంలో విజయం సాధించింది బజ్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థ.‘బజ్ గ్రీన్ ప్రోగ్రాం’ ద్వారా దేశీ పాల్ట్రీ నుంచి ఆర్గానిక్ ఫామింగ్ వరకు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు గ్రామీణ్ర ప్రాంత మహిళలు.
‘బజ్ గ్రీన్ ప్రోగ్రాం’ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను ఆచరణలోకి తీసుకువచ్చింది కాంతలక్ష్మి. యాభై వేలు అప్పు చేసి ఫామ్ మొదలుపెట్టింది. ఆ తరువాత బంగాళదుంప, మునగకాయలు, ఉల్లిపాయలు, బీన్స్... వంటి వాటితో కిచెన్ గార్డెన్ కూడా మొదలుపెట్టింది. సొంతంగా కూరగాయలు పండించడం ద్వారా కాంతలక్ష్మి డబ్బును ఆదా చేస్తోంది.
΄పాల్ట్రీ ఉత్పత్తులను అమ్మడం ద్వారా మరికొంత ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ‘యాక్టివ్ క్లైమేట్ ఛేంజ్ ఏజెంట్’గా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కాంతలక్ష్మి తన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలలో మామిడితో సహా రకరకాల మొక్కలు నాటింది. నీటిని రీసైక్లింగ్ చేసే పద్ధతుల గురించి కూడా నేర్చుకుంది.
‘బజ్ గ్రీన్’ ద్వారా తాను నేర్చుకున్న విషయాలను తనలాంటి మహిళలకు చెబుతూ వారిని చైతన్యవంతులను చేస్తోంది కాంతలక్ష్మి.
‘బజ్ ఉమెన్’ ద్వారా పర్యావరణం నుంచి నీటి పోదుపు వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్న ఆరు లక్షలమంది మహిళలలో కాంతలక్ష్మి ఒకరు. ‘లింగ వివక్షతను అధిగమించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపోందించడానికి. పేదరికం నుంచి బయట పడడానికి, వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి గ్రామీణ ప్రాంత మహిళలకు మా సంస్థ సహాయపడుతుంది. సాధికారత దిశగా అడుగులు వేసే శక్తి వారిలో ఉంది’ అంటుంది ‘బజ్ ఉమెన్’ వ్యవస్థాపకులలో ఒకరైన ఉతార నారాయణ్.
కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన ఉతార నారాయణ్ ‘జనగ్రహ’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఎన్నో కార్యక్రమాల్లో భాగం అయింది. ఆ అనుభవం జ్ఞానం ‘బజ్ ఉమెన్’ను ముందుకు నడిపించడానికి ఉపయోగపడింది.
ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూసే కుటుంబ వాతావరణంలో పెరిగింది నారాయణ్. అయితే చుట్టుపక్కల మాత్రం ఆడపిల్లల పట్ల చాలా వివక్ష కనిపించేది. ఆర్థికంగా భర్త మీద ఆధారపడే మహిళలే ఎక్కువగా కనిపించేవారు. ఈ నేపథ్యంలో గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
‘బజ్ ఉమెన్’ సంస్థ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో గ్రామాలకు వెళ్లి, ఎంతోమంది మహిళలతో మాట్లాడింది ఉతార నారాయణ్. ఆ అనుభవాలు సంస్థను మరింత ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment