ఏడాది క్రితం చనిపోయిన తల్లిదండ్రులు
ప్రస్తుతం అన్న మృతితో ఒంటరైన 11 ఏళ్ల బాలిక
ఇల్లంతకుంట(మానకొండూర్): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై తోడునీడగా ఉన్న అన్న మృతితో 11 ఏళ్ల బాలిక ఒంటరైంది. ‘అన్నా నాకిక దిక్కెవరూ’ అని ఏడుస్తూ అన్న మృతదేహానికి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు..
ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన నాయిని రాజేశం– దేవవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వందన, సంజన, కొడుకు వంశీ (25) సంతానం. ఉపాధి కోసం రాజేశం దుబాయ్ వెళ్లేవాడు. ఉన్నంతలో పెద్ద కూతురు వందనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది క్రితం రాజేశం దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికే దేవవ్వ కేన్సర్ బారినపడి మృతిచెందింది.
ఆమె దహనసంస్కారాలు జరిగిన మూడు రోజులకే దుబాయ్ నుంచి రాజేశం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతడి అంత్యక్రియలను కొడుకు నిర్వహించాడు. అప్పటి నుంచి సంజన ఆలనపాలనను వంశీ చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి ఏడాది అవుతుండగా, మంగళవారం వంశీ సైతం కిడ్నీలు పాడయి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సంజన ఒంటరయింది. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో అన్నకు తలకొరివి పెట్టడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment