సాక్షి, ముంబై: విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలతో గృహిణులు బేజారవుతున్నారు. గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలు మూడు రెట్లకుపైనే పెరిగిపోయాయి. ఇప్పటికే పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. దీనికి తోడు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి వచ్చింది. ఆదివారం నుంచి శ్రావ ణమాసం ప్రారంభవుతోంది. దీంతో కూరగాయల ధరలు మరింత మండిపోనున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు ముగిసేవరకు మద్యం, మాంసాన్ని ముట్టుకోరు.
దీంతో కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. ఒకపక్క పెరిగిన డిమాండ్, మరోపక్క సరుకు కొరత కారణంగా వాటి ధరలు చుక్కలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఉల్లి ధరలు బెంబేలెత్తించాయి. ఉల్లి పంటలకు ప్రధాన కేంద్రంగా ఉన్న నాసిక్ జిల్లాలోని లాసల్‌గావ్‌లో బడా వ్యాపారులు వేలం పాటను వారం రోజులపాటు నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి సరుకు మార్కెట్లకు రాలేదు. ఫలితంగా ధరలు పెరిగాయి. ఇటీవల ఉల్లి ధరలు కొంత దిగిరావడంతో ముంబైకర్లకు ఊరట లభించింది. కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.
ఇప్పుడు కూరగాయాలు మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టమాటాలు, పచ్చి మిర్చి ధరలు విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు కేజీకీ రూ.30 ధర పలికిన టమాటాలు ఇప్పుడు రూ. 120 పైనే పలుకుతోంది. దీన్ని బట్టి ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉండగా శ్రావణమాసం ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో మద్యం సేవించి వారికి, మాంసం, చేపలు తినేవారికి శనివారం ఆఖరు రోజు. దీంతో శుక్ర, శనివారాలు మాంసం, చికెన్ విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో మాంసం, చికెన్ ధరలు కూడా పెంచేశారు.
మొన్నటివరకు నాటు కోడి కేజీ ధర రూ.190 ఉండగా ప్రస్తుతం రూ.220 ధరకు విక్రయిస్తున్నారు. బాయిలర్, ఇంగ్లిష్ లాంటి ఫారం కోళ్ల ధరలు కూడా ఒక్కసారిగా పెంచేశారు. గత ఏడాది ఇదే సమయంలో మేక మాంసం కేజీకి రూ.350 చొప్పున విక్రయించగా ప్రస్తుతం రూ.400-420 వరకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మేలో కురిసిన అకాల వర్షాలవల్ల చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. దీంతో అప్పుడు కూడా కూరగాయల ధరలు చుక్కలను తాకాయి. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నప్పటికీ అందకుండా పోతున్నాయి. ఈ పరిస్థితులు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.
ఆకాశమే హద్దుగా..
Published Fri, Jul 25 2014 11:15 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement