Management trainee post
-
హైటెక్ కాపీయింగ్.. 11 మంది అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం : హైటెక్ కాపీయింగ్‌లో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు సూత్రదారులు, ఐదుగురు నకిలీ అభ్యర్థులు ఉన్నారు. వారి నుంచి రూ. 11 లక్షల నగదు, 17 సెల్ఫోన్లు, 11 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్, (ట్రైనీ) ఐపీఎస్ రోహిత్ రాజ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి సంస్థ ఈ నెల 1న మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) గ్రేడ్–2 ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహంచింది. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, కోలా హరీష్, మరికొందరు వ్యక్తులు కలిసి రాత పరీక్షను నకిలీ అభ్యర్థులతో రాయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నారు. పరీక్షకు హాజరయ్యే వ్యక్తులను ఎంపిక చేయటం దగ్గర నుంచి వారిని ఒప్పించటం వరకు వీరే బాధ్యత తీసుకున్నారు. నకిలీ అభ్యర్థుల చేత పరీక్ష రాయించే బాధ్యతను పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు తీసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సందీప్, వికాస్ మోర్, కుమార్ విశాల్, శైలేష్‌కుమార్ యాదవ్‌లు వారికి సంబంధించిన 12 మంది నకిలీ అభ్యర్థులను కొత్తగూడెం తీసుకొచ్చి పరీక్ష రాయించారు. వీరిలో హరియాణాకు చెందినవారు ఏడుగురు, బిహార్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వెలుగు చూసిందిలా.. పాల్వంచలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి ఆరా తీయడం, ఆ తర్వాత సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. వాట్సాప్ ద్వారా.. పరీక్ష కేంద్రాల్లో నకిలీ అభ్యర్థుల్లో కొందరు సెల్ఫోన్లు, మైక్రో చిప్ బ్లూటూత్, డివైస్‌లను, మైక్రోఫోన్లు వాడారు. వాటి సాయంతో ప్రశ్నపత్రాల్లోని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా సందీప్ మోర్, వికాస్ మోర్లకు పంపించారు. తిరిగి వారు మైక్రోఫోన్ ద్వారా జవాబులను నకిలీ అభ్యర్థులకు చేరవేశారు. నిందితుల వద్ద పట్టుబడిన అభ్యర్థుల సర్టిఫికెట్ల ఆధారంగా ఇంకా ఎంతమంది నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి, ఇతర అనుమానితుల ప్రమేయంపైనా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హైటెక్ కాపీయింగ్ పాల్పడిన మరికొందరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అలీ, చుంచుపల్లి సీఐ అశోక్, వన్‌టౌన్ సీఐ రాజు, పాల్వంచ సీఐ నవీన్, పాల్వంచ ఎస్సై ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై ప్రవీణ్, ఐటీ సెల్ సిబ్బంది వెంకట్, గోపిలు పాల్గొన్నారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల పరీక్షలో జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అత్యధిక మార్కులు సాధించడం ఎలా? - కె.ప్రియదర్శిని, జూబ్లీహిల్స్ ఎస్బీఐ గ్రూప్ మినహాయించి మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరులో ఉమ్మడి రాతపరీక్షను నిర్వహించనుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇప్పటివరకు ఐబీపీఎస్ నిర్వహించిన మూడు పీవోస్ పరీక్షలను పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ రంగం విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు గమనించవచ్చు. స్టాక్ జీకే నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌లో సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను చదవాలి. ప్రభుత్వ పథకాలు, వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, ముఖ్యమైన దినోత్సవాలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, క్రీడలు - క్రీడాకారులు- ఇటీవల జరిగిన క్రీడల కప్‌లు, టోర్నమెంట్లు, ఆర్థిక విషయాలు, ప్రణాళికలు, అబ్రివేషన్స్, అంతర్జాతీయ సంస్థలు - ప్రధాన కార్యాలయాలు, సదస్సులు, పుస్తకాలు - రచయితలు, దేశీయ, అంతర్జాతీయ సంఘటనలు, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, భారత అంతరిక్ష పరిశోధనలు - ఇటీవలి విజయాలు, దేశ రక్షణ వ్యవస్థ, క్షిపణులు, కమిటీలు - చైర్మన్లు మొదలైన వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ - తాజా పరపతి విధానాలు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, కొత్త బ్యాంకుల ఏర్పాటు, ఆర్బీఐ ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు - అధ్యక్షులు, ఆ కమిటీల సిఫారసులు, ప్రస్తుత పాలసీ రేట్లు, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ముఖ్యమైన బ్యాంకుల అధిపతులు, బ్యాంకింగ్ పదజాలం, డిపాజిట్లు - వాటి రకాలు, నాబార్డ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎంలు, చెక్కులు, కేవైసీ (నో యువర్ కస్టమర్) విధానాలు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లాంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. స్టాక్ జీకేకు సంబంధించి దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంట్లు, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు, పదజాలం, అభయారణ్యాలు - అవి ఉన్న రాష్ట్రాలు, రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు లాంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అందువల్ల పరీక్షలో ఈ విభాగాన్ని మొదటగా పూర్తిచేసి, ఎక్కువ సమయం తీసుకునే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటి విభాగాలను చివర్లో చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే రోజూ ఒక దినపత్రికను చదివి నోట్స్ రూపొందించుకోవడం తప్పనిసరి. దీంతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌ను చదవాలి. ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అభ్యర్థులకు బాగా ఉపకరిస్తాయి.