Practical Exams
-
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
నేరేడ్మెట్:కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ,బీపీసీ(జనరల్)లతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసిందని శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎం.కిషన్ పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. వచ్చే నెల 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు తిరిగి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా? -
30 మార్కులకి 26 వేసేలా 'నారాయణ' ఒప్పందం
సాక్షి, అనంతపురం : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్బడేలా విద్యార్థులను కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఆయా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపాయి. ఇప్పటికే అకడమిక్ ఫీజుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కళాశాలల యాజమాన్యాలు తాజాగా ప్రాక్టికల్స్ పేరుతో నిలువుదోపిడీ సాగించాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో ఒక్కొ విద్యార్థి నుంచి రూ. 5వేలు రాబట్టుకున్నట్లు ఆ కళాశాల విద్యార్థులే బాహటంగా చర్చించుకుంటున్నారు. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకపోతే ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయరంటూ భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. జంబ్లింగ్ ఉన్నా ..అడ్డదారులే! జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు మొత్తం 33 వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో పరీక్షలుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంగా నారాయణ కళాశాలకు మరో పరీక్ష కేంద్రం కేటాయించినప్పటికీ ఎక్స్టర్నల్ అబ్జర్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని మార్కుల దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కొ సబ్జెక్టుకు 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించగా.. 23 నుంచి 26 మార్కులు వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభావంతులు అయినప్పటికీ .. ఆశించిన స్థాయిలో మార్కులు వేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పనిచేయని సీసీ కెమెరాలు ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసినా.. మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సెంటర్లలో సీసీ కెమరాలు పనిచేయకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అధ్యాపకులే ఎత్తి చూపుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌స్ట్రీమింగ్‌లో జరుగుతున్నప్పటికీ .. ప్రైవేట్ వ్యక్తులు పరీక్ష కేంద్రాల్లోనే ఉంటున్నారు. ప్రాక్టికల్స్ జరిగే పరీక్ష కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాల సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. ర్యాంకులే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు అక్రమాలకు తెగబడ్డారు. నారాయణ కళాశాల విద్యార్థులకైతే సమాధాన పత్రాలను మైక్రో జిరాక్స్‌లు తీయించి మరీ అందజేస్తున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సూపరింటెండెంట్లు , ఇన్విజిలేటర్లతో సెల్ఫోన్లలో మంతనాలు జరుపుతూ తమ కళాశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకునేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే అనుమతులు రద్దు ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్భందీగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. మైక్రో జిరాక్స్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆయా కళాశాల గుర్తింపు రద్దుకు సైతం వెనుకాడబోం. ప్రాక్టికల్స్ పరీక్షలకు అదనంగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే సత్వర చర్యలు తీసుకుంటాం. – వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ, అనంతపురం -
ప్రాక్టికల్ ‘ప్రాబ్లమ్’
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రయోగాత్మక విద్యే విద్యార్థి భవితకు పునాది. కొన్నేళ్లుగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ అంతా లోపభూయిష్టంగా కొనసాగుతూ వచ్చింది. పారదర్శకంగా నిర్వహించేందుకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కులు, ర్యాంకులాటలో మునిగి తేలుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రలోభాల ఎసరు పెట్టి ఈ విధానాన్నీ కలుతం చేస్తున్నాయి. ఎక్కడైతే మాకేంటి అంటూ ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లకు ముడుపుల మత్తు చల్లి తమ దారికి తెచ్చుకుంటున్నాయి. దీనికిగాను అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచే దండుకుంటున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు వసూలు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కూడా ప్రాక్టికల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రాక్టికల్స్ గండం తప్పించటానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేస్తున్నారు. ఒక్కో విద్యార్థి చేత రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూల్ చేసి ప్రాక్టికల్స్ మార్కులు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్ కోసం సమయం వెచ్చించే తీరిక లేకపోవటం, నేర్చుకున్నా చేయగలమో లేదోనన్న భయంతో విద్యార్థులు అడిగినంత డబ్బులు చెల్లించటానికి సిద్ధపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల అక్రమాలను అడ్డుకోవటానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తోంది. గతేడాది నుంచి ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్ విధానంలో నియమిస్తోంది. ఇన్ని చర్యలను తీసుకుంటున్నా అక్రమాలకు అలవాటు పడ్డ వారు తమ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికున్న పరిచయాలు, పలుకుబడితో గతేడాది కూడా నిరి్వగ్నంగా అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం ఈ ఏడాదైనా అవకతవకలను ఆరికట్టి సమర్థవంతంగా నిర్వహిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతునన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్... సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 298 కళాశాలల నుంచి ఇంటరీ్మడియట్ రెండో ఏడాదికి చెందిన 36,460 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విభాగం నుంచి 29,458, బైపీసీ విభాగం నుంచి 7,002 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, పరికరాలు ఉన్న 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఆర్ఐవో తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యం వాస్తవమే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలలో ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేయించటం లేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆయా యాజమాన్యాలు కేవలం థీయరీపైనే దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులు ప్రాక్టికల్స్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల తనిఖీల్లో ఇటువంటి పరిస్థితి గుర్తించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాం. ప్రాక్టికల్స్ విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించం. – జెడ్ఎస్ రామచంద్రరావు, ఇంటర్ బోర్డు ఆర్ఐవో, గుంటూరు -
జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి కూడా సెంటర్ల జంబ్లింగ్ లేకుండానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవలే రావడం, విద్యా శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కూడా కొత్తవారే కావడంతో ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జంబ్లింగ్ అమలుకు మొదట్లో ఆలోచనలు చేసినా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న భావనలో బోర్డు వర్గాలు ఉన్నాయి. అందుకే 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు సాధ్యం కాదని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్ సాధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలోనే జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నా రాష్ట్రంలో 2,500 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో దాదాపు 10 లక్షల మంది చదువుతున్నారు. అందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉండగా, అందులో సైన్స్ కోర్సుల విద్యార్థులు 3 లక్షలకు పైగా ఉంటున్నారు. వారికి ప్రతి ఏటా సొంత కాలేజీల్లోనే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కారణంగా కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్ చేసి, తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30 మార్కులకు 30 మార్కులు వేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎప్పటి నుంచో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల ఏర్పాటులోనూ జంబ్లింగ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్ ఉంది. అయితే ప్రతి ఏటా బోర్డు అధికారులు మొదట్లో జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రకటించడం, ఆ తరువాత ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో జంబ్లింగ్ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడం కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులను వేయించుకుంటున్నందున ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30కి 30 మార్కులను వేయడం లేదు. దీంతో వారు నష్టపోతున్నారు. అయితే ఈసారి ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ అమలుకు చర్యలు చేపడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల పేర్కొన్నారు. కానీ ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్ సా«ధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయి. పైగా బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ కొత్తగా వచ్చినందునా, ఇప్పుడు ఆయన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపైనే దృష్టి పెట్టారు. గతేడాది దొర్లిన పొరపాట్లు దొర్లకుండా హాల్‌టికెట్ల జనరేషన్ నుంచి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. -
52 మంది విద్యార్థులు గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1519 మంది విద్యార్థులకు గాను 27 మంది గైర్హాజరయ్యారు. 1492 పరీక్షలు రాశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1480 మందికి గాను 1455 మంది హాజరయ్యారు. 25 గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ వెంకటేశులు, డీఈసీ మెంబర్లు ఆరు కేంద్రాలను తనిఖీలు చేశారు. నగరంలోని గాయత్రి సాయి యశ్వంత్ కళాశాల కేంద్రంలో జరిగిన ప్రయోగ పరీక్షలకు ఒక సిలిండర్ మాత్రమే ఉంది.దీంతో విద్యార్థులంతా ఒకేచోట గ్రూపుగా చేరి ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో సిలిండర్ ఏర్పాటు చేయాలని ఆదేశించగా యాజమాన్యం స్పదించి చర్యలు తీసుకుంది. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత
- ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ - హాల్‌టిక్కెట్లు లేకుండానే పరీక్ష రాస్తున్న విద్యార్థులు హిందూపురం అర్బన్ : ఐటీఐ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. ఎస్వీ, ఏంజెల్ ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు 2 నుంచి 16వ తేదీ వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. కిరికెర వద్ద ఉన్న ఎంజెల్ ఐటీఐ కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అంతా కుమ్మక్కై చూచిరాతలు రాయిస్తున్నట్లు కనిపిస్తోంది. బయటి వ్యక్తులు వచ్చి పరీక్ష హాలులో కూర్చుంటున్నారు. అలాగే కొందరు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు కూడా లేవు. విద్యార్థులు గుంపుగా కూర్చుని పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు. కాగా పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకుల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడం గమనార్హం. -
సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిఘా నీడన నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,300 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ పరీక్షల ను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నట్లు వివరించారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నాటికి రూట్ మ్యాప్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి తన హాల్‌టికెట్ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేయగానే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలన్న రూట్ మ్యాప్ మొబైల్లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
వేంపల్లె: తండ్రి చనిపోయి పుట్టెదు దుఃఖంలో ఉన్నప్పటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ల్యాబ్ పరీక్షలకు హాజరయ్యాడు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ముద్ది సుబ్బరాయుడు(50) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతునికి భార్య భవాని, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు ముద్ది నారాయణస్వామి వేంపల్లె వాసవీ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తండ్రి చనిపోయాడు. బాగా చదువుకోవాలని, తనలాగా కూలీగా మారవద్దని తండ్రి పదే పదే చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఓ వైపు దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు జరిగిన ప్రయోగ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
జంబ్లింగ్ విధానం ఎత్తి వేయాలంటూ...
పిడుగురాళ్ల: ఇంటర్ మీడియట్ లో నిర్వహించే ప్రాక్టికల్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలంటూ.. విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాలలను బహిష్కరించి సుమారు 800 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రం జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసిందని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విధానం కొనసాగించడం సరైంది కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పట్టణంలోని అన్ని కళాశాలలను బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేశారు. -
నిజామాబాద్‌లో జోరుగా మాస్‌కాపీయింగ్
-
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ షురూ!
హైదరాబాద్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 481 కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన ఈ పరీక్షలకు 43,901 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించొద్దని ఇంటర్మీడియెట్ బోర్డు సూచించింది. -
ఫీజు కట్టకుంటే అంతే!
పరీక్షలకు హాల్‌టికెట్లు ఇవ్వబోమంటున్న కాలేజీలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఖరారు కాని ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు మరో నెలలో తుది పరీక్షలున్నా ఫీజులపై కొరవడిన స్పష్టత తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు విషయం ఇప్పటికీ తేలకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకాన్ని టీ సర్కార్ ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్)’గా మార్చినప్పటికీ దాని మార్గదర్శకాలను విద్యాసంవత్సరం చివరి దాకా విడుదల చేయకపోవడం సమస్యలకు దారి తీస్తోంది. విద్యార్థుల స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, దానిపై వివాదాలు రేగి విషయం కోర్టుకు వెళ్లడం తెలిసిందే. దీనిపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణలో భాగంగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ కౌంటర్‌ను దాఖలు చేయాలి. ఈ కౌంటర్‌పై కూడా ఇంకా తేల్చకపోవడంతో విద్యార్థి లోకంతో పాటు కాలేజీల యాజమాన్యాలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాక్టికల్స్‌కు హాల్ టికెట్ల నిలిపివేత! ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ త్వరలోనే జరగాల్సి ఉండగా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే హాల్‌టికెట్ ఇవ్వబోమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోతే తామే చెల్లిస్తామంటూ విద్యార్థులతో కొన్ని యాజమాన్యాలు ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పథకం అమలుపై ఏర్పడిన గందరగోళంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే స్కాలర్షిప్ బకాయిలు కూడా అందకపోవడం చాలా మంది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వీటిపైనే ఆధారపడి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్‌కు 2,600 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అధికారవర్గాల అంచనా. పాతబకాయిలను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 3,200 కోట్లకు చేరుతుంది. గత ఏడాది కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి సర్టిఫికెట్లను యాజమాన్యాలు తమ వద్దనే పెట్టుకున్నాయి. తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం ఫీజుల రీయింబర్స్మెంట్ -రాష్ట్ర ప్రభు త్వవైఖరిపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని దశలవారీగా రద్దు చేసేందుకు చూస్తోంది. తన విధానమేంటో కోర్టుకు కూడా తెలపడం లేదంటే దీనిపై ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉన్నట్లు స్పష్టమవుతోంది. - జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేత ఫాస్ట్ మార్గదర్శకాలేవి? ఫాస్ట్ పథకం మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు సిద్ధమయ్యేలా చూడాలి. ఫీజులు కట్టకపోతే హాల్‌టికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతేఉద్యమిస్తాం. - శోభన్ మూడ్, ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షుడు -
ఏపీలో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ జారీ
ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయి. రాత పరీక్షలు మార్చి 11వతేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ క్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ప్రాక్టికల్స్‌కు 1,689 కేంద్రాలు, థియరీ పరీక్షలకు 1,413 కేంద్రాలను కేటాయించారు. ప్రాక్టికల్ పరీక్షలకు 2,90,466 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. మొదటి ఏడాదిలో ఒకేషనల్ విద్యార్ధులు 26,900 మంది, రెండో ఏడాదిలో 28,914 మంది ఉన్నారు. నీతి, మానవ విలువలకు సంబంధించి జనవరి 28వతేదీన, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 31న ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్షలకు 9,89,240 మంది హాజరు కానున్నారు. -
ప్రయోగ ‘పరీక్ష’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 12వ తేదీ నుంచి మార్చి 4వ తే దీ వరకు నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ టా కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రాక్టికల్ పరీక్షలకు అరకొర వసతులు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పెట్టుగా లేవు. చాలా కళాశాల ల్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలు కూడా లేవు. అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారో తెలపాలి. 21,352 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,620 మంది, బైపీసీ విద్యార్థులు 7,453, వొకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,349, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,930 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 38 ప్రభుత్వ కళాశాలు, ఆరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు, ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలు, 51 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు విడతలు ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతలుగా జరుగనున్నాయి. మొదటి విడత ఈనెల 12 నుంచి 16 వరకు.. రెండో విడత 17 నుంచి 21 వరకు.. మూడో విడత 22 నుంచి 26 వరకు.. నాలుగో విడత ఈనెల 28 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ 60 మార్కులు, బైపీసీకి 60 మార్కులు, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 150 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు థియరీ పరీక్షల మార్కులతో కలుపుతారు. ఈ మొత్తం మార్కులు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయి. విద్యార్థులకు తప్పని అవస్థలు రెండేళ్ల పాటు కష్టపడి చదివి ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో ప్రయోగాలు అంతంత మాత్రంగానే చేస్తే మార్కుల్లో కోత విధించే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు రెండేళ్ల క్రితం ప్రాక్టికల్ పరీక్షల పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.2 లక్షల నిధులు విడుదల చేసింది. వీటిలో కొన్ని కళాశాలల్లో నామమాత్రంగా పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని ఉపయోగించుకపోవడంతో దుమ్ము, దూళి, తుప్పుపట్టి చెడిపోయాయి. ప్రైవేట్ కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. సౌకర్యాలు లేకున్నా అధికారులు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ కోసం అధికారులు కళాశాలలను పరిశీలనకు వెళ్లిన సమయంలో కళాశాల యాజమాన్యాలు ఏదో కొన్ని పరికరాలు చూపి అనుమతిని పొందుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పైపైనే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైన విద్యార్థులకు నష్టం కలుగకుండా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సౌకర్యాల విషయమై ఆర్ఐవో ఫజలుల్లాను అడుగగా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు సౌకర్యాలు ఉన్న కళాశాలలకు మాత్రమే అనుమతినిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.