హైటెక్‌ కాపీయింగ్‌.. 11 మంది అరెస్ట్‌ | People Arrested In Hitech Copying In Singareni Management Trainee Exam | Sakshi
Sakshi News home page

హైటెక్‌ కాపీయింగ్‌.. 11 మంది అరెస్ట్‌

Published Sun, Mar 8 2020 12:51 PM | Last Updated on Sun, Mar 8 2020 12:55 PM

People Arrested In Hitech Copying In Singareni Management Trainee Exam - Sakshi

సాక్షి, కొత్తగూడెం :  హైటెక్‌ కాపీయింగ్‌లో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో ఆరుగురు సూత్రదారులు, ఐదుగురు నకిలీ అభ్యర్థులు ఉన్నారు. వారి నుంచి రూ. 11 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్‌లు, 11 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్, (ట్రైనీ) ఐపీఎస్‌ రోహిత్‌ రాజ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి సంస్థ ఈ నెల 1న మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌) గ్రేడ్‌–2 ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహంచింది.

కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, కోలా హరీష్, మరికొందరు వ్యక్తులు కలిసి రాత పరీక్షను నకిలీ అభ్యర్థులతో రాయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నారు. పరీక్షకు హాజరయ్యే వ్యక్తులను ఎంపిక చేయటం దగ్గర నుంచి వారిని ఒప్పించటం వరకు వీరే బాధ్యత తీసుకున్నారు. నకిలీ అభ్యర్థుల చేత పరీక్ష రాయించే బాధ్యతను పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు తీసుకున్నారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన సందీప్, వికాస్‌ మోర్, కుమార్‌ విశాల్, శైలేష్‌కుమార్‌ యాదవ్‌లు వారికి సంబంధించిన 12 మంది నకిలీ అభ్యర్థులను కొత్తగూడెం తీసుకొచ్చి పరీక్ష రాయించారు. వీరిలో హరియాణాకు చెందినవారు ఏడుగురు, బిహార్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు.

వెలుగు చూసిందిలా.. 
పాల్వంచలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి ఆరా తీయడం, ఆ తర్వాత సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. 

వాట్సాప్‌ ద్వారా.. 
పరీక్ష కేంద్రాల్లో నకిలీ అభ్యర్థుల్లో కొందరు సెల్‌ఫోన్లు, మైక్రో చిప్‌ బ్లూటూత్, డివైస్‌లను, మైక్రోఫోన్లు వాడారు. వాటి సాయంతో ప్రశ్నపత్రాల్లోని స్కాన్‌ చేసి వాట్సాప్‌ ద్వారా సందీప్‌ మోర్, వికాస్‌ మోర్‌లకు పంపించారు. తిరిగి వారు మైక్రోఫోన్‌ ద్వారా జవాబులను నకిలీ అభ్యర్థులకు చేరవేశారు. నిందితుల వద్ద పట్టుబడిన అభ్యర్థుల సర్టిఫికెట్ల ఆధారంగా ఇంకా ఎంతమంది నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి, ఇతర అనుమానితుల ప్రమేయంపైనా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హైటెక్‌ కాపీయింగ్‌ పాల్పడిన మరికొందరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అలీ, చుంచుపల్లి సీఐ అశోక్, వన్‌టౌన్‌ సీఐ రాజు, పాల్వంచ సీఐ నవీన్, పాల్వంచ ఎస్సై ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై ప్రవీణ్, ఐటీ సెల్‌ సిబ్బంది వెంకట్, గోపిలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement