మృత్యువాత పడుతున్న బొగ్గుబిడ్డలు
మృత్యువాత పడుతున్న బొగ్గుబిడ్డలు
Published Wed, Sep 28 2016 11:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కార్మికుల ప్రాణాలకేదీ భరోసా..?
మృత్యువాత పడుతున్న బొగ్గుబిడ్డలు
ఆరు నెలల్లో ఆరుగురి ప్రాణాలు హరి
గనుల్లో రక్షణ గాలిలో దీపమే..!
ప్రమాదాల పరంపరపై ఆందోళన
నాడు శాంతి ఖని.. నేడు ఆర్కే 7గని
శ్రీరాంపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా బొగ్గు గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. వ్యాపార పరంగా సింగరేణి సంస్థ క్షేమంగా ఉన్నా.. నిత్యం ఏదో ఒక ప్రమాదం కార్మికులను వెంటాడుతూనే ఉంది. ఒక్కోసారి విధులకు హాజరైన కార్మికులు ప్రాణాలతో క్షేమంగా గని బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. కంపెనీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతూ.. వందలాది కార్మికులు క్షతగాత్రులు అవుతున్నారు. వరుస ప్రమాదాల పరంపర గనుల్లో అధికారులు చేపడుతున్న రక్షణ చర్యల్లో డొల్లతనాన్ని తెలియజేస్తోంది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇక్కడ కొద్ది నెలలుగా ఎక్కువ ప్రమాదాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రీజియన్ పరిధిలో గత ఆరు నెలల్లో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. గురువారం శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే 7గనిలో పై కప్పు కూలి టింబర్‌మెన్ కార్మికుడు యాట మల్లయ్య చనిపోయూడు. కొత్త ఆర్థిక సంవత్సరం 2016-17 ఆరంభం నుంచే ప్రమాదాల పరంపర మొదలైంది. బెల్లంపల్లి డివిజన్‌లో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న శాంతిఖని గనిలో ఏప్రిల్ 13న నార్త్‌డీప్, 52 లెవల్ జంక్షన్ పెద్దయెత్తున ఫాల్ అయ్యింది.
కంపెనీలో పై కప్పు కూలిన అతి పెద్ద ప్రమాదాల్లో ఇదొకటి. ఒకేసారి ముగ్గురు కార్మికులు పొల్చాని హన్మంతరావు, రామవత్ కిష్టయ్య(సపోర్టుమెన్), గాలిపెల్లి పోశం(మేషన్ కార్మికుడు) చనిపోయూరు. బొగ్గు శిథిలాల కింది నుంచి మూడు రోజుల తర్వాత మృతదేహాలు బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం సింగరేణిలో తీవ్ర విషాదం నింపింది. ఇది మరువక ముందేశ్రీరాంపూర్ డివిజన్‌లో ఒక్కొక్కరుగా ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఆర్కే న్యూటెక్ గనిలో జూన్ 8న జరిగిన ప్రమాదంలో టింబర్‌మెన్ ఎడ్ల మల్లయ్య ఎస్‌డీఎల్ యంత్రం నడుమ చిక్కుకొని చనిపోయూడు. తుంటలను యంత్రం బకెట్లో తరలిస్తుండగా ఒక్కసారిగా ఎస్‌డీఎల్ యంత్రం అదుపు తప్పి జారుకుంటూ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 3న ఆర్కే 5గనిలో సపోర్టుమెన్ బద్రి జనార్ధన్ పై కప్పు కూలిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మరువకముందే ఆర్కే 7గనిలో గురువారం రెండో షిఫ్ట్‌లో మరో పైకప్పు ప్రమాదం జరిగింది. యాట మల్లయ్య చనిపోగా.. మరో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయూలయ్యూరుు. పైకప్పు, సైడ్‌ఫాల్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది.
పర్యవేక్షణ లేకనే ప్రమాదాలు..
పైకప్పు కూలడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగారుు. శాంతిఖని ప్రమాదంలో అధికారులు జంక్షన్‌లో పై నుంచి వస్తున్న ఒత్తిడిని మానిటరింగ్ చేసి ప్రమాదాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యూరనే ఆరోపణలున్నారుు. ఆర్కే 5గనిలో పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తక్కువ సంఖ్యలో ఉన్న సర్ధార్లు, ఓవర్లమెన్లపై అధిక పనిభారం మోపుతూ తక్కువ మందిని ఎక్కువ పనిస్థలాలు అప్పగిస్తూ పనులు చేయించడంతో పర్యవేక్షణ కొరవడి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదాలన్నింటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. చాలా మంది మేనేజర్లు గనుల్లో సక్రమంగా దిగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గనుల్లో రక్షణ చర్యలను పర్యవేక్షించడంలో మైనింగ్ స్టాఫ్‌కు కీలక పాత్ర ఉంటుంది. కంపెనీ వ్యాప్తంగా వీరి కొరత తీవ్రంగా ఉంది. సుమారు 600 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఉత్పత్తి కోసమేనా టెక్నాలజీ.. స్టడీ టూర్స్‌తో ఒరిగిందేమిటి..?
బొగ్గు ఉత్పత్తి.. ప్రకృతికి విరుద్ధంగా జరిగే చర్య.ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి రక్షణ సదుపాయూల మధ్య కార్మికుడితో పని చేయించాల్సిన అధికారులు వాటిని విస్మరిస్తున్నారు. మైన్స్ యాక్ట్, మైన్స్ రెగ్యులేషన్‌లను విస్మరించి పనులు సాగుతున్నాయి. కంపెనీ వ్యాప్తంగా అన్ని గనుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వందేళ్ల సింగరేణి అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ఉత్పత్తి కోసం తట్టాచెమ్మస్‌ను పక్కన పెట్టి ఎస్డీఎల్ యంత్రాలు, ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, కంటిన్యూయస్ మైనర్లు, లాంగ్‌వాల్, షార్ట్‌వాల్ వంటి టెక్నాలజీతో వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అవలీలగా సాధిస్తున్నారు. కాని ‘యాక్సిడెంట్ ఫ్రీ కంపెనీ’ టార్గెట్ మాత్రం ఎప్పుడూ సాధించలేదు. పై కప్పు నుంచి ఒత్తిడి వస్తూ క్రమంగా అది పెరిగిపోయి కూలుతున్నారుు. దీన్ని గుర్తించడానికి కంపెనీ వద్ద కన్వర్జెన్సీ రీడింగ్, టెల్‌టేయిల్, గ్రాఫిక్, ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పద్ధతులతో పై నుంచి వచ్చే ఒత్తిడి రికార్డు చేస్తారు. దీని ఆధారంగానే రూఫ్ బ్యాడ్ ఉందా లేదా అని గుర్తిస్తున్నారు. చాలాకాలంగా వీటిపైనే అధికారులు ఆధారపడి పై కప్పు ప్రమాదాలను అంచనా వేస్తున్నారు. కాని ఇతర దేశాల్లో ఈ ప్రమాదాలను అంచనా వేయడంలో ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సింగరేణిలో కార్మికులు పై కప్పు కూలుతున్నప్పుడు వచ్చే శబ్దాలను పసగట్టి క్షణాల్లో తప్పించుకోవడమే తప్ప మరే దారి లేదు. పై కప్పు కూలే ప్రమాదాలను పసిగట్టే టెక్నాలజీని మాత్రం సమకూర్చుకోవడం లేదు. స్డడీ టూర్‌ల పేరుతో లీడర్లు, అధికారులు విదేశాల్లో విహార యాత్ర చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యలేంటి, అక్కడ వాడుతున్న టెక్నాలజీని ఇక్కడ ఎందుకు అమలు చేయించడం లేదో వారికే తెలియూలి.
సేఫ్టీ కమిటీలో ఫేస్ వర్కర్లకు చోటు కరువు..
గనుల్లో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు సేఫ్టీ కమిటీ ఉంటుంది. గెలిచిన సంఘం నుంచి ఎంపికైన ప్రతినిధులతో కూడిన సేఫ్టీ కమిటీ గనుల స్థాయిలో మేనేజర్లతో సమావేశమై గనుల్లో ఉన్న రక్షణ లోపాలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలు, వెంటిలేషన్ ఎలా ఉంది.. తాగునీరు సౌకర్యం ఉందా.. బ్యాడ్‌రూఫ్ ఎక్కడ ఉందనే అంశాలను వారి దృష్టికి తీసుకుపోతారు. ఇందులో చర్చించిన అంశాలు, మినిట్స్ ఆధారంగా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలి. స్ట్రాట్యూటరీ ప్రకారం జరిగే ఈ సమావేశాలు చాయ్‌బిస్కెట్లు ఆరగించి పోవడానికే పరిమితం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధుల్లో ఫేస్ వర్కరు ్ల(బొగ్గు ఉత్పత్తిలో ముందు భాగంలో ఉండి పని చేసే వారు) చోటు ఉండటం లేదు. సర్ఫేస్‌లో ఉండే చోటా మోటా లీడర్లతోనే సేఫ్టీ కమిటీలు నడుస్తున్నాయి. వీరికి గనుల్లో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా చూసే అవకాశం, సమస్యలపై అవగాహన ఉండదు. దీంతో క్షేత్ర స్థాయిలో ఉండే రక్షణ లోపాలు అధికారులు దృష్టికి రాలేకపోతున్నాయి. ఒక వేళ ఎవరైనా తెచ్చిన కూడా వాటిని అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని అపవాదు ఉంది.
నిష్పక్షపాత విచారణ ఎక్కడ..?
ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు ముందుగా బలి చేసేది మైనింగ్ స్టాఫ్‌నే. కాని వారిని పనులకు పూరమాయించిన అధికారులపై చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. డీఎంఎస్, డీడీఎంస్‌లు విచారణకు వచ్చిన వారిని ప్రసన్నం చేసుకుని తమపైకి రాకుండా చేతులు దులుపుకొంటారనేది కంపెనీలో ప్రచారం ఉంది. కార్మికులను బెదిరించి వారికి అనుకూలంగా విచారణలో చెప్పించుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
కార్మిక సంఘాల వైఫల్యం..
కార్మికులకు అండగా ఉండాల్సిన కార్మిక సంఘాలన్ని విఫలమవుతున్నారుు. ప్రమాదం జరిగిన సమయంలో ఆందోళన చేయడం, నష్టపరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేయడం మాత్రమే చేస్తున్నారు. కాని దీర్ఘకాలంగా ఆ కార్మికుడి కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలి.. ప్రమాదానికి కారణం ఎవరు.. వారిపై తీసుకోవాల్సిన చర్యలకు మాత్రం ఎలాంటి కార్యాచరణ చేయడం లేదు. ప్రమాదానికి అధికారులు, యాజమాన్యానిదే బాధ్యత అంటూ ప్రకటనలు చేయడానికే సరిపోతున్నారు. మైన్స్ సేఫ్టీ అధికారులకు రాత పూర్వక ఫిర్యాదు చేయడం, కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ కోరడం వంటివి చేయడం లేదు. దీంతో సగటుకార్మికుడి ప్రాణాలకు విలువలేకుండా పోయింది.
Advertisement