సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) గణేశ్ ఉత్సవాల పుణ్యమా.. గట్టెక్కింది. ఉత్సవాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంకణ్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్‌వాడి తదితరా జిల్లాలకు లక్షలాది ప్రయాణికులను ఎమ్మెస్సార్టీసీ చేరవేసింది. ఆర్టీసీ బస్సులన్నీ వంద శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించాయి.
ఈ వారం, పది రోజుల్లో మంచి ఆదాయం వచ్చిందని ముంబై రీజియన్ ఆర్టీసీ జనరల్ మేనేజరు రాహుల్ తోరో తెలిపారు. ఉత్సవాల సమయంలో మొత్తం 7,984 ట్రిప్పులు నడిపి 3.51 లక్షల మందిని చేరవేసింది. ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే రైళ్లు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నడిచాయి. అందులో ఉత్సవాలకు రెండు రోజుల ముందు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, రైళ్ల రాకపోక వేళలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక రైళ్లను రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఇక కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించక తప్పలేదు. ఇది ఆర్టీసీకి కలిసొచ్చింది.
సాధారణ రోజుల్లో..
సాధారణ రోజుల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోని వివిధ బస్ డిపోల నుంచి కొంకణ్ దిశగా 1,686 ట్రిప్పులు నడుస్తాయి. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 26-29 మధ్యన అదనంగా 1,924 ట్రిప్పులు నడిపారు. ఈ నెల 8వ తేదీన ఉత్సవాలు పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో సుమారు అంతే సంఖ్యలో ట్రిప్పులు, అంతే సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ మంచి ఆదాయాన్ని రాబట్టింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గణేశ్ ఉత్సవాలు కొంత మేర ఆదుకున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెస్సార్టీసీకీ భారీ ఆదాయం
Published Thu, Sep 11 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement
Advertisement