ఇంటర్ పరీక్ష కేంద్రాలపై హైటెక్ నిఘా!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలపై హైటెక్ నిఘా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైటెక్ మాస్‌కాపీయింగ్, ప్రశ్నలు, ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ట్యాపింగ్ తరహాలో పరీక్ష కేంద్రాల్లోని మొబైల్ నెట్‌వర్క్స్‌పై నిఘా పెట్టి కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది.
ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇంటర్‌లోనూ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఇదివరకే అధికారులు గుర్తించారు. అంతేగాక.. పరీక్షలు ఆరంభమైన అరగంటలోపే కొన్ని ప్రశ్నలు లీకైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా పోలీసు కమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో పరీక్ష కేంద్రాల్లో మొబైల్ నెట్‌వర్క్స్‌పై నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ప్రశ్న, జవాబు పత్రాల రవాణాకోసం మొబైల్స్‌ను వాడుతున్నారు. పరీక్ష కేంద్రం ఉండే అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంతో అనుసంధానం చేసి, మొబైల్ కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, వాటిల్లోని వివరాలను సేకరిస్తారు. ఇవన్నీ పోలీసుశాఖ సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి. తద్వారా పేపరు లీకేజీ, ప్రశ్నలు బయటకు రావడం వంటి వాటిని అరికట్టాలని అధికారులు భావిస్తున్నారు.
5 నిమిషాలకు మించి ఆలస్యమైతే నో ఎంట్రీ!
ఈసారి పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే.. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదన్న ప్రతిపాదనపై ఇంటర్ బోర్డు సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులను 8:45 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక గరిష్టంగా పావుగంట ఆలస్యం అయినా(9:15 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అయితే ఇందులో 10 నిమిషాల సమయాన్ని కుదించాలని బోర్డు భావిస్తోంది. అంటే విద్యార్థులను 9:05 గంటల వరకే పరీక్ష హాల్లోకి పంపుతారు. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.
మొదటి 3 ప్రశ్నలూ సొంత మీడియంలో...
ఇంటర్ పరీక్షల్లో ద్వితీయ భాష సంస్కృతం, అరబిక్ పేపర్‌లో మొదటి మూడు ప్రశ్నలకు విద్యార్థులు ఎంచుకున్న మీడియంలో జవాబులు రాసేందుకు అవకాశం కల్పించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు దాదాపు 15 మార్కుల విలువైన జవాబులను ఆయా భాషల లిపిలోగాక విద్యార్థులు ఎంచుకున్న మీడియంలో రాసుకోవచ్చు. ఐదేళ్లపాటు దీనిని అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మార్కులకోసం సంస్కృతం, అరబిక్‌లను ద్వితీయ భాషగా ఎంచుకుంటున్న విద్యార్థులు సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోగాక తెలుగులో రాస్తున్నారు. అరబిక్ కూడా అంతే. ఈ నేపథ్యంలో సంస్కృత పరీక్షను దేవనాగరి లిపిలోనే, అరబిక్‌ను అరబిక్ లిపిలోనే రాయాలని ఇంటర్ బోర్డు గతంలో నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. మొదటి మూడు ప్రశ్నలను వారు ఎంచుకున్న మీడియంలో రాసే అవకాశాన్ని కల్పించింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట కల్పించినట్లవుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.