Malshej Ghat accident
-
ముంచింది నిర్లక్ష్యమే!
సాక్షి, ముంబై: మాల్శేజ్ రోడ్డును విస్తరించకపోవడం, రైల్వేలైన్ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘాట్‌పై వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఠాణే-అహ్మద్‌నగర్ బస్సు గురువారం మాల్శేజ్‌ఘాట్ లోయలో పడి 27 మంది ప్రయాణికులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్శేజ్ ఘాట్‌రోడ్డు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంపై మరోసారి చర్చ మొదలయింది. ప్రతి వర్షాకాలంలో మాల్శేజ్‌ఘాట్ రోడ్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తొందర్లోనే ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా మారుస్తామని, ఠాణే-అహ్మద్‌నగర్ రైల్వేలైన్ కూడా వేస్తామని ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు పలుసార్లు హామీ ఇచ్చినా అవేవీ నెరవేరలేదు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతాలు ఇంకా చాలా వె నుకబడి ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 130 కిలోమీటర్లు, ఠాణే నగరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో మాల్శేజ్‌ఘాట్ ఉంది. 222 నంబరు జాతీయ రహదారి ఘాట్ మార్గం మీదుగా కళ్యాణ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వరకు వెళ్తుంది. అయినప్పటికీ అనేక మంది ఈ రహదారిని వినియోగించుకోకుండా పుణే లేదా ఇతర మార్గాల మీదుగా వెళ్తుంటారు. దీనికి ప్రధాన కారణం మాల్శేజ్ ఘాట్ రోడ్డు ఎంతో ఇరుగ్గా, అనేక మలుపులతో ఉండడమే! కళ్యాణ్ నుంచి ముర్బాడ్ మీదుగా అహ్మద్‌నగర్ వెళ్లేవాటితోపాటు ఇతర బస్సులు మాత్రమే ఈ మార్గం మీదుగా వెళ్తుంటాయి. ప్రయాణ సమయం కాస్త ఆదా అవుతుందని తెలిసినా ఈ మార్గంలో ప్రయాణించడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించాలని వాహనదారులు, ముర్బాడ్ నుంచి మాల్శేజ్ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు అనేక రోజులుగా కోరుతున్నారు. గుడ్డిలో మెల్లలా కళ్యాణ్-నిర్మల్ రోడ్డుకు మాత్రం జాతీయ రహదారిగా హోదా కల్పించారు. కాగితాలకే పరిమితమైన రైల్వేలైన్ ...! కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డుకు ప్రత్యామ్నయంగా రైల్వేమార్గం నిర్మించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా మారింది. ముంబైకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో రైల్వేమార్గం ఏర్పాటైతే స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వేలైన్ ప్రతిపాదన గత 39 ఏళ్లుగా కాగితాలకే పరిమిత మయింది. మాల్శేజ్‌ఘాట్ రైల్వే ప్రాజెక్టును 1974లో కేవలం రూ.108 కోట్ల బడ్జెట్‌తో చేపట్టాలనుకున్నారు. అయితే ప్రస్తుతం దీని అంచనావ్యయం ఏకంగా రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సర్వే పనులే పూర్తి చేయలేదు. కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డు విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాలను కలుపుతుంది. దీనిని నాలుగులేన్లుగా విస్తరిస్తే మాల్శేజ్ ఘాట్ చుట్టుపక్కల ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. మాల్శేజ్ రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టనున్నట్టు రామ్‌విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. నిధులు లేకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ మార్గం చాలా లాభసాటిగా ఉంటుందని రైల్వే 2006లో చేపట్టిన సర్వేలో వెల్లడయింది. 204 కిలోమీటర్ల రైల్వేమార్గం నిర్మాణానికి రూ.772 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే భూసేకరణ, ఇతర పనులు కొనసాగించేందుకు నిధులు లేకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు. మూడేళ్లలో 189 ప్రమాదాలు... మాల్శేజ్ ఘాట్‌పై గత మూడేళ్లలో 189 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 59 మంది ప్రాణాలను కోల్పోయారు. గత సంవత్సర కూడా 42 ప్రమాదాలు సంభవించగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందికి గాయాలయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎంఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై లోయలో పడడంతో 27 మంది మరణించారు. ఈ మార్గంపై పదేళ్ల కిందట జరిగిన వాటితో పోలిస్తే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇందులో ప్రభుత్వ కృషి ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళలు, వర్షాకాలంలో వాహనదారులు ఈ మార్గం మీదుగా వెళ్లకపోవడం వల్లే ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. -
లోయలో ఘోరకలి
సాక్షి, ముంబై: కన్ను మూసి తెరిచేలోపు 27 మంది ప్రాణాలు గాలిలోకి కలసి పోయాయి. నిత్యం పచ్చగా కనిపించే మాల్శేజ్లోయ ఎరుపురంగులోకి మారింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎంఎస్ఆర్టీసీ) బస్సు గురువారం ఘోరప్రమాదానికి గురికావడంతో 27 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మద్‌నగర్ బయలుదేరిన బయల్దేరిన ఈ బస్సు ఠాణే-నాసిక్ జిల్లా సరిహద్దులో ఉన్న మాల్శేజ్‌ఘాట్ లోయలో పడింది. సుమారు 300 అడుగులకుపైగా లోతున్న లోయలో పడడంతో బస్సు మూడు ముక్కలుగా మారి నుజ్జునుజ్జయింది. ఈ సందర్భంగా గాయపడ్డ 11 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ కండక్టర్లతోపాటు ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు. విఠల్వాడి డిపోకు చెందిన ఈ బస్సు ఉదయం సుమారు 5.45 గంటలకు ఠాణేలోని లోకమాన్యనగర్ నుంచి నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మద్‌నగర్‌కు బయలుదేరింది. కండక్టర్, డ్రైవర్ సహా ఇందులో మొత్తం 38 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు జున్నర్ తీర్థయాత్రకు బయలుదేరారు. వీరి ప్రయాణం మాల్శేజ్ ఘాట్ వరకు బాగానే సాగింది. టోకావడే పోలీసు స్టేషన్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని శంకర్ మందిరం సమీపంలో ఒక లారీ ఎదురు వచ్చింది. కలపతో నిండి ఉన్న లారీ, ఆర్టీసీ బస్సు కుడివైపు స్వల్పంగా ఢీకొంది. దీన్ని తప్పించాలనే తాపత్రయంతో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తిప్పాడు. దీంతో అది ఒక్కసారిగా సుమారు 300 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భీతిల్లి ఆర్తనాదాలు మొదలుపెట్టారు. బస్సు కుదుపులతోపాటు మెల్లమెల్లగా భారీ శబ్దంతో కిందికి జారిపోవడంతో ముక్కలైంది. అందులోని ప్రయాణికులు కూడా చెల్లాచెదురయ్యారు. లోయలోని చెట్లు, బండరాళ్లపై పడిపోయారు. ఎటు చూసిన ఆర్తనాదాలు, రోదనలతో పరిసరాలు మార్మోగాయి. అనేక మంది అప్పటికే విగత జీవులయ్యారు. మరికొందరు కొనఊపిరితో రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలైన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించి శవాలను వెలికితీశారు. ఈ లోయలో సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో సమాచారం అందడం జాప్యమయింది. లోయ కింది భాగానికి వెళ్లడానికి ఇబ్బందులు రావడంతో కొనఊపిరితో ఉన్న కొందరిని కాపాడలేకపోయారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్టు టోకవాడే పోలీసు స్టేషన్ అధికారి పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు.. మాల్శేజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎంస్ఆర్టీసీ ప్రకటించింది. గాయపడినవారి వైద్యఖర్చులు భరిస్తామని తెలిపింది. మృతుల వివరాలు... పూనం ఆహేర్, కిషన్ చౌదరి, కారభారి కురకుంటే, బాలు ఆహేర్, తుకారాం భవారీ, పరశురాం సోనవణే, విజయ్ కులకర్ణి, పోపట్ దాతే, మేఘాహాండే, బబన్ ఆహేర్, సరస్వతి ఆహేర్, ముకుంద్ పాలేకర్, విమల్ పాలేకర్, సాయిబాయి ఆహేర్, ప్రశాంత్ ఆమ్టే, కళ్యాణ్ జాధవ్, వైశాలీ ఆహేర్, కె.ఎన్.చౌదరి (డ్రైవర్), డి.బి.గోండకే (కండక్టర్)గా గుర్తించారు. మిగతా ఎనిమిది మంది పేర్లు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి నాసిక్ -వణీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న క్వాలిస్, గూడ్స్ వాహనాలు గుద్దుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు నాసిక్ జిల్లా ఉణందానగర్ గ్రామ సమీపంలో గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులతోపాటు గాయపడిన వారందరూ నాసిక్ కు చెందినవారేనని తెలిసింది. మృతుల్లో గుల్షన్ఖాన్ పఠాన్ (38), ఆయన భార్య రుబీనా పఠాన్ (35), కుమారుడు సోను అలియాస్ ఆసీఫ్ పఠాన్(14)లున్నారు. గాయాలపాలైనవారిలో సాది క్ షేక్(35), గుడ్డి అలియాస్ సిమ్రాన్ పఠాన్ (18)లతోపాటు క్వాలిస్ డ్రైవర్ కూడా ఉన్నారు. పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు.