తిరుపతి, సాక్షి: పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
నెలరోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు, పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి.
.. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. తమిళనాడు శ్రీరంగం తరహాలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని.. రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అద్భుతంగా నిర్వహించాం. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు ఇంతదాకా ఎవరు కాపాడలేరు. కానీ,
టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మీరు చేస్తున్న తప్పులకు, భక్తులకు కష్టాలు పడుతున్నారు. పశువులను మందలో తోసినట్లు భక్తులను క్యూ లైన్లలో తోసిపారేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన. ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి.
సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైఎస్సార్‌సీపీని, వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేశారు. గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోతే , రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారు.దేవుడితో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది, లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు ఆడితే స్వామి చూశారు.
టీటీడీ చైర్మన్ ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కు చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కూడా ఘటనకు బాధ్యత వహించాలి. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ను ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదు. తిరుపతి తొక్కిసలాట ఘటన.. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’’ అని భూమన అన్నారు.
ఇదీ చదవండి: ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం!
Comments
Please login to add a commentAdd a comment