Bus operators
-
FlixBus: భారత్‌లోకి జర్మనీ బస్సులు.. ఎక్కడికైనా రూ.99 టికెట్!
జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ (FlixBus)భారత్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన భారత్‌లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్‌బస్ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ రూ.99 లాంచింగ్ ఆఫర్ కింద ప్రారంభ రూట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి, జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో, అమృత్సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్‌బస్ సమగ్ర నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయి. అన్నీ ప్రీమియం బస్సులు జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్బస్ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్లలో ఒకటైన భారత్‌కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం. అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్‌బస్ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్ అన్నారు. -
ఆర్టీసీపై బస్సు ఆపరేటర్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) గణేశ్ ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సును నడపడం ప్రైవేట్ వాహనాల యజమానులకు మింగుడుపడడం లేదు. తమ లాభాలను ఎమ్మెస్సార్టీసీ మింగేస్తుందని మండిపడుతున్నారు. ఎమ్మెస్సార్టీసీ.. కొంకణ్ వరకు ఉత్సవాల నిమిత్తం అదనంగా బస్సులను నడుపుతోంది. వాషికి చెందిన ట్రావెల్ ఏజెంట్ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘గణేశ్ చవితి నిమిత్తం ఎమ్మెస్సార్టీసీ అదనంగా బస్సు సేవలను అందిస్తుండడంతో మేం భారీమొత్తంలో నష్టాలను చవి చూస్తున్నాం. ప్రయాణికులు కూడా విలాసవంతమైన ప్రయాణానికి ఆశ పడకుండా చౌక ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఎమ్మెస్సార్టీసీ అదనపు బస్సు సేవలను ప్రారంభించి మా లాభాలను మింగేస్తోంది’ అని అన్నారు. మరో ట్రావెల్ ఏజెంట్ గులాబ్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే ఈసారి గణేశోత్సవాల నిమిత్తం కొంకణ్ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో ఎమ్మెస్సార్టీటీ ఈసారి అదనంగా కొంకణ్‌కు బస్సు సేవలను ప్రారంభించిందని చెప్పారు. ప్రయాణికులు పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో బంధువుల ఇళ్లకి వెళుతుంటారు. వీరిలో చాలా మంది తక్కువ చార్జీలు ఉండే ఎమ్మెస్సార్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారని తెలిపారు. దీంతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఇదిలా వుండగా కొంత మంది ఏజెంట్లు సాధారణంగా కొంకణ్‌కు 25 నుంచి 30 బస్సులను మాత్రమే నడుపుతారు. పండుగలు పురస్కరించుకొని ఏడు నుంచి ఎనిమిది బస్సులను అదనంగా నడుపుతారు. అయితే ప్రస్తుతం గణేశ్ చతుర్థి నిమిత్తం చాలా తక్కువ బస్సులను ప్రారంభించారు. ఈసారి తాము కేవలం రెండు బస్సులను మాత్రమే అదనంగా ప్రారంభించామని గులాబ్ వివరించారు. రద్దీ సీజన్లో తమ ఆదాయం 50 శాతానికి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్టీసీ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సారి గణేశోత్సవాలకు కొంకణ్‌కు తరలి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడాన్ని గమనించి ఈసారి దాదాపు 500 బస్సులను అదనంగా ప్రారంభించామన్నారు. కొంకణ్‌కు చెందిన ప్రయాణికుడు ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏటా గణేశ్ చతుర్థి నిమిత్తం రత్నగిరికి కుటుంబ సమేతంగా తరలి వెళుతుంటామని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే టికెట్ చార్జీలు అధికంగా ఉంటాయని తెలిపారు. అందుకే తామంతా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఎంచుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణ సౌకర్యం కంటే గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.