
సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటుతో ఇంటర్‌బోర్డు కొత్త బెంచ్‌మార్క్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఇంటరీ్మడియట్ విద్యామండలి (టీజీబీఐఈ) ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును శుక్రవారం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, జ్యోత్స్నరెడ్డిలతో కలిసి పరిశీలించారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థతో పరీక్ష కేంద్రాలను రియల్‌టైంలో పర్యవేక్షించడంతోపాటు న్యాయమైన పరీక్ష వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏర్పాటు చేసిన 8,000 కంటే ఎక్కువ హైరిజల్యూషన్ కెమెరాలతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వివరించారు.
ఈ నూతన వ్యవస్థతో పరీక్షల నిర్వహణను ఏకకాలంలో పర్యవేక్షించడానికి, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతోపాటు ఏవైనా అవకతవకలను నివారించడానికి వీలు ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంపై అధికారులను మురళి ప్రశంసించారు. ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా, పరీక్ష సంస్కరణలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై నమ్మకం, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యా బోర్డులకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని చెప్పారు.