ప్రయోగ ‘పరీక్ష’ | 102 exam centers ready with insufficient facilities | Sakshi
Sakshi News home page

ప్రయోగ ‘పరీక్ష’

Published Thu, Feb 6 2014 5:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

102 exam centers ready with insufficient facilities

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 12వ తేదీ నుంచి మార్చి 4వ తే దీ వరకు నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ టా కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు.

 ఈ ఏడాది కూడా ప్రాక్టికల్ పరీక్షలకు అరకొర వసతులు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పెట్టుగా లేవు. చాలా కళాశాల ల్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలు కూడా లేవు.  అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారో తెలపాలి.
 21,352 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

  జిల్లాలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,620 మంది, బైపీసీ విద్యార్థులు 7,453, వొకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,349, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,930 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 38 ప్రభుత్వ కళాశాలు, ఆరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు, ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలు, 51 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 నాలుగు విడతలు
 ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతలుగా జరుగనున్నాయి. మొదటి విడత ఈనెల 12 నుంచి 16 వరకు.. రెండో విడత 17 నుంచి 21 వరకు.. మూడో విడత 22 నుంచి 26 వరకు.. నాలుగో విడత ఈనెల 28 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ 60 మార్కులు, బైపీసీకి 60 మార్కులు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 150 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు థియరీ పరీక్షల మార్కులతో కలుపుతారు. ఈ మొత్తం మార్కులు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి.

 విద్యార్థులకు తప్పని అవస్థలు
 రెండేళ్ల పాటు కష్టపడి చదివి ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో ప్రయోగాలు అంతంత మాత్రంగానే చేస్తే మార్కుల్లో కోత విధించే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు రెండేళ్ల క్రితం ప్రాక్టికల్ పరీక్షల పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.2 లక్షల నిధులు విడుదల చేసింది. వీటిలో కొన్ని కళాశాలల్లో నామమాత్రంగా పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని ఉపయోగించుకపోవడంతో దుమ్ము, దూళి, తుప్పుపట్టి చెడిపోయాయి. ప్రైవేట్ కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. సౌకర్యాలు లేకున్నా అధికారులు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాల నిర్వహణ కోసం అధికారులు కళాశాలలను పరిశీలనకు వెళ్లిన సమయంలో కళాశాల యాజమాన్యాలు ఏదో కొన్ని పరికరాలు చూపి అనుమతిని పొందుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పైపైనే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైన విద్యార్థులకు నష్టం కలుగకుండా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సౌకర్యాల విషయమై ఆర్‌ఐవో ఫజలుల్లాను అడుగగా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు సౌకర్యాలు ఉన్న కళాశాలలకు మాత్రమే అనుమతినిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement