Ganesh festivities
-
గణేష్ ఉత్సవాలతో నగరానికి కీర్తి
అబిడ్స్: గణేష్ ఉత్సవాలతో నగర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. గోషామహల్ హిందీనగర్‌లో మార్కెట్ మాజీ డైరెక్టర్ టి. సతీష్‌కుమార్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శనివారం దానం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు సతీష్, బీజేపీ నేత బంగారు సుధీర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు ధన్ రాజ్, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు గడ్డమీది నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల కట్టడికి చర్యలు
చార్మినార్ : పండుగలు వస్తున్నాయంటే... రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అయితే ప్రస్తుతం వీరితో పాటు దక్షిణ మండలం పోలీసులు కుక్కలపై (గ్రామసింహాలు) కూడా దృష్టి పెట్టారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని డీసీపీ సత్యనారాయణ కుక్కలను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వినాయక ఉత్సవాలు.. మరోవైపు ఈనెల 25న జరుగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు పాతనేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. అలాగే, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్న కుక్కలను కట్టడి చేయాలని డీసీపీ నిర్ణయించారు. చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కుక్కల సంచారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. కుక్కలతో ఇరు వర్గాల ఘర్షణలు... బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కనిపించే జంతువుల వ్యర్థాలను కుక్కలు తింటుంటాయి.అయితే,కొన్ని కుక్కలు ఆ వ్యర్థాలను తమకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా తింటుంటాయి. ఇలా తీసుకెళ్లే కుక్కల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల వ్యర్థాలను వినాయక మండపాలు, మండపాల సమీపంలోకి తీసుకె ళ్లి వదిలేస్తే.. మండపాల నిర్వాహకులు, భక్తులకు ఆగ్రహం వచ్చి ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా కుక్కలను కట్టడి చేయడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. గట్టి బందోబస్తు... జంట పండుగల కోసం ఇప్పటికే పాతబస్తీలో అదనపు బలగాలను రప్పించి బందోబస్తులో నియమించామన్నారు. ఒక కంపెనీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు, రెండు కంపెనీల సీఆర్పీఎఫ్, రెండు కంపెనీల ఆర్‌ఏఎఫ్‌లతో పాటు 2 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. శాంతి సామరస్యంతో పండుగలు జరుపుకోవాలి... జంట పండుగులను ఇరువర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో జరుపుకోవాలి. గణేశ్ వేడుకలు, బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో గట్టి బందోబస్తు కొనసాగిస్తున్నాం. వినాయక మండపాల నిర్వాహకులు 9వ రోజు (ఈనెల 25న)న పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించే అవకాశాలున్నాయి. అదే రోజు బక్రీద్ పండుగ ఉన్నందున భక్తులు తమ విగ్రహాల నిమజ్జనాన్ని ఒక రోజు ముందు చేసుకోవడంలేదా..26వ తేదీకి వాయిదా వేసుకుంటే బాగుంటుంది. -వి.సత్యనారాయణ, దక్షిణ మండలం డీసీపీ -
గణేశ్ ఉత్సవాలకు భారీ భద్రత
నగరానికి చేరుకున్న అదనపు బలగాలు సాక్షి, సిటీబ్యూరో : ముంబై తర్వాత అత్యంత వైభవంగా నగరంలో నిర్వహించే గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నగర, సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి వినాయక చవితి, బక్రీద్ ఒకే సమయంలో రావడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక ఫోర్స్‌ను రప్పిస్తున్నారు. తొలి దశ కింద ఆరు వేల మందిని రప్పించిన అధికారులు.. నిమజ్జనం రోజు అదనంగా మరిన్ని బలగాలను రప్పించాలని నిర్ణయించారు. మైత్రీ సంఘాలు, ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్లలో పీస్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలతో పాటు బక్రీద్ పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇద్దరేసి సిబ్బంది... జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న 1200కు పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో అపశ్రుతులు దొర్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వినాయక మండపం స్థాయిని బట్టి ఇద్దరేసి సిబ్బందిని బందోబస్తుగా కేటాయిస్తున్నారు. నగరంలో డీజేలపై నిషేధం ఉండటంతో మండపాల వద్ద సాధారణ మైకులను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులు చెప్తున్నారు. సైబరాబాద్‌లో... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు పది వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.స్థానికంగా ఏడు వేల మంది సిబ్బంది ఉన్నా, బయటి నుంచి మూడు వేల మంది పోలీసులను రప్పిస్తున్నారు. మండపాలకు వేలల్లో దరఖాస్తులు... జంట పోలీసు కమిషనరేట్లలలో వినాయక మండపాల ఏర్పాటుకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేల విగ్రహాలు, సైబరాబాద్ పరిధిలో 15 వేల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశముంది. అధికారికంగా దాదాపు 14 వేల మండపాలకు అనుమతివ్వగా, గల్లీలు, ఇళ్లు, అపార్ట్మెంట్లలో ప్రతిష్టించే వి 11 వేల విగ్రహాల వరకు ఉంటాయని నగర పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనూ విగ్రహాల ఏర్పాటుకు పది వేల దరఖాస్తులు వచ్చాయి. అనధికారికంగా మరో ఐదు వేల విగ్రహాల వరకు ఏర్పాటు చేయవచ్చని పోలీసులంటున్నారు. -
ఎమ్మెస్సార్టీసీకీ భారీ ఆదాయం
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) గణేశ్ ఉత్సవాల పుణ్యమా.. గట్టెక్కింది. ఉత్సవాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంకణ్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్వాడి తదితరా జిల్లాలకు లక్షలాది ప్రయాణికులను ఎమ్మెస్సార్టీసీ చేరవేసింది. ఆర్టీసీ బస్సులన్నీ వంద శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించాయి. ఈ వారం, పది రోజుల్లో మంచి ఆదాయం వచ్చిందని ముంబై రీజియన్ ఆర్టీసీ జనరల్ మేనేజరు రాహుల్ తోరో తెలిపారు. ఉత్సవాల సమయంలో మొత్తం 7,984 ట్రిప్పులు నడిపి 3.51 లక్షల మందిని చేరవేసింది. ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే రైళ్లు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నడిచాయి. అందులో ఉత్సవాలకు రెండు రోజుల ముందు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, రైళ్ల రాకపోక వేళలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక రైళ్లను రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఇక కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించక తప్పలేదు. ఇది ఆర్టీసీకి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో.. సాధారణ రోజుల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోని వివిధ బస్ డిపోల నుంచి కొంకణ్ దిశగా 1,686 ట్రిప్పులు నడుస్తాయి. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 26-29 మధ్యన అదనంగా 1,924 ట్రిప్పులు నడిపారు. ఈ నెల 8వ తేదీన ఉత్సవాలు పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో సుమారు అంతే సంఖ్యలో ట్రిప్పులు, అంతే సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ మంచి ఆదాయాన్ని రాబట్టింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గణేశ్ ఉత్సవాలు కొంత మేర ఆదుకున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. -
వైభవంగా గణేష్ ఉత్సవాలు
సాక్షి, ముంబై: ఠాణేలో గణేషోత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు. గణనాథుడి కి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు సుభాష్‌నగర్ పోక్రాన్ రోడ్డు నెంబరు రెండులోని ‘శ్రీ ఆంధ్ర గణేష్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 1967 నుంచి ప్రతీఏటా గణేషోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే సుభాష్‌నగర్, హజూరి, సీపీ తలావ్, కిసన్‌నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో చవితి పండుగ సందడి నెలకొన్నది. 48 ఏళ్లుగా... శ్రీ ఆంధ్ర గణేష్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 48 ఏళ్లగా (ప్రతీఏటా) ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వినాయకుడు కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. ఠాణేతో పాటు ముంబై, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్ తదిత ర ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకొంటారు. సుభాష్‌నగర్‌లో కె.ఎ.పి.ఎల్ కంపెనీ, వెల్మెన్ కంపెనీలలో పనిచేసే తెలుగు కార్మికులు, ఆంధ్రా నుంచి వచ్చిన టైలర్స్‌తో పాటు ఇతర పనులు చేసుకుంటున్న ప్రజలు కలిసికట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులందరూ కలిసి 1967లో వినాయకుని ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ దేవాలయాన్ని 4 సంవత్సరాల కిందటే ఆధునీకీకరించారు. ప్రస్తుతం తెలుగు గణేషోత్సవ మండలికి అధ్యక్షులుగా గుత్తుల సాహెబ్రావ్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీను, క్యాషియర్లు శ్రీమాన్నారాయణలు బాధ్యతలు నిర్వహిస్తున్నారని మండలి సభ్యులు దాసరి భాస్కర్ రావ్ తెలిపారు. ప్రత్యేక పూజలు... ఈ సంవత్సరం పత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరానికి చెందిన బ్రాహ్మణులు ప్రభాకర్ బృందాన్ని ఠాణేకి తీసుకొచ్చారు. ప్రతి ఏట మాదిరిగానే ఈ సారి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఉత్సవాల్లో తెలుగు సంస్కతి సాంప్రదాయలు ఉట్టిపడుతాయి. శనివారం రాత్రి పిల్లలకు డాన్స్ ప్రొగ్రామ్, డ్రాయింగ్ పోటీ తదితరాలు నిర్వహించారు. నేడు సత్యనారాయణ మహాపూజ... గణేషోత్సవాలలో చివరిఘట్టంలో భాగంగా ఆదివారం శ్రీసత్యనారాయణ మహాపూజ నిర్వహించనున్నారు. ‘లక్ష పత్రి’ (వినాయకుని) పూజ హోమాలు చేయనున్నారు. చివరి రోజు సోమవారం అన్నదానం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భివండీ పట్టణంలోని కన్నేరి ప్రాంతంల్లో బివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలోని కన్నేరి ప్రాంతంలో 48 ఏళ్లుగా తెలుగు యువక్ మండలి సార్వజనీక గణేషోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను పుర స్కరించుకొని ప్రతి సంవత్సరం మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తదితర సాంఘిక దురాచారలపై ప్రజలను చైతన్యం చేస్తోంది. ఇందుకు ఎన్నో బహుమతులను మండలి సొంతం చేసుకొంది. ఈ సంవత్సరం స్వార్థం అనే అంశంపై చాలా చక్కటి ఛాయా చిత్రాలతో వినాయకుడి మండపాన్ని అలంకరించింది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝాము వరకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొంటున్నారని మండలి అధ్యక్షుడు గాజెంగి రాజు తెలిపారు. మండలి సభ్యులు బిల్ల నరేందర్, వడ్లకోండ శ్రీనివాస్, బిల్ల శేఖర్, చెన్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్వార్థ వీడాలి.. తనకు కోరికలు తీరిస్తే, నీకు కానుకలు అందజేస్తామని కొందరు స్వార్థ బుద్ధితో దేవుడిని పూజిస్తున్నారు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రుల అనారోగ్యం గురించి పట్టించుకోనివారు దేవునికి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదనే సందేశానిస్తున్నారు. రోడ్లపై, బస్సు స్టాపుల్లో అమ్మాయిలను వేధించి, వారిని కిడ్నాప్ చేస్తున్న కామాంధులను పట్టించుకోకుండా భక్తిప్రపత్తులు చాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చాటి చెబుతున్నారు. స్వార్ధాన్ని విడనాడి సమాజ శ్రేయస్సుకు పాటుపడడంలోనే దేవుని పట్ల నిజమైన భక్తి భావం ఉన్నట్లువుతుందని, వారికే విఘ్నేశ్వరుడి దీవెనలు ఉంటాయని చెబుతున్నారు. జైహింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో.. భివండీ, న్యూస్‌లైన్: ప్రసిద్ధి గాంచిన జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భివండీ పట్టణంలో అత్యధికంగా తెలుగు ప్రజలు ఉండే పద్మానగర్ ప్రాంతంలో 30 ఏళ్లుగా ఈ మండలి వారు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలోని గణపతి మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడి ఆకారంలో అలంకరించారు. పర్యావరణానికి హాని జరగకుండా వెదురు బొంగులు, కార్బన్ దుస్తులు, కాగితాలు, తర్మాకోల్ వస్తువులతో అతి సుందరంగా తీర్చిదిద్దారు. మట్టితో చేసిన వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. వినాయకున్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సాక్షాత్ తిరుమల తిరుపతి గర్భగుడిలో ఉన్నట్లు అనుభూతిని పొందుతున్నామని భక్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వివిధ సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య వంతం చేస్తూ బహుమతులను అందుకోంటోందని, ఈ సంవత్సరం ధామన్‌కర్ నాకా మిత్ర మండల్‌కు ప్రథమ బహమతి లభించగా, ద్వితీయ బహుమతి జై హింద్ మిత్ర మండల్‌కు లభించిందని మండలి అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ సుంక తెలిపారు. ప్రముఖులకు సన్మానం పట్టణంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నిత్యం ఇక్కడి వినాయకుడిని దర్శించుకొంటారు. వీరిని నిర్వాహకులు ఘనంగా సత్కరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబై సర్కల్ జనరల్ మేనేజర్ డి. పూర్ణచంద్ర రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శివానంద, పీఆర్ఓ చంద్రశేఖర్‌ను మండలి అధ్యక్షుడు సుంక శ్రీధర్, పదాధికారులు మ్యాన రవి, వాసం మునింధర్, కొండ మోహన్, కముటం సుధాకర్, బూర పప్పు తదితరులు ఘనంగా సత్కరించారు. -
జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..
దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు. వినాయకుడి విగ్రాహాల వద్ద ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వీధులన్నీ జైబోలో గణేష్ నామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రజలను వివిధ సామాజిక అంశాలపై కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. గణేష్ మండళ్లు ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ అంశాలపై పోస్టర్లు, మ్యానిక్వీన్లు, లైట్ అండ్ సౌండ్ షోలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. పెద్దలను ఎలా గౌరవించాలి, వృద్ధులైన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోంలకు తరలించ కూడదు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్, సెల్ టవర్లపట్ల పొంచి ఉన్న ప్రమాదాన్నికూడా షోల ద్వారా తెలియజేస్తున్నారు. వినూత్న సెట్టింగ్‌లు కేత్వాడి ఖమ్బాతా లేన్ సార్వజనిక్ గణేషోత్సవ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయడానికి 20 అడుగుల గణేష్ విగ్రహాన్ని పచ్చని చెట్టుపై ఉండేలా వినూత్నంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలపై 6 నిమిషాల పాటు భక్తులకు కళ్లకు కట్టినట్లు ఆడియో విజువల్స్ ద్వారా లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మిమిక్రీ కళాకారుడు ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను ఆయా మండళ్లు ఏర్పాటు చేశాయి. శివ్డి మధ్య విభాగ్ గణపతి సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి ఆధ్వరం్యలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలను ప్రదర్శనల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. యువతను వీటి వల్ల అప్రమత్తం చేస్తున్నామని మండలి సభ్యులు పేర్కొన్నారు. సెల్ టవర్ల ద్వారా కూడా ముప్పు పొంచి ఉన్నదనే అంశాన్ని తెలియజేస్తున్నామన్నారు. అవినీతి, వరకట్న దురాచారంపై అంధేరీకి చెందిన ఈశ్వర్ తరూణ్ మిత్ర మండలి వారు అవినీతికి , వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్ గోపాల్ మిత్ర మండలి వారు వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకోవాలని వారిని ఆశ్రమాలకు పంపకూడదని సూచిస్తున్నారు. పౌరాణిక పాత్రలైన శ్రావణ్ బాల్, రాముడు, భక్త పుండరీకుడు ఇంకా తదితరులనూ స్ఫూర్తిగా తీసుకోవాలిని తెలియజేస్తున్నారు. ఫైబర్‌తో తయారు చేసిన విగ్రహాల ద్వారా పెద్దలను ఎలా గౌరవించాలన్న అంశాన్ని చాటి చెబుతున్నారు. డోంబివలిలో ..... ముంబై శివారు ప్రాంతమైన డోంబివలి పట్టణంలో గణపతి ఉత్సవాలు జోరందుకున్నాయి. పలు యువ సేవా మండళ్లు గణపయ్య విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి భక్తులకు కనువిందు కలిగిస్తున్నారు. ఒకటిన్నర రోజు, ఐదు రోజుల గణపతి నిమజ్జనం చేశారు. పట్టణంలోని మండళ్లలో ఏర్పాటు చేసిన స్వామివారి సందర్శనార్థం భక్తుల తరలివస్తున్నారు. డోంబివలిలోని సాయినాథ్ మిత్రమడల్, అచానక్ సార్వజనీక మిత్ర మండల్, ఆటో రిక్షా చాలక్ సంఘటన, యువ మిత్ర మండలి తదితర యువసేన మండళ్లు ప్రతి రోజు స్వామివారికి నిత్య పూజల నిర్వహిస్తున్నారు. సందర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని మండళ్లు భక్తి సంగీత భజనలు, నృత్య పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవతారాలతో కొలువుదీరిన గణపయ్యను కనులారా తిలకించి భక్తులు పులకించిపోతున్నారు. -
దామరపల్లిలో టీడీపీ వర్గీయుల దాడి
- వినాయక ఊరేగింపులో అధికారపార్టీ దౌర్జన్యం - ఐదుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు దామరపల్లి (తాడికొండ): రెండు సామాజికవర్గాలు వినాయక ఉత్సవాల్లో పైచేయి సాధించేందుకు పరస్పరం దూషణలకు దిగాయి. సర్ది చెబుతామని వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి దిగిన సంఘటన దామరపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. దామరపల్లిలో ఒక ప్రధాన సామాజిక వర్గం టీడీపీకి చెందినది. 30ఏళ్లుగా మిగిలిన సామాజికవర్గాలు ఒకటిగా ఉంటుండడంతో ఆ ప్రధాన సామాజికవర్గం ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. దామరపల్లి ఎంపీటీసీ సెగ్మెంటు పరిధిలో ఫణిదరం, గరికపాడు గ్రామాలు కలిసివుంటాయి. ఇటీవల జరిగిన మండల పరిషత్, సాధారణఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే పైచేయి అ య్యింది. అప్పటినుంచి అధికార టీడీపీ అదను కోసం ఎదురుచూస్తోంది. ఎన్నికల్లో ఎస్సీలు తమ పార్టీకి ఓట్లు వేయలేదని గెలిచాక ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి వుంది. ఈ నేపథ్యంలోగ్రామంలోని రెండు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు వినాయకుడి ఊరేగింపు ఆదివారం ఉదయం నుంచే ప్రారంభించారు. మధ్యాహ్నానికి రెండు వర్గాల మధ్య స్వల్పవివాదం నెలకొనగా.. మొదటగా స్థానిక వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ అల్లూరి సీత సోదరుడైన పెరుమాళ్ళ శ్రీనివాసరావు ఇరువర్గాలను నచ్చజెప్పి సముదాయించాడు. ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన టీడీపీ వర్గీయులు గతంలో ఓట్లు వేయని మీరు చెప్పేదేంటని దుర్భాషలాడుతూ 20మంది వ్యక్తులు వెంట పడి శ్రీనివాసరావును బురదకాలువలో తొక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. సమాచార మందుకున్న పోలీసులు వినాయకుడి విగ్రహాలను తరలింపజేసి.. గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పికెట్ ఏర్పాటుచేశారు. రెండు వర్గాలు రాజీకి వచ్చి గ్రామంలో శాంతిభద్రతలకు విఘా తం కలగకుండా చూస్తామని పోలీసులకు తెలిపాయి. -
చవితి ‘బాదుడు’..!
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలను అదనుగా చేసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వినాయక చవిత శుక్రవారం కావడంతో స్వగ్రామాలకు వెళ్లేవారు ముంబై నుంచి ఎట్టి పరిస్థితుల్లో గురువారం బయలుదేరాల్సిందే. దీన్ని ప్రైవేటు బస్సు, టూరిస్టు యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా కొంకణ్ వెళ్లే వారి సంఖ్య 90 శాతం ఉంటుంది. రెగ్యూలర్‌గా నడిచే రైళ్ల రిజర్వేషన్ రెండు నెలల కిందటే ఫుల్ అయ్యాయి. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న వందకుపైగా రైళ్లు, ఎమ్మెస్సార్టీసీ నడుపుతున్న 3,500కు పైగా ప్రత్యేక బస్సులు కూడా ఎటూ సరిపోవడం లేదు. దీంతో కొంకణ్ వాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రైవేటు వాహనాల యజమానులు దోపిడీ పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కొంకణ్ రీజియన్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్వాడి ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.400-500 చార్జీలు వసూలు చేస్తారు. కాని గణేష్ ఉత్సవాల పుణ్యమా అని ఒక్కసారిగా రెండు, మూడు రెట్లు చార్జీలు పెంచేశారు. దీనికి తోడు కొంకణ్ రైళ్లు 12 గంటలు ఆలస్యంగా నడవడం, మొన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దుకావడం, తాజాగా బుధవారం సిగ్నల్ ఫెయిల్ కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఘాట్ ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ..ఇలా అనేక కారణాలవల్ల అత్యధిక శాతం ప్రజలు ప్రైవేటు వాహనాల్లో వెళ్లడమే నయమని భావిస్తున్నారు. బుధవారం వరకు రూ. వేయి వసూలుచేసిన ప్రైవేటు వాహనాలు గురువారం ఏకంగా రూ.15 వందల వరకు పెంచేశారు. ఇంత పెద్దమొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సీటు కావాలని వారిని ప్రాధేయపడాల్సి వస్తోంది. దీన్ని బట్టి ప్రైవేటు వాహనాల డిమాండ్ ఎంతమేర పెరగిందో ఇట్టే స్పష్టమవుతోంది. సందెట్లో సడేమీయా అన్నట్లుగా రద్దీని అదనుగా చేసుకుని పాత, తుక్కు బస్సులను కూడా రోడ్డుపైకి తెస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్లకు స్టీరింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాగా, ప్రతియేటా వినాయక చవితి సందర్భంలో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని, ట్రాఫిక్, ఆర్టీవో, రాష్ట్ర పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ వాహన యజమానులు తమను నిలువుదోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నింగికెగిసిన సామగ్రి ధరలు పెరిగిన నిత్యావసర సరుకుల ధరల ప్రభావం వినాయకుని విగ్రహాలు, పూజా సాహిత్యంపై విపరీతంగా చూపాయి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో స్వీట్లు, పండ్లు, పూలు, అగరవత్తులు ఇలా పూజా, హోమం సాహిత్యం ధరలు విపరీతంగా పెంచేశారు. మొన్నటి వరకు కేజీ రూ.40 పలికిన బంతిపూలు ఇప్పుడు రూ.150-200 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా మల్లెపూలు, చామంతి, అరటి కొమ్మలు, అరటి ఆకులు, మామిడి ఆకులు, కొబ్బరి బొండం, మొక్కజొన్న, పూల దండలు, ఐదు రకాల పండ్లు, ఫలాలు ఇలా వినాయకుడికి సమర్పించే సామాగ్రి ధరలు మూడు, నాలుగు రెట్లు పెంచేశారు. అయినప్పటికీ దాదర్ పూల మార్కెట్ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతోంది. స్వీట్ల ధరలు కూడా మిగిలిన వాటితో పోటీపడుతున్నాయి. -
సర్వం సిద్ధం
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలకు నగర పోలీసు శాఖ సన్నద్ధమైంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులు, స్థానిక ప్రజలు, మండలి కార్యకర్తలు, స్వయం సేవా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా కోరారు. ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులకు వారాంతపు సెలవులు, దీర్ఘకాలిక సెలవులు రద్దుచేశారు. దీంతో నగర పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం 45 వేల మంది పోలీసు సిబ్బంది విధులకు అందుబాటులో ఉన్నట్లే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ఐదు రకాల పోలీసు బలగాలను మోహరించినట్లు మారియా చెప్పారు. ఇందులో నేర నిరోధక శాఖ, ఉగ్రవాద నిరోధక శాఖ, రద్దీ నియంత్రణ, అత్యవసర దళం, ధార్మక స్థలాల భద్రత దళాలు ఉన్నాయని ఆయన అన్నారు. రద్దీ సమయంలో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చే సే ఆకతాయిల ఆటకట్టించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు. ఇప్పటికే ముంబై వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంది. ముష్కరులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వివిధ రహదారులన్నింటిపై పోలీసులు నిఘావేశారు. సముద్రతీరాల వెంబడి గస్తీ నిర్వహించే కోస్టు గార్డులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వాహనాల తనఖీలు, నాకా బందీలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో సెప్టెంబర్ రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి పోలీసు శాఖ అనుమతినిచ్చింది. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలు తప్పిపోతే వారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు జూహూ, గిర్గావ్ (చర్నిరోడ్ చౌపాటి), బాంద్రా, పవాయి, శివాజీపార్క్ తదితర నిమజ్జన ఘాట్లవద్ద ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తమ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల పార్కింగ్‌కు అనుమతినివ్వకూడదని వ్యాపారవర్గాలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జి.కె.ఉపాధ్యాయ్ సూచించారు. బీఎంసీ ఏర్పాట్లు... విగ్రహాలు నిమజ్జన ం చేసే సముద్రతీరాల (ఘాట్ల) వద్ద మహానగర పాలక సంస్థ (బీఎంసీ) తగిన ఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు 10 వేల మంది బీఎంసీ సిబ్బందిని నియమించింది. వాచ్ టవర్లు, ఫ్లడ్ లైట్లు, 400 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. ప్రతి నిమజ్జన ఘాట్‌వద్ద 8-10 సీసీటీవీ కెమెరాల చొప్పున మొత్తం నిమజ్జన ఘాట్లవద్ద 258 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర తీరాలకు వచ్చిన భక్తులకు సంచార టాయిలెట్లు, తాత్కాలిక తాగునీరు కుళాయిలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బీఎంసీ పరిపాలనా విభాగం రూ.13-15 కోట్లు ఖర్చుచేస్తోంది. -
గణేష్ మహోత్సవం ఎఫెక్ట్
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముంబై-గోవా జాతీయ రహదారిపై భారీ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజలు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుని తిరిగి ముంబైకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణ శాఖ తెలిపింది. గణేష్ ఉత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై భారీ ట్రక్కులు, ట్రెయిలర్లు, కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు తదితర భారీ వాహనాలను నిషేధించనున్నారు. మళ్లీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీన్ని బట్టి ఈ రహదారిపై ప్రయాణికుల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే పాలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు తరలించే భారీ వాహనాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. ముంబై-గోవా రహదారిపై సాధారణ రోజుల్లోనే విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది. గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే రెగ్యూలర్ సర్వీస్‌లతో పాటు ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల బుకింగులు ఫుల్ అయ్యాయి. ఇక జీపు, కార్లు, టాటా సుమోలు, క్వాలిస్, బస్సు లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం మిగిలిపోయింది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముంబై-గోవా రహదారిపై ప్రయాణికులను చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఏటా ఉత్సవాలకు ముందు, ముగిసిన తరువాత కొన్ని నిర్ధేశించిన రోజుల్లో భారీ వాహనాలకు నిషేధం విధిస్తారు. గతంలో ఉత్సవాల సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. రోడ్డు ప్రమాదాలవల్ల రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో మిగతా వారు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గత పదేళ్ల నుంచి ఉత్సవాల సమయంలో ఆర్టీఓ అధికారులు ఈ రహదారిపై భారీ వాహనాలను నిషేధిస్తూ వస్తున్నారు. -
ఆకాశమే హద్దుగా..
సాక్షి, ముంబై: విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలతో గృహిణులు బేజారవుతున్నారు. గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలు మూడు రెట్లకుపైనే పెరిగిపోయాయి. ఇప్పటికే పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. దీనికి తోడు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి వచ్చింది. ఆదివారం నుంచి శ్రావ ణమాసం ప్రారంభవుతోంది. దీంతో కూరగాయల ధరలు మరింత మండిపోనున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు ముగిసేవరకు మద్యం, మాంసాన్ని ముట్టుకోరు. దీంతో కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. ఒకపక్క పెరిగిన డిమాండ్, మరోపక్క సరుకు కొరత కారణంగా వాటి ధరలు చుక్కలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఉల్లి ధరలు బెంబేలెత్తించాయి. ఉల్లి పంటలకు ప్రధాన కేంద్రంగా ఉన్న నాసిక్ జిల్లాలోని లాసల్గావ్లో బడా వ్యాపారులు వేలం పాటను వారం రోజులపాటు నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి సరుకు మార్కెట్లకు రాలేదు. ఫలితంగా ధరలు పెరిగాయి. ఇటీవల ఉల్లి ధరలు కొంత దిగిరావడంతో ముంబైకర్లకు ఊరట లభించింది. కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఇప్పుడు కూరగాయాలు మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టమాటాలు, పచ్చి మిర్చి ధరలు విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు కేజీకీ రూ.30 ధర పలికిన టమాటాలు ఇప్పుడు రూ. 120 పైనే పలుకుతోంది. దీన్ని బట్టి ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉండగా శ్రావణమాసం ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో మద్యం సేవించి వారికి, మాంసం, చేపలు తినేవారికి శనివారం ఆఖరు రోజు. దీంతో శుక్ర, శనివారాలు మాంసం, చికెన్ విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో మాంసం, చికెన్ ధరలు కూడా పెంచేశారు. మొన్నటివరకు నాటు కోడి కేజీ ధర రూ.190 ఉండగా ప్రస్తుతం రూ.220 ధరకు విక్రయిస్తున్నారు. బాయిలర్, ఇంగ్లిష్ లాంటి ఫారం కోళ్ల ధరలు కూడా ఒక్కసారిగా పెంచేశారు. గత ఏడాది ఇదే సమయంలో మేక మాంసం కేజీకి రూ.350 చొప్పున విక్రయించగా ప్రస్తుతం రూ.400-420 వరకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మేలో కురిసిన అకాల వర్షాలవల్ల చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. దీంతో అప్పుడు కూడా కూరగాయల ధరలు చుక్కలను తాకాయి. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నప్పటికీ అందకుండా పోతున్నాయి. ఈ పరిస్థితులు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. -
రానున్న మూడు నెలలు కీలకం...
ఒకపక్క పండుగలు,మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రత అప్రమత్తమైన జంట పోలీసు కమిషనర్లు సాక్షి, సిటీబ్యూరో: రానున్న మూడు నెలలు పోలీసులకు సవాల్‌గా మారనున్నాయి. ఒకపక్క వరుసగా వస్తున్న ఇరువర్గాల పండుగలు.., మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రతా చర్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ రానున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాజేంద్రనగర్, మౌలాలి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న వీరు మరింత జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే వీరు అదనపు పోలీసు కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, డీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో వేర్వేరుగా సమీ క్ష సమావేశాలు నిర్వహించారు. నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పోలీసులపై మరింత పని భారం పెరిగింది. దీంతో పాటు మూడు నెలల్లో రంజాన్, బోనాలు, బక్రీద్, వినాయక ఉత్సవాలు రానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. రెండు కమిషనరేట్లలో సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. వారితోనే ప్రణాళికాబద్ధంగా బందోబస్తు నిర్వహిస్తే మంచి ఫలి తాలు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల మౌలాలిలో జరిగిన మత ఘర్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మ ల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డిని కమిషనర్ ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘ టనలు పునరావృత్తం కాకుండా ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మతఘర్షణలు జ రిగితే మొదటి వేటుపడేది సంబంధిత స్టేషన్ ఇన్స్పెకర్పైనే అని ‘మల్కాజిగిరి’ ఘటన ద్వారా అందరికీ తె లిసింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇన్స్పెక్టర్లు ఉదయం 8 గంటలకే ఠాణాకు వచ్చి కూర్చుంటున్నారు. బస్తీలు, కాలనీలలో జరిగే ప్రతి అం శాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. మైత్రీ కమిటీలపై చూపు.... ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా సులభంగా పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు మైత్రీ, శాంతి కమిటీలపై దృష్టి పెట్టారు. ప్రతీ ఠాణాలో ఉన్న ఈ కమిటీలున్నా.. కొన్ని చోట్ల పని చేయడంలేదు. కమిటీలను పునరుద్ధరించి రాబోయే రోజుల్లో ఏదైనా సమస్యలు వస్తే వాటి సహకారంతోనే పరిష్కరించాలని పోలీసు కమిషనర్లు భావిస్తున్నారు. మైత్రీ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పరిధిలో బుధవారం నుంచి మైత్రీ,శాంతి కమిటీలతో పోలీసులు సమావేశాలు ప్రారంభించారు. వారం రోజుల్లో సమావేశాలు పూర్తి చేసి భద్రతపై దృష్టి పెట్టనున్నారు. ఇక నగరంలో మాత్రం మైత్రీ సంఘాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడ కూడా మొదలు కానున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, దానికి ఆనుకున్న ప్రాంతాలపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరించారు. సైబరాబాద్లోనైతే మూడు నెలల పాటు ఏకంగా 144 సెక్షన్‌ను విధించారు. సెలవులు కరవే... వరుస పండుగల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి రానున్న మూడు నెలల్లో ఎలాంటి సెలవులు లభించే అవకాశంలే దు. సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే... ఇక ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఠాణాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురంటున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల కోసం కేంద్రం నుంచి అదనపు బలగాలు ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న బలగాలతోనే బందోబస్తును నెట్టుకొస్తుండటంతో సివిల్ పోలీసులపై అధిక పనిభారం పడింది. -
‘మహా’ నిఘా
ముంబై: ఉగ్రవాద దాడులకు అస్కారముందన్న హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసు శాఖ అప్రమత్తమైంది. వచ్చే నెలలో జరగనున్న గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ప్రాంతంపై డేగ కళ్లతో నిఘా వేయనుంది. ‘వచ్చే నెల తొమ్మిది నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. పది రోజుల పాటు కొనసాగుతాయి. మేం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటుచేస్తున్నాం. అయితే దీనికి ప్రజల సహకారం కూడా అవసరమ’ని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ అన్నారు. గణేశ్ఉత్సవ నిర్వాహకులు పాటించాల్సిన నియమావళిని ఆదివారం విడుదల చేశారు. భద్రత చర్యల వివరాలు, ట్రాఫిక్ ఏర్పాట్లు, వివిధ ఏజెన్సీలు, సీనియర్ పోలీసులు, విపత్తుల నియంత్రణ విభాగ అధికారులు ఫోన్ నంబర్లతో పాటు వివిధ ఆదేశాలతో కూడిన మాన్యువల్‌ను ఆరువేల గణేశ్ మండళ్లకు పంపిణీ చేయనున్నామన్నారు. రోజు సుమారు 1 నుంచి 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకునే ‘లాలాబాగ్చా రాజా’కు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని ఆయన తెలిపారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రత్యేక హెచ్చరికలు ఏమీ అందలేదని, అయితే పండుగ సమయంలో దానికి అస్కారముండటంతో చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పండుగ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి ఇప్పటికే అనేక గణేశ్ మండళ్లకు శిక్షణ ఇచ్చామని అదనపు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) నవల్ బజాజ్ తెలిపారు. సెప్టెంబర్ 18న గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం 50 రోడ్లు మూయనున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) వివేక్ పాన్సల్కర్ తెలిపారు. 56 రోడ్లలో వన్‌వేకు వీలుంటుందని, 13 రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. 94 రోడ్లను నో పార్కింగ్ జోన్లుగా ప్రకటించామన్నారు. ఐదు పోలీసు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. నగరవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ నుంచి 900 మంది వాలంటీర్లు, ఎన్సీసీ నుంచి 400 మంది వాలంటీర్లు సేవలందిస్తారని చెప్పారు. మందిరాలకు బాంబు బెదిరింపు సాక్షి, ముంబై: అంబర్నాథ్, ఉల్లాస్‌నగర్‌లోని మూడు పురాతన మందిరాలను పేల్చివేస్తముంటూ బెదిరింపు లేఖ రావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఆలయాల ఆవరణల్లో పోలీసు బలగాలను మోహరించింది. ఈ బెదిరింపు లేఖ ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అంబర్‌నాథ్‌లో ప్రాచీన శివమందిరం సహా బిర్లా మందిరాన్ని, ఉల్లాస్‌నగర్‌లో ఉన్న జూలేలాల్ మందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. ఇది చేతితో రాయబడిందని, దీంతో రాతను బట్టి నిందితులెవరో త్వరలో గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు శిక్షణ పింప్రి, న్యూస్‌లైన్: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పుణే యూనివర్శిటీకి చెందిన రాష్ట్రీయ సేవా యోజన (ఎన్ఎస్ఎస్) విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని ‘పోలీస్ మిత్రులు’గా నామకరణం చేసి సేవలను ఉపయోగించుకొనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు సహాయం అందించేందుకు 10వేల మంది పోలీసు మిత్రులు ముందుకు వస్తున్నారని, వీరికి పోలీసులు శిక్షణ ఇస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ గులాబ్రావ్ పోల్ చెప్పారని రాష్ట్రీయ సేవా యోజన సమన్వయకులు డాక్టర్ శాకేరా ఇనాందార్ తెలిపారు. గతంలో గణేశ్ ఉత్సవాల సమయంలో ఐదువేల మంది పోలీసు మిత్రులు పోలీసులకు సహాయంగా తమ సేవలను అందజేశారు. అయితే ఈ నెల 30న ఉపముఖ్య మంత్రి అజిత్ పవార్ గణేష్ కళాక్రీడా సంకుల్లో జరిగే ఓ కార్యక్రమంలో పోలీసు మిత్రులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు ఇనాందార్ తెలిపారు. ఈసారి కూడా డ్రెస్ కోడ్ సాక్షి, ముంబై: భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన ‘అంధేరి చా రాజా’ దర్శనానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని మండలి పదాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వినాయకున్ని భక్తి శ్రద్దలతో ఎంతో పవిత్రంగా దర్శించుకోవాలనే ఉద్ధేశంతో దీన్ని అమలు చేస్తున్నారు. మినీ స్కర్ట్లు, వంకర్లు తిరిగిన డెస్సులు వేసుకుని దర్శనానికి రావడంవల్ల ఇతరుల ఏకాగ్రత దెబ్బతింటుంది. దీంతో భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వినాయకుడి దర్శనానికి రావాలని అంధేరి చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి పదాధికారులు విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం కూడా ఇలాగే డ్రెస్ కోడ్ అమలుచేశారు. -
నేరగాళ్ల పంజా
సాక్షి, సిటీబ్యూరో:శుక్రవారం.. ఐడీఏ బొల్లారం ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్లో ఉప్పల్ టెలిఫోన్ కాలనీకి చెందిన కాంట్రాక్టర్ హన్మంతు దారుణహత్య శనివారం.. ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డులోని నాలాలో హత్యకు గురైన స్థితిలో మహిళ మృతదేహం.. లక్డీకాపూల్ హోటల్లో విజయనగరం జిల్లాకు చెందిన రియల్టర్ వై.శివప్రసాద్ దారుణహత్య.. కుత్బుల్లాపూర్ శ్రీసాయి కాలనీలో పట్టపగలు తాయమ్మపై హత్యాయత్నం, దోపిడీ.. ఆదివారం.. సీతారామ్‌బాగ్‌లో పట్టపగలు ఇంట ర్మీడియట్ విద్యార్థి శివకుమార్ దారుణహత్య, దోపిడీ. సోమవారం.. కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్ నిర్వహించే చందుపై దుండగుల కాల్పులు.. దోపిడీ యత్నం.. జంట కమిషనరేట్ల పరిధిలో గడిచిన మూడు రోజుల్లో చోటుచేసుకున్న దారుణోదంతాలివి. నేరగాళ్లు బరితెగించి పట్టపగలు గొంతులు తెగ్గోస్తున్నా.. నిండు ప్రాణాల్ని బలిగొంటున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారు. నిఘా దగాపడుతోంది. నేరగాళ్లపై కదలికలు కరువయ్యాయి. పోలీసుల పనితీరుకు ‘మచ్చ’ తునకలుగా నిలుస్తున్న ఈ వరుస ఉదంతాలను పరిశీలిస్తే.. నేరగాళ్లే పోలీసులపై కదలికలపై కన్నేసి, వారు ఆదమరుపుగా ఉండటాన్ని గమనించి పంజా విసురుతున్నారని స్పష్టమవుతోంది. పోలీస్ కదలికల్ని కనిపెట్టి మరీ నేరాలు.. బోనాలు, రంజాన్, స్వాతంత్య్ర దినోత్సవం.. వరుస వేడుకల నేపథ్యంలో పోలీసులు కొద్ది రోజులు అప్రమత్తంగా ఉన్నారు. రాజధాని వ్యాప్తంగా నిఘా ముమ్మ రం చేసి, గస్తీలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో అన్ని రోజులు నేరగాళ్లు మిన్నకుండిపోయారు. కీలక ఘట్టాలు పూర్తయి పోలీసులు కాస్త ఏమరుపాటు ప్రదర్శించారో లేదో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రసు ్తతం నగరంలో ఎక్కడా నిఘా, తనిఖీల్లేవు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాగూ కొద్ది రోజుల్లో డబుల్ డ్యూటీలు తప్పవనే భావనతో ఇప్పటి నుంచే పోలీ సులు ‘రిలాక్స్’ అవుతున్నారు. ఇదే అదనుగా దొం గలు విజృంభిస్తున్నారు. అంటే పోలీసుల కదలికల్ని నేరగాళ్లు పక్కాగా గమనిస్తున్నారని భావించాలి. ఎన్ని అనుభవాలైనా ఏం లాభం? గతానుభవాల నుంచి పోలీసులు పాఠాలు నేర్వట్లేదు. మొన్నటికి మొన్న సైబరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో పట్టపగలు దొంగలు పంజా విసిరారు. ఓ వృద్ధురాలి గొంతు కోసి దోపిడీకి పాల్పడ్డారు. అంతలోనే హైదరాబాద్ పరిధిలోని సీతారాంబాగ్‌లో పంజా విసిరారు. ఇది జరిగిన 12 గంటల్లోనే కూకట్‌పల్లిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ మూడు ఉదంతాలు నిఘా, గస్తీ విధానాల్లోని డొల్లతనానికి నిదర్శనం. సమర్థ అధికారులేరీ? దోపిడీ, దొంగతనాల ఆపరేషన్లలో అనుభవం, పాత నేరగాళ్ల కదలికలపై పట్టున్న అధికారుల సంఖ్య జంట కమిషరేట్లలో వేళ్లపైనే లెక్కించవచ్చు. వీరు కూడా ప్రస్తు తం పూర్తిగా అందుబాటులో లేరు. హైదరాబాద్ కమిషరేట్‌లో ఉన్న వారు ప్రస్తు తం బందోబస్తులతో బిజీ అయిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అధికారుల్లో కొందరు లూప్లైన్లోకి వెళ్లిపోగా... ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఇంకొందరు బదిలీలపై వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. క్రైమ్ విభాగంలోకి రావడమంటే సమర్థులైన అధికారులంతా శిక్షగా భావిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులే ఇందుకు కారణం. వెరసి ఇవన్నీ నేరాలకు ఊతమిస్తున్నాయి. నైబర్‌హుడ్ వాచ్ ఉత్తమం... అడ్డూఅదుపూ లేకుండా జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే పౌరులూ స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడకుండా ఎవరికి వారు బాధ్యతగా మెలగాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతోందో కన్నేసి ఉంచి అవసరమైన సందర్భాల్లో స్పందించి పోలీసులకు సమాచారమివ్వడమనే సూత్రంతో కూడిన నైబర్‌హుడ్ వాచ్ (ఇది విదేశాల్లో అమల్లో ఉంది) విధానాన్ని మెరుగుపర్చడానికి పోలీసు విభాగం కృషి చేయాలని సూచిస్తున్నారు. డైనమిక్ విధానాలే శరణ్యం.. నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీలు జరుగుతుంటాయి. ఒకరోజు, ఒక సమయానికి, ఒక ప్రాంతంలో తనిఖీలు చేసిన పోలీసులు... తరువాతి రోజూ అవే వేళల్లో తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ పాయింట్స్ స్థిరంగా ఉంటున్నాయి. పెట్రోలింగ్ వాహనాల గస్తీదీ ఇదే తీరు. ఇవన్నీ యాంత్రికంగా సాగిపోతున్నాయి. దీనివల్ల పోలీసులు ఏ సమయంలో ఎక్కడకు వస్తున్నారనేది సాధారణ ప్రజలే కనిపెట్టేస్తున్నారు. ఇక, నేరగాళ్లకు ఇదో పెద్ద లెక్క కాదు. డైనమిక్ విధానాల అమలే ఈ పద్ధతిలో మార్పు తేగలదు. ఈ విధానంలో పోలీసుల చర్యలేవీ అంతుబట్టవు. నిర్దేశించిన మేరకు జరగవు. ప్రతి ఠాణా పరిధిలోనూ అకస్మాత్తుగా, ఆకస్మికంగా తనిఖీలు జరుగుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా పోలీసులు ప్రత్యక్షమవుతారు. దీనివల్ల పూర్తిగా విజిబుల్ పోలీసింగ్ అమల్లో ఉంటుంది. ఫలితంగా నేరగాళ్లు చెలరేగడానికి జంకుతారు.