గణేశ్ ఉత్సవాలకు భారీ భద్రత
నగరానికి చేరుకున్న అదనపు బలగాలు
సాక్షి, సిటీబ్యూరో : ముంబై తర్వాత అత్యంత వైభవంగా నగరంలో నిర్వహించే గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నగర, సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి వినాయక చవితి, బక్రీద్ ఒకే సమయంలో రావడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక ఫోర్స్‌ను రప్పిస్తున్నారు.
తొలి దశ కింద ఆరు వేల మందిని రప్పించిన అధికారులు.. నిమజ్జనం రోజు అదనంగా మరిన్ని బలగాలను రప్పించాలని నిర్ణయించారు. మైత్రీ సంఘాలు, ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్లలో పీస్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలతో పాటు బక్రీద్ పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
ఇద్దరేసి సిబ్బంది...
జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న 1200కు పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో అపశ్రుతులు దొర్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వినాయక మండపం స్థాయిని బట్టి ఇద్దరేసి సిబ్బందిని బందోబస్తుగా కేటాయిస్తున్నారు. నగరంలో డీజేలపై నిషేధం ఉండటంతో మండపాల వద్ద సాధారణ మైకులను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులు చెప్తున్నారు.
సైబరాబాద్‌లో...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు పది వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.స్థానికంగా ఏడు వేల మంది సిబ్బంది ఉన్నా, బయటి నుంచి మూడు వేల మంది పోలీసులను రప్పిస్తున్నారు.
మండపాలకు వేలల్లో దరఖాస్తులు...
జంట పోలీసు కమిషనరేట్లలలో వినాయక మండపాల ఏర్పాటుకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేల విగ్రహాలు, సైబరాబాద్ పరిధిలో 15 వేల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశముంది. అధికారికంగా దాదాపు 14 వేల మండపాలకు అనుమతివ్వగా, గల్లీలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్రతిష్టించే వి 11 వేల విగ్రహాల వరకు ఉంటాయని నగర పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనూ విగ్రహాల ఏర్పాటుకు పది వేల దరఖాస్తులు వచ్చాయి. అనధికారికంగా మరో ఐదు వేల విగ్రహాల వరకు ఏర్పాటు చేయవచ్చని పోలీసులంటున్నారు.