భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది.
సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది.
సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment