intermediate exams
-
TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం(డిసెంబర్16) విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1మార్చి 7న ఇంగ్లీష్ పేపర్ 1మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్1మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 -
AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. కాగా, పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
Intermediate Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆన్లైన్లో ఇంటర్ హాల్‌టికెట్లు
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ https://bieap.apcfss.in/ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వెబ్సైట్లో తమ పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా తమ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, నేరుగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ప్రకటించారు. ఎవరికైనా హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్‌టికెట్‌ను ఇస్తారని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు చెక్ గతంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేసేవి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు ఎటువంటి వేధింపులు లేకుండా విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు పబ్లిక్ డొమైన్‌లోనే అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించింది. -
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు పదో తరగతి, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకటి నుంచి ఇంటర్, 18 నుంచి పది పరీక్షలు ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరికోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వివరించారు. వీరితోపాటు పరీక్షలకు రీ ఎన్రోల్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ టెన్త్‌లో 34,635 మంది విద్యార్థులు ఉండగా, 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా, 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. 27 నుంచి ఏపీ టెట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్‌కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్సీ నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాల విద్య డైరెక్టర్ పార్వతి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి, పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఏపీ టెట్ జేడీ మేరీచంద్రిక, ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం : గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. గూగుల్ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు. గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి
-
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 4,17,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,19,790 మంది ప్రఽథమ, 1,97,950 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. సుమారు 548 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోని పరీక్ష కేంద్రాలకు మాత్రం అదనపు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా స్థాయి పరీక్షల కమిటీ(డీఈసీ)తో పాటు హైపవర్ కమిటీ సభ్యులు సైతం ఆకస్మికంగా కేంద్రాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల నడుమ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో వారు వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్ కిట్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు హాల్ టికెట్లను వెబ్ సైట్ www.tsbie. egg. gov. in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అర గంట ముందే చేరుకోండి.. పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ పరీక్షల నేపథ్యంలో రౌండ్‌ది క్లాక్ పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040– 24601010 లేదా 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్‌లైన్ నంబర్ 14416ను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో పరీక్షలు ఇలా.. జిల్లా పరీక్ష కేంద్రాలు - ప్రథమ -ద్వితీయ హైదరాబాద్ -233 84,223 -86,923 రంగారెడ్డి జిల్లా -182 71,773 -55,883 మేడ్చల్– మల్కాజిగిరి -133 63,794- 55,144 -
ఏపీ లో ఇంటర్ ఎగ్జామ్స్
-
స్కూల్ టీచర్లకూ ‘ఇంటర్’ విధులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యేవారికి చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఇంటర్ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది, సెకండియర్‌కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. భద్రత మరింత పెంపు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్ బోర్డ్ నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. – జయప్రదాబాయి, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు ఇంటర్ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. – నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. నైతికత, మానవ విలువలపై పరీక్షలు ఇంటర్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు. అలాగే జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వచ్చేనెల 15 నుంచి.. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్ఫోన్రహిత జోన్‌గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే నిబంధన విధించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. – కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు -
అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్‌పై వెళ్తూ..
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. హాస్టల్లో తన వస్తువులు సిద్ధం చేసుకొని మరోసారి మిత్రులందరినీ పలకరించి నాన్నతో పాటు ఆనందంగా బైక్‌పై గ్రామానికి బయల్దేరింది. కానీ.. ఆ విద్యార్థిని ఆనందం కొన్ని నిమిషాల్లో ఆవిరైపోయింది. దారి మధ్యలోనే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి, కూతురిని బలితీసుకుంది. ఇక సెలవంటూ స్నేహితురాళ్లకి.. ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్లో విద్యార్థిని చెప్పిన ఆ పలకరింపులే.. చివరివయ్యాయి. సాక్షి, గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన గద్వాల మండలం అనంతపురం శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలిలా.. ఇటిక్యాల మండలం మునగాలకి చెందిన నల్లన్న (42), పద్మమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తె రాజేశ్వరి (18) గద్వాల మండలంలోని గొనుపాడు కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. గురువారం ఇంటర్మీడియెట్ చివరి పరీక్ష సైతం పూర్తవడంతో విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద, హాస్టల్లో తోటి విద్యార్థినులతో ఆనందంగా పలకరిస్తూ.. తిరిగి పైచదువులకు కలుద్దామని చెప్పింది. కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి నల్లన్న బైక్‌పై మునగాల నుంచి గోనుపాడులోని కేజీబీవీ హాస్టల్‌కు చేరుకున్నాడు. స్నేహితులందరికీ మరోసారి పలకరించిన రాజేశ్వరి తండ్రితో పాటు బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరింది. బస్సు రూపంలో కబళించిన మృత్యువు.. గురువారం మధ్యాహ్నం తండ్రీకూతురు ఇద్దరూ గద్వాల మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎర్రవల్లి నుంచి గద్వాల వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పైనుంచి వారు ఎనిమిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన నల్లన్న, రాజేశ్వరి అక్కడిక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా, బైక్ మామూలు వేగంతోనే వెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. చదవండి: దిశ కేసు: వారిని పోలీసులే వేధించి కాల్చి చంపారు గ్రామంలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మునగాలకి చెందిన తండ్రీకూతురు మృతి చెందారనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. రాజేశ్వరి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ.. సెలవుల సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి బతుకీడుస్తున్న నల్లన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇరువురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఏఎస్ఐ వెంకట్రాములు తెలిపారు. -
గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. చేతితో రాసిన ప్రశ్నపత్రం ఎందుకీ పరిస్థితి? గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. దీన్ని బోర్డ్‌లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్) హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్‌లో 32 మంది, సెకండియర్‌లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు చెప్పినట్టు తెలిపారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫోటోలు)
-
హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులపై ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
రైళ్లకు సమ్మర్ రష్..!
సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్‌లు ఫుల్ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు. విజయవాడ జంక్షన్ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్ క్లాస్‌కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ ఏసీకి డిమాండ్ అధికంగా ఉంది. విజయవాడ–విశాఖ రూట్‌కు డిమాండ్ విజయవాడ–హైదరాబాద్ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్ స్లీపర్ వెయిట్ లిస్ట్ 17 కాగా థర్డ్ ఏసీ వెయిట్ లిస్ట్ 18 ఉంది. గోదావరి స్లీపర్ వెయిట్ లిస్ట్ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల అనంతరం.. ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్ సిటీ, పాసింజర్ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. -
ఏపీలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు. -
AP: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
అమరావతి: ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల తేదీల మార్పు?
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే... జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాయిదా వేస్తే..! జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్‌లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేస్తుంది. -
ఏప్రిల్ 8 నుంచి ఇంటర్.. మే 2 నుంచి టెన్త్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షల కోసం 1,456, పదో తరగతి పరీక్షల కోసం 4,200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం కర్నూలులో ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో విద్యా శాఖ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 3,30,376 మంది బాలురు, 3,09,429 మంది బాలికలు కలిపి మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,05,052 (బాలికలు 2,53,406, బాలురు 2,51,646) మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,81,481 (బాలికలు 2,39,160, బాలురు 2,42,321) మంది హాజరవుతారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 1,757 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 7న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మార్చి 9న ఎన్విరాన్మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని, ఎత్నిక్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఒకేషనల్ సహా జనరల్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఫస్టియర్ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మళ్లీ ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం చదవాలంటే గందరగోళానికి, తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించిన తరహాలోనే పాస్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఇంటర్ బోర్డు తరఫున డీఎల్ పాండు వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసే సమయంలోనే పరిస్థితులకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే పేర్కొన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు కూడా ఈ విద్యార్థులు రాయలేదని, కరోనా నేపథ్యంలో వీరిని పాస్ చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది.