hitech copying
-
విగ్గుతో పరీక్షల్లో కాపీయింగ్! ఎలా దొరికాడంటే..
లక్నో: ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలా మంది యువత పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక మాస్ కాపీయంగ్ ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
హైటెక్ కాపీయింగ్.. 11 మంది అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం : హైటెక్ కాపీయింగ్‌లో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు సూత్రదారులు, ఐదుగురు నకిలీ అభ్యర్థులు ఉన్నారు. వారి నుంచి రూ. 11 లక్షల నగదు, 17 సెల్ఫోన్లు, 11 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్, (ట్రైనీ) ఐపీఎస్ రోహిత్ రాజ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి సంస్థ ఈ నెల 1న మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) గ్రేడ్–2 ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహంచింది. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, కోలా హరీష్, మరికొందరు వ్యక్తులు కలిసి రాత పరీక్షను నకిలీ అభ్యర్థులతో రాయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నారు. పరీక్షకు హాజరయ్యే వ్యక్తులను ఎంపిక చేయటం దగ్గర నుంచి వారిని ఒప్పించటం వరకు వీరే బాధ్యత తీసుకున్నారు. నకిలీ అభ్యర్థుల చేత పరీక్ష రాయించే బాధ్యతను పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు తీసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సందీప్, వికాస్ మోర్, కుమార్ విశాల్, శైలేష్‌కుమార్ యాదవ్‌లు వారికి సంబంధించిన 12 మంది నకిలీ అభ్యర్థులను కొత్తగూడెం తీసుకొచ్చి పరీక్ష రాయించారు. వీరిలో హరియాణాకు చెందినవారు ఏడుగురు, బిహార్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వెలుగు చూసిందిలా.. పాల్వంచలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి ఆరా తీయడం, ఆ తర్వాత సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. వాట్సాప్ ద్వారా.. పరీక్ష కేంద్రాల్లో నకిలీ అభ్యర్థుల్లో కొందరు సెల్ఫోన్లు, మైక్రో చిప్ బ్లూటూత్, డివైస్‌లను, మైక్రోఫోన్లు వాడారు. వాటి సాయంతో ప్రశ్నపత్రాల్లోని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా సందీప్ మోర్, వికాస్ మోర్లకు పంపించారు. తిరిగి వారు మైక్రోఫోన్ ద్వారా జవాబులను నకిలీ అభ్యర్థులకు చేరవేశారు. నిందితుల వద్ద పట్టుబడిన అభ్యర్థుల సర్టిఫికెట్ల ఆధారంగా ఇంకా ఎంతమంది నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి, ఇతర అనుమానితుల ప్రమేయంపైనా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హైటెక్ కాపీయింగ్ పాల్పడిన మరికొందరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అలీ, చుంచుపల్లి సీఐ అశోక్, వన్‌టౌన్ సీఐ రాజు, పాల్వంచ సీఐ నవీన్, పాల్వంచ ఎస్సై ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై ప్రవీణ్, ఐటీ సెల్ సిబ్బంది వెంకట్, గోపిలు పాల్గొన్నారు. -
‘ఖాకీ’ కొలువు కోసం ఖతర్నాక్ ఐడియా
గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వ ఉద్యోగం...అందునా పోలీస్ కొలువుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువేం కాదు. సర్కార్ కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న వారిని ఎంతోమందిని నిత్యం చూస్తునే ఉంటాం. కానీ ఇవేవి లేకుండా సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు గోరఖ్‌పూర్‌కు చెందిన ముగ్గురు యువకులు. కానీ పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ పోలీస్ పబ్లిక్ సర్విస్ కమీషన్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించింది. గోరఖ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు ఎలాగైనా ఈ పరీక్షల్లో పాస్ కావాలనే ఉద్దేశంతో హైటెక్ మాస్ కాపియింగ్‌కు పాల్పడ్డారు. పరీక్ష హాల్లోకి తమతో పాటు సూక్ష్మమైన ఎలాక్ట్రానిక్ పరికారాలను తీసుకువచ్చారు. చెవి లోపల అమర్చి వాడే ఈ పరికరాల సాయంతో సమాధానాలు తెలుసుకుంటూ పరీక్ష రాస్తున్నారు. అనుమానం వచ్చిన నిర్వాహకులు వీరిని తీసుకెళ్లి తనిఖీ చేయగా ఈ యువకులు వద్ద ఎలాక్ట్రానిక్ పరికరాలు బయటపడ్డాయి. దాంతో పోలీసులు ఈ యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
హైటెక్ కాపీయింగ్, విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్: టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటర్ విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం ఎస్సార్ నగర్‌లోని ఓ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హైటెక్ స్టయిల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. అతనికి సహకరించిన సమీయుల్లా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఎన్నారై కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన ఇతడు ఈసారి ఎలాగైనా పాస్ కావాలని పట్టుదలతో పథకం వేశాడు. ఇందుకోసం అతడు ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిని ఆశ్రయించాడు. షాప్‌క్లూస్ సైట్ నుంచి బ్లూటూత్ పరికరం, మైక్రోఫోన్ ఉన్న బనియన్‌ను రూ.13,200 వెచ్చించి కొనుగోలు చేశాడు. దానిని తొడుక్కుని సివిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను దిగ్విజయంగా రాసేశాడు. అతడికి బయటి నుంచి సమాధానాలు ఇస్తూ సమీయుల్లా అనే వ్యక్తి సాయం చేస్తున్నాడు. అదే ఉత్సాహంతో బుధవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్షల సూపరింటెండెంట్ తనిఖీల్లో భాగంగా కళాశాలలో విద్యార్థులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఓ విద్యార్థిపై అనుమానం వచ్చింది. పోలీసులను పిలిపించి సోదా జరిపించగా హైటెక్ నాటకం బట్టబయలైంది. పోలీసులు విద్యార్థితోపాటు అతనికి సాయం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించి, అరెస్టు చేశారు. -
పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్
నిన్న మొన్నటి వరకు కేవలం వైద్యవిద్యా కోర్సుల్లో మాత్రమే హైటెక్ కాపీయింగ్ జరిగేది. గురివిరెడ్డి గ్యాంగు పలు సందర్భాల్లో ఇలాంటి కాపీయింగ్ రాకెట్‌ను నడిపిస్తూ పట్టుబడింది. సరిగ్గా ఇలాంటి కోవలోనే పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్న గ్యాంగు ఒకదాన్ని 'సాక్షి' బట్టబయలు చేసింది. వరంగల్ నగరంలో ఒక ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో ఈ హైటెక్ కాపీ రాకెట్ నడిచింది. ఈ విషయమై కొందరు విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న 'సాక్షి' ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించి, రహస్య కెమెరాలతో రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. పరీక్ష హాలు వెలుపల ఒక కారులో కొంతమంది కూర్చుని ఉండటం, లోపల పరీక్ష రాసేవాళ్లు బ్లూటూత్ సాయంతో ప్రశ్నపత్రంలో ఏముందో వీళ్లకు చెప్పడం ద్వారా ఈ మొత్తం కాపీ వ్యవహారం నడిపించారు. బయట కారులో ఉన్నవాళ్లు పాఠ్యపుస్తకాలు, గైడ్లలో ఉన్న సమాధానాలను లోపల ఉన్నవాళ్లకు చెబుతున్న వైనం మొత్తం 'సాక్షి' నిఘాలో బయటపడింది. -
హైటెక్ కాపీయింగ్‌కు జీపీఎస్‌తో చెక్
లీకేజి గుర్తింపునకు వీలు అన్ని ఫోన్లపై ప్రత్యేక నిఘా ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటిసారిగా జీపీఎస్ అమలు ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకోవడంతోపాటు హైటెక్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు మొట్టమొదటిసారి ఇంటర్మీడియెట్ బోర్డు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇప్పటి వరకు ఒక్క పోలీసు విభాగానికి మాత్రమే అందుబాటులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్మీడియెట్ బోర్డు అందిపుచ్చుకోనుంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు పరీక్ష సమయానికి ముందుగా ఎక్కడ బయటకు పొక్కుతున్నాయో తెలుసుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని కళాశాలలు పరీక్ష పత్రాలను ముందుగానే లీకు చేయించి ఆ ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి పరీక్షకు పావుగంట ఆలస్యంగా పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలకు చెక్‌పెట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలున్న ప్రదేశం అక్షాంశాలు, రేఖాంశాలు ముందుగా బోర్డుకు తెలియజేశారు. అదేవిధంగా ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, అదనపు చీఫ్‌లు అందరి ఫోన్ నంబర్లు ముందుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు తెలియజేశారు. ఈ ఫోన్ నంబర్లన్నింటినీ సమీపంలోని సెల్‌టవర్లకు అనుసంధానం చేస్తారు. దీని కోసం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోని అందరి సెల్ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అతి తెలివి తేటలతో వారి ఫోన్ కాకుండా ఇతర నంబర్లతో మాట్లాడినా దొరికిపోతారు. ఆయా పరీక్ష కేంద్రాల అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి ఆ సెంటర్ నుంచి ఫోన్ కాల్ బయటకు వెళ్లినట్లు రికార్డు అవుతుంది. దాన్ని విశ్లేషిస్తే ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ కాల్ చేసింది, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎంత సమయం మాట్లాడారు తదితర విషయాలన్నీ రికార్డవుతాయి. ఆ విధంగా కాల్ వివరాలతో అక్రమార్కుల ఆటలను కట్టడి చేసేందుకు బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రంలో కేవలం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల వద్ద మాత్రమే ఫోన్లు ఉండాలి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఫోన్లన్నింటినీ చీఫ్ వద్ద ఉంచాలి. పరీక్ష కేంద్రాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించరాదని బోర్డు ఆంక్షలు పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్‌తో ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి ఎస్ఎంఎస్ల ద్వారా ఇతరులకు క్షణాల్లో చేరవేసేందుకు వీలున్నందున ఆ ఫోన్లను పరీక్ష కేంద్రాల్లో వినియోగించవద్దన్నారు. హైటెక్ కాపీయింగ్‌కు చెక్: ఈ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు బోర్డు చెక్ పెట్టింది. గతంలో విద్యార్థులను పరీక్ష ప్రారంభమైన 15 నిముషాల వరకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చి అర్ధగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో ఉండాలి. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. గతంలో విద్యార్థులను 9.15 గంటలకు పరీక్షకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చారు. విద్యార్థులు 8.45 గంటలకు పరీక్ష రాసే హాలులో ఉండాలి. 8.45 గంటల తరువాత పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్ ఇతర వివరాలు ప్రత్యేకంగా ఒక పుస్తకంలో నమోదు చేయాలి. పరీక్షకు ఆలస్యంగా రావడానికి గల కారణాలు కూడా స్పష్టంగా పేర్కొనాలి. ఒకే కళాశాల విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వస్తున్నట్లు తేలితే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా కాపీయింగ్‌ను నిరోధించేందుకు, ప్రశ్నపత్రాల లీకేజిని అరికట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చేపట్టిన చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి.