‘ప్రైవేటు’ దోపిడీ
Published Thu, Sep 5 2013 11:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
గణేశుడి ఉత్సవాల కోసం ముంబై నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతగ్రామాలకు వెళ్తుండడంతో ప్రైవేటు బస్సుల యజమానులు నిలువు దోపిడీకి తెరలేపారు. చార్జీలను ఏకంగా మూడురెట్లు పెంచారు. వారాంతాల్లో అదనంగా రూ.200 వరకు వసూలు చేస్తున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంకణ్ ప్రాంతం దిశగావెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు విచ్చలవిడి దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు లగ్జరీ బస్సుల బాటపట్టారు. ఒక్కసారిగా పెరిగిన రద్దీని అదనుగా చేసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు చార్జీలు ఏకంగా మూడురెట్లు పెంచి జేబులు నింపుకుంటున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ైరె ల్వేశాఖ సాధారణంగా నడిపించే రైళ్లతోపాటు 66 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసింది.
అదేవిధంగా ఎమ్మెస్సార్టీసీ కూడా రోజు బయలుదేరే బస్సులతోపాటు అదనంగా వివిధ డిపోల నుంచి 1,800లకుపైగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయినప్పటికీ ఇవన్నీ ఎంతమాత్రమూ చాలకపోవడంతో అదనంగా 100 బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తికావడంతోపాటు వెయిటింగ్ లిస్టు వెయ్యికిపైబడిన విషయం తెలిసిందే. దీంతో ఈ టికెట్లు ‘కన్ఫర్మ్’ అవుతాయనే నమ్మకం లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు లగ్జరీబస్సులు, క్వాలిస్, సుమోలు, కార్ల వైపు దృష్టిసారించారు. ఉత్సవాలు దగ్గరపడడంతో స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
మొన్నటి వరకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.350 చొప్పున చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు వాహన యజమానులు ఉత్సవాలు దగ్గర పడడంతో రూ.850 వరకు వసూలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అదనంగా రూ.200 వసూలు అవకాశాలున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఇలా ప్రైవేటు వాహన యజమానులు రద్దీని అదనుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. చాలా వరకు ప్రైవేటు బస్సులు పాతవే ఉంటాయని, వాటిలో వసతులూ అంతంతమాత్రమేనని కుర్లావాసి ఒకరు అన్నారు. ప్రైవేటు వాహనాల్లో చాలా వరకు వేగపరిమితి నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబెసైంట్రల్, పరేల్, వర్లి, లాల్‌బాగ్, బోరివలి, కుర్లా, శాంతాక్రజ్ నుంచి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతాయి. రాత్రిపూట ఈ ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ముంబై-గోవా జాతీయ రహదారిపై ఏర్పాట్లు
ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆర్టీసీ ముంబై-గోవా జాతీయ రహదారిపై అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించనుంది. నాలుగు మెకానిక్‌ల బృందాలను ఏర్పాటు చేయనుంది. మార్గమధ్యలో బస్సులకు రిపేరు వస్తే వెంటనే మరమ్మతులు పూర్తిచేసి పంపించేందుకు వీరిని నియమిస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు. వీరంతా 24 గంటలు అందుబాటులో ఉంటారు. పోలీసుశాఖ కూడా తమవంతుగా 500పైగా సిబ్బందిని నియమించింది. ఉత్సవాలప్పుడు రహదారిపై భారీ రద్దీ ఉంటుంది. ప్రమాదం జరిగి ట్రాఫిక్ స్తంభిస్తే వాహనాలను దారి మళ్లించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
Advertisement
Advertisement