కవల సోదరులను బలి తీసుకున్న రోడ్డుప్రమాదం
బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఘటన
దానవాయిగూడెంలో విషాదం
ఖమ్మంరూరల్: తల్లి గర్భం నుంచి సెకన్ల తేడాతో లోకంలోకి వచ్చిన వారిద్దరూ కలిసే పెరిగారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి కూలీనాలి చేస్తూ తమను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని భావించాలనే తపనతో కష్టపడుతున్నారు. ఇంతలోనే వీరిని మృత్యువు ఒకేసారి బలి తీసుకుంది. 22ఏళ్లుగా కలిసి పెరుగుతున్న సోదరులను కలిపే తీసుకెళ్లిన జాలి లేని మృత్యువును శాపనార్ధాలు పెడుతున్న వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది.
నిరుపేద కుటుంబం...
ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంకు చెందిన అత్తులూరి నర్సింహారావు, రమాదేవి దంపతులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మహేష్, నవీన్(22) కవల కుమారులు ఉన్నా రు. సోదరులిద్దరు డిగ్రీ పూర్తిచేయగా గ్రూప్స్‌తో పాటు పోలీసు ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతూ కొన్నాళ్లుగా ఖమ్మంలోని ఓ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. మంగళవారం ఉదయం తల్లి రోజులాగే కూలీ పనులకు వెళ్లగా తండ్రి ఇంకో గ్రామానికి వెళ్లాడు. దీంతో సాయంత్రం సోదరులిద్దరూ బైక్‌పై స్నేహితుడైన భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన పవన్‌తో కలిసి తమ అమ్మమ్మ ఊరైన కూసుమంచి మండలం పెరికసింగారం బయలుదేరారు. అక్కడ వీరి మేనమామ మెకానిక్ షెడ్ నిర్వహిస్తుండడంతో అప్పుడప్పుడు వెళ్లి కాసేపు గడిపి వచ్చేవారు. అలాగే, మంగళవారం కూడా వెళ్లిన సోదరులు గమ్యస్థానానికి చేరలేదు.
ఆటో రూపంలో వచ్చిన మృత్యువు
కవల సోదరులు మహేష్, నవీన్‌తో పాటు వారి స్నేహితుడు పవన్ బైక్‌పై పెరికసింగారం వెళ్తుండగా మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్, నవీన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, పవన్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన మహేష్, నవీన్ మృతి చెందారని తెలియడంతో స్వగ్రామమైన దానవాయిగూడెంతో పాటు అమ్మమ్మ ఊరైన పెరికసింగారంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
కలిసి జన్మించిన కుమారులు కలిసే పెరిగి కుటుంబానికి అండగా నిలుస్తారని భావిస్తున్న తరుణంలో ఒకేసారి కన్ను మూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కల కష్టంతో కుమారులిద్దరిని చదివించామని, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతుండగా ఇలా జరిగిందని వారు రోదిస్తున్న తీరుతో అంతా కంటతడి పెట్టారు. ఈమేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా రోదిస్తూ అక్కడే గడిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment