లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్
సాక్షి, అనంతపురం : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్బడేలా విద్యార్థులను కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఆయా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపాయి. ఇప్పటికే అకడమిక్ ఫీజుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కళాశాలల యాజమాన్యాలు తాజాగా ప్రాక్టికల్స్ పేరుతో నిలువుదోపిడీ సాగించాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో ఒక్కొ విద్యార్థి నుంచి రూ. 5వేలు రాబట్టుకున్నట్లు ఆ కళాశాల విద్యార్థులే బాహటంగా చర్చించుకుంటున్నారు. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకపోతే ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయరంటూ భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
జంబ్లింగ్ ఉన్నా ..అడ్డదారులే!
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు మొత్తం 33 వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో పరీక్షలుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంగా నారాయణ కళాశాలకు మరో పరీక్ష కేంద్రం కేటాయించినప్పటికీ ఎక్స్‌టర్నల్ అబ్జర్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని మార్కుల దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కొ సబ్జెక్టుకు 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించగా.. 23 నుంచి 26 మార్కులు వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభావంతులు అయినప్పటికీ .. ఆశించిన స్థాయిలో మార్కులు వేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పనిచేయని సీసీ కెమెరాలు
ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసినా.. మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సెంటర్లలో సీసీ కెమరాలు పనిచేయకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అధ్యాపకులే ఎత్తి చూపుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌స్ట్రీమింగ్‌లో జరుగుతున్నప్పటికీ .. ప్రైవేట్ వ్యక్తులు పరీక్ష కేంద్రాల్లోనే ఉంటున్నారు. ప్రాక్టికల్స్ జరిగే పరీక్ష కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాల సిబ్బంది హల్‌చల్ చేస్తున్నారు. ర్యాంకులే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు అక్రమాలకు తెగబడ్డారు. నారాయణ కళాశాల విద్యార్థులకైతే సమాధాన పత్రాలను మైక్రో జిరాక్స్‌లు తీయించి మరీ అందజేస్తున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సూపరింటెండెంట్లు , ఇన్విజిలేటర్లతో సెల్‌ఫోన్లలో మంతనాలు జరుపుతూ తమ కళాశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకునేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే అనుమతులు రద్దు
ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్భందీగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. మైక్రో జిరాక్స్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆయా కళాశాల గుర్తింపు రద్దుకు సైతం వెనుకాడబోం. ప్రాక్టికల్స్ పరీక్షలకు అదనంగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే సత్వర చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ నాయక్, ఆర్‌ఐఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment