లీకేజి గుర్తింపునకు వీలు
అన్ని ఫోన్లపై ప్రత్యేక నిఘా
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటిసారిగా జీపీఎస్ అమలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకోవడంతోపాటు హైటెక్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు మొట్టమొదటిసారి ఇంటర్మీడియెట్ బోర్డు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇప్పటి వరకు ఒక్క పోలీసు విభాగానికి మాత్రమే అందుబాటులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్మీడియెట్ బోర్డు అందిపుచ్చుకోనుంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు పరీక్ష సమయానికి ముందుగా ఎక్కడ బయటకు పొక్కుతున్నాయో తెలుసుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని కళాశాలలు పరీక్ష పత్రాలను ముందుగానే లీకు చేయించి ఆ ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి పరీక్షకు పావుగంట ఆలస్యంగా పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలకు చెక్‌పెట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలున్న ప్రదేశం అక్షాంశాలు, రేఖాంశాలు ముందుగా బోర్డుకు తెలియజేశారు. అదేవిధంగా ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, అదనపు చీఫ్‌లు అందరి ఫోన్ నంబర్లు ముందుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు తెలియజేశారు. ఈ ఫోన్ నంబర్లన్నింటినీ సమీపంలోని సెల్‌టవర్లకు అనుసంధానం చేస్తారు. దీని కోసం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోని అందరి సెల్‌ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అతి తెలివి తేటలతో వారి ఫోన్ కాకుండా ఇతర నంబర్లతో మాట్లాడినా దొరికిపోతారు. ఆయా పరీక్ష కేంద్రాల అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి ఆ సెంటర్ నుంచి ఫోన్ కాల్ బయటకు వెళ్లినట్లు రికార్డు అవుతుంది. దాన్ని విశ్లేషిస్తే ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ కాల్ చేసింది, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎంత సమయం మాట్లాడారు తదితర విషయాలన్నీ రికార్డవుతాయి. ఆ విధంగా కాల్ వివరాలతో అక్రమార్కుల ఆటలను కట్టడి చేసేందుకు బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రంలో కేవలం చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారుల వద్ద మాత్రమే ఫోన్లు ఉండాలి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఫోన్లన్నింటినీ చీఫ్ వద్ద ఉంచాలి. పరీక్ష కేంద్రాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించరాదని బోర్డు ఆంక్షలు పెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్‌తో ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఇతరులకు క్షణాల్లో చేరవేసేందుకు వీలున్నందున ఆ ఫోన్లను పరీక్ష కేంద్రాల్లో వినియోగించవద్దన్నారు.
హైటెక్ కాపీయింగ్‌కు చెక్:
ఈ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు బోర్డు చెక్ పెట్టింది. గతంలో విద్యార్థులను పరీక్ష ప్రారంభమైన 15 నిముషాల వరకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చి అర్ధగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో ఉండాలి. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. గతంలో విద్యార్థులను 9.15 గంటలకు పరీక్షకు అనుమతించేవారు. ప్రస్తుతం దాన్ని మార్చారు. విద్యార్థులు 8.45 గంటలకు పరీక్ష రాసే హాలులో ఉండాలి. 8.45 గంటల తరువాత పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్ ఇతర వివరాలు ప్రత్యేకంగా ఒక పుస్తకంలో నమోదు చేయాలి. పరీక్షకు ఆలస్యంగా రావడానికి గల కారణాలు కూడా స్పష్టంగా పేర్కొనాలి. ఒకే కళాశాల విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వస్తున్నట్లు తేలితే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా కాపీయింగ్‌ను నిరోధించేందుకు, ప్రశ్నపత్రాల లీకేజిని అరికట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చేపట్టిన చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి.
హైటెక్ కాపీయింగ్‌కు జీపీఎస్‌తో చెక్
Published Mon, Mar 10 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement