లోయలో ఘోరకలి | 27 killed as bus plunges into valley near Nashik | Sakshi
Sakshi News home page

లోయలో ఘోరకలి

Published Thu, Jan 2 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

లోయలో ఘోరకలి

లోయలో ఘోరకలి

సాక్షి, ముంబై: కన్ను మూసి తెరిచేలోపు 27 మంది ప్రాణాలు గాలిలోకి కలసి పోయాయి. నిత్యం పచ్చగా కనిపించే మాల్శేజ్‌లోయ ఎరుపురంగులోకి మారింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ) బస్సు గురువారం ఘోరప్రమాదానికి గురికావడంతో 27 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మద్‌నగర్ బయలుదేరిన బయల్దేరిన ఈ బస్సు ఠాణే-నాసిక్ జిల్లా సరిహద్దులో ఉన్న మాల్శేజ్‌ఘాట్ లోయలో పడింది. సుమారు 300 అడుగులకుపైగా లోతున్న లోయలో పడడంతో బస్సు మూడు ముక్కలుగా మారి నుజ్జునుజ్జయింది. ఈ సందర్భంగా గాయపడ్డ 11 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ కండక్టర్లతోపాటు ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు.
 
 విఠల్‌వాడి డిపోకు చెందిన ఈ బస్సు ఉదయం సుమారు 5.45 గంటలకు ఠాణేలోని లోకమాన్యనగర్ నుంచి నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మద్‌నగర్‌కు బయలుదేరింది. కండక్టర్, డ్రైవర్ సహా ఇందులో మొత్తం 38 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు జున్నర్ తీర్థయాత్రకు బయలుదేరారు. వీరి ప్రయాణం మాల్శేజ్ ఘాట్ వరకు బాగానే సాగింది. టోకావడే పోలీసు స్టేషన్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని శంకర్ మందిరం సమీపంలో ఒక లారీ ఎదురు వచ్చింది. కలపతో నిండి ఉన్న లారీ, ఆర్టీసీ బస్సు కుడివైపు స్వల్పంగా ఢీకొంది. దీన్ని తప్పించాలనే తాపత్రయంతో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తిప్పాడు. దీంతో అది ఒక్కసారిగా సుమారు 300 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భీతిల్లి ఆర్తనాదాలు మొదలుపెట్టారు. బస్సు కుదుపులతోపాటు మెల్లమెల్లగా భారీ శబ్దంతో కిందికి జారిపోవడంతో ముక్కలైంది. అందులోని ప్రయాణికులు కూడా చెల్లాచెదురయ్యారు. లోయలోని చెట్లు, బండరాళ్లపై పడిపోయారు. ఎటు చూసిన ఆర్తనాదాలు, రోదనలతో పరిసరాలు మార్మోగాయి. అనేక మంది అప్పటికే విగత జీవులయ్యారు. మరికొందరు కొనఊపిరితో రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలైన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించి శవాలను వెలికితీశారు.  ఈ లోయలో సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో సమాచారం అందడం జాప్యమయింది. లోయ కింది భాగానికి వెళ్లడానికి ఇబ్బందులు రావడంతో కొనఊపిరితో ఉన్న కొందరిని కాపాడలేకపోయారు.  ప్రమాద  కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్టు టోకవాడే పోలీసు స్టేషన్ అధికారి పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు.
 
 మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు..
 మాల్శేజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎంస్‌ఆర్టీసీ ప్రకటించింది.  గాయపడినవారి వైద్యఖర్చులు భరిస్తామని తెలిపింది.   
 
 మృతుల వివరాలు...
 పూనం ఆహేర్, కిషన్ చౌదరి, కారభారి కురకుంటే, బాలు ఆహేర్, తుకారాం భవారీ, పరశురాం సోనవణే, విజయ్ కులకర్ణి, పోపట్ దాతే, మేఘాహాండే, బబన్ ఆహేర్, సరస్వతి ఆహేర్, ముకుంద్ పాలేకర్, విమల్ పాలేకర్, సాయిబాయి ఆహేర్, ప్రశాంత్ ఆమ్టే, కళ్యాణ్ జాధవ్, వైశాలీ ఆహేర్, కె.ఎన్.చౌదరి (డ్రైవర్), డి.బి.గోండకే (కండక్టర్)గా గుర్తించారు. మిగతా ఎనిమిది మంది పేర్లు తెలియాల్సి ఉంది.
 
 రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
 నాసిక్ -వణీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న క్వాలిస్, గూడ్స్ వాహనాలు గుద్దుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు నాసిక్ జిల్లా  ఉణందానగర్ గ్రామ సమీపంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులతోపాటు గాయపడిన వారందరూ నాసిక్ కు చెందినవారేనని తెలిసింది. మృతుల్లో గుల్షన్‌ఖాన్ పఠాన్ (38), ఆయన భార్య రుబీనా పఠాన్ (35), కుమారుడు సోను అలియాస్ ఆసీఫ్ పఠాన్(14)లున్నారు. గాయాలపాలైనవారిలో సాది క్ షేక్(35), గుడ్డి అలియాస్ సిమ్రాన్ పఠాన్ (18)లతోపాటు క్వాలిస్ డ్రైవర్ కూడా ఉన్నారు. పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement