narayana junior college
-
హాస్టల్లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం
హయత్‌నగర్ (హైదరాబాద్): కళాశాల హాస్టల్లో ఉండలేక గోడదూకి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి నిదర్శనంగా నిలిచిన ఈ హృదయ విదారకమైన సంఘటన గురువారం హయత్‌నగర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచి్చంది. తెనాలికి చెందిన ఎ.విజయ్‌కుమార్ వ్యాపారం చేసుకుంటూ నగరంలోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసముంటున్నారు.ఆయనకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు గిరీశ్‌కుమార్ (15)ను ఇంటర్ మొదటి సంవత్సరం చదివించేందుకు పది రోజల కిందట హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని కోహెడ వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్పించాడు. ఇక్కడ చదవడం ఇష్టం లేని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో రెండ్రోజుల కిందట వచి్చన తల్లి కొడుకును బుజ్జగించి, మళ్లీ వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి వెళ్లింది. ఈ క్రమంలో హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని భావించిన గిరీశ్‌కుమార్ బుధవారం రాత్రి కళాశాల నుంచి మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాడు. విద్యార్థి కనిపించక పోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహరీ పక్కన గిరీశ్ మృతదేహాన్ని గురించ్తిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒంటరిగా బయటికి వచి్చన విద్యార్థి హాస్టల్ గోడ దూకి పారిపోయేందుకు ప్రహరీ గోడ ఎక్కాడని, గోడ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరీశ్ చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. -
‘నారాయణ’ కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
మీర్‌పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి, టార్చర్ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు. ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
కాలేజీ భవనం నుంచి దూకిన విద్యార్థిని
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న భవ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి కథనం ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన జ్యోతి, సాంబశివుడు దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో భవ్యశ్రీ స్థానిక అంబార్ వీధిలో అమ్మమ్మ వద్ద ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఒంటరినైపోయానన్న ఆవేదన కొద్దిరోజులుగా భవ్యశ్రీలో నాటుకుపోయింది. మరోవైపు ఫీజుల విషయమై కళాశాల యాజ మాన్యం భవ్యశ్రీని మందలించినట్లు తెలిసింది. ఫీజు డబ్బు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆ విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు భవనంపై నుంచి కిందకు దూకింది. అది చూసిన విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..
సాక్షి, తిరుపతి: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నవదీప్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణ క్యాంపస్ హాస్టల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమయంలో నవదీప్ కత్తిపోటుకు గురయ్యారు. వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు నవదీప్ రైల్వేకోడూరు వాసిగా తెలుస్తోంది. నవదీప్ ఒంటిపై గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..) -
నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా సీరియస్
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శిని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా పేర్కొన్నారు. భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆమె సూచించారు. కాగా రామంతాపూర్ నారాయణ కాలేజీలో సెంకడ్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థి సాయి నారాయణ.. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత, నారాయణ ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: (రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?) -
అంబర్పేట్ నారాయణ కాలేజ్‌లో దారుణం
-
నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్, మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: మునావర్ ఫరూకీ కామెడీ షోకి గ్రీన్‌సిగ్నల్.. రాజాసింగ్ వార్నింగ్.. -
నరకమే ‘నారాయణ’
నెల్లూరు రూరల్: హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. నెల్లూరులోని ధనలక్ష్మీపురం నారాయణ కళాశాల హాస్టల్లో ఈ దారుణం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలేస్తోందని వేడుకున్నా.. నారాయణ హాస్టల్లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నెల్లూరు, కావలి, తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు సోమవారం రాత్రి భోజనం సరిగా లేదని బయట నుంచి ఆహారాన్ని తేవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థుల వద్ద ఆహార పొట్లాలను లాక్కుని పక్కన పడేశారు. ఈ విషయం తెలియడంతో మరికొందరు విద్యార్థులు అక్కడకు చేరుకుని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉన్నందున బయట నుంచి తెప్పించుకున్నామని, పార్శిళ్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న నారాయణ సిబ్బంది బయట నుంచి ఆహారం ఎలా తెప్పించుకుంటారంటూ విద్యార్థులపై రెచ్చిపోయారు. కాళ్లతో తన్ని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను విచక్షణా రహితంగా చావబాదడం ఏమిటని నిలదీశారు. అనంతరం అక్కడకు చేరుకున్న నారాయణ విద్యాసంస్థల ఉన్నత ఉద్యోగులు తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బుజ్జగించారు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని వేడుకున్నారు. పది రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉన్నందున చేసేదేమీ లేక తల్లిదండ్రులు మెత్తబడ్డారు. దీనిపై నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా బయట నుంచి ఆహారం తెస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆహార పొట్లాలను పక్కన పెట్టిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. -
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్
గుంటూరు ఎడ్యుకేషన్: ‘విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. కనీస వసతులు కూడా కల్పించరా’ అంటూ నారాయణ జూనియర్ కాలేజీపై ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు శివారులోని పెదపలకలూరులో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్‌లో కమిషన్ సభ్యులు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యాంపస్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో టమోటాలు, క్యాబేజీ సహా కుళ్లిన కూరగాయలను అలాగే ఉంచడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వసూలు చేస్తూ.. విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ సిబ్బందిని నిలదీశారు. తమ పిల్లలకు సరైన సదుపాయాలను కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఈ సందర్భంగా వాపోయారు. కమిషన్ సభ్యులు స్పందిస్తూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ఆటవిడుపు కూడా లేకుండా తరగతులకే పరిమితం చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ‘విద్యార్థులకు వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరా? ఏడు రోజుల పాటు ఉదయం 7 నుంచి రాత్రి 9.30 వరకు తరగతులు నిర్వహిస్తారా!’ అంటూ కమిషన్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐవో కార్యాలయంలో కమిషన్ సభ్యులు నారాయణరెడ్డి, ప్రసాద్, ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే.. కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు 40 కాలేజీలకు నోటీసులు జారీ చేశామన్నారు. జూనియర్ కాలేజీల నిర్వహణను ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఆర్ఐవో రామచంద్రరావు పనితీరు సరిగాలేదన్నారు. చదవండి: నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) లేకుండా నిర్వహిస్తున్న 68 కార్పొరేట్ కాలేజీలను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వాటిలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య కాలేజీలు 18 ఉన్నాయని తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా మూసివేత నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఇంటర్ పరీక్షలు అయ్యాక ఈ ఏడాది మార్చి 28 తర్వాత 68 కాలేజీల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షలు అవ్వగానే మార్చి 28 తర్వాత ఎన్ఓసీలు లేకుండా నడుపుతున్న కాలేజీలను మూసివేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. నారాయణ, శ్రీచైతన్య ఇతర విద్యా సంస్థలు ఎన్ఓసీ లేకుండా ఎన్ని కాలేజీలను నిర్వహిస్తున్నాయో, ఎన్ని కాలేజీలను అధికారులు తనిఖీలు చేశారో, ఆయా కాలేజీల్లో పరిస్థితులెలా ఉన్నాయో పూర్తి వివరాలతో ఏప్రిల్ 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. షోకాజ్ నోటీసుల జారీ అనేది కంటితుడుపు చర్యే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కాలేజీలకు నోటీసులు ఇచ్చాం..: ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకోడానికి వీలుకాదన్నారు. ఆ 68 కాలేజీలు తాత్కాలిక ఎన్వోసీలతో నడుపుతున్నాయని, ఇకపై అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు. షోకాజ్ నోటీసుకు స్పందించి వివరణ ఇస్తున్నాయని తెలిపారు. ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. వీరందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వమే అన్నీ చేయలేక..: ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్వోసీ లేని కాలేజీల్లోని విద్యార్థులు వారు చదివే కాలేజీలకు బదులుగా మరో కాలేజీలో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే మార్చి 28 తర్వాత నుంచే ఎన్ఓసీలు లేని 68 కాలేజీలను మూసేస్తామని పేర్కొన్నారు. -
బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు
సాక్షి, పటాన్చెరు: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నకూతురు చనిపోయిందని రోదిస్తున్న మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను శ్రీధర్ అనే కానిస్టేబుల్ బూటుతో తన్నాడు. దీంతో విద్యార్థులు పోలీసులపై తిరగబడటంతో వారు లాఠీచార్జి చేయగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇక సదరు కానిస్టేబుల్ దురుసుతనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.(నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వెలిమెల నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి(16) మంగళవారం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన) -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రిని పోలీసు కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలుతో తన్నిన విషయం తెలిసిందే. అయితే సంధ్యారాణి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలని కేటీఆర్ తెలిపారు. చదవండి: నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య; ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబీకులు కోరుతున్నారు. న్యాయం చేయమని అడిగితే దౌర్జన్యానికి దిగుతారా అని ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి సంధ్యారాణి మృతిపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ, తెలంగాణ జన సమితి విద్యార్థి నేతలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అదుపులోనే ఉన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతల్ని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. నారాయణ విద్యా సంస్థ ల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్పీ చందనా దీప్తి సీరియస్ పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో కానిస్టేబుల్ తన్నిన ఘటనపై సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ చందనా దీప్తి సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు. కాగా, వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్రూమ్లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. -
30 మార్కులకి 26 వేసేలా 'నారాయణ' ఒప్పందం
సాక్షి, అనంతపురం : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్బడేలా విద్యార్థులను కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఆయా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపాయి. ఇప్పటికే అకడమిక్ ఫీజుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కళాశాలల యాజమాన్యాలు తాజాగా ప్రాక్టికల్స్ పేరుతో నిలువుదోపిడీ సాగించాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో ఒక్కొ విద్యార్థి నుంచి రూ. 5వేలు రాబట్టుకున్నట్లు ఆ కళాశాల విద్యార్థులే బాహటంగా చర్చించుకుంటున్నారు. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకపోతే ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయరంటూ భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. జంబ్లింగ్ ఉన్నా ..అడ్డదారులే! జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు మొత్తం 33 వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో పరీక్షలుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంగా నారాయణ కళాశాలకు మరో పరీక్ష కేంద్రం కేటాయించినప్పటికీ ఎక్స్టర్నల్ అబ్జర్వర్లతో ఒప్పందం కుదుర్చుకుని మార్కుల దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కొ సబ్జెక్టుకు 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించగా.. 23 నుంచి 26 మార్కులు వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభావంతులు అయినప్పటికీ .. ఆశించిన స్థాయిలో మార్కులు వేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పనిచేయని సీసీ కెమెరాలు ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసినా.. మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సెంటర్లలో సీసీ కెమరాలు పనిచేయకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అధ్యాపకులే ఎత్తి చూపుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌స్ట్రీమింగ్‌లో జరుగుతున్నప్పటికీ .. ప్రైవేట్ వ్యక్తులు పరీక్ష కేంద్రాల్లోనే ఉంటున్నారు. ప్రాక్టికల్స్ జరిగే పరీక్ష కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాల సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. ర్యాంకులే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు అక్రమాలకు తెగబడ్డారు. నారాయణ కళాశాల విద్యార్థులకైతే సమాధాన పత్రాలను మైక్రో జిరాక్స్‌లు తీయించి మరీ అందజేస్తున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సూపరింటెండెంట్లు , ఇన్విజిలేటర్లతో సెల్ఫోన్లలో మంతనాలు జరుపుతూ తమ కళాశాల విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకునేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే అనుమతులు రద్దు ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్భందీగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. మైక్రో జిరాక్స్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆయా కళాశాల గుర్తింపు రద్దుకు సైతం వెనుకాడబోం. ప్రాక్టికల్స్ పరీక్షలకు అదనంగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే సత్వర చర్యలు తీసుకుంటాం. – వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ, అనంతపురం -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
భవానీపురం(విజయవాడ పశ్చిమ): విజయవాడ రూరల్ మండలం నల్లకుంటలోని నారాయణ జూనియర్ కాలేజ్ హాస్టల్లో మంగళవారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గట్ల శివకోటిరెడ్డి కుమారుడు రామాంజనేయరెడ్డి (16) నల్లకుంట నారాయణ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రామాంజనేయరెడ్డి క్లాస్‌కు వెళ్లకపోవడంతో మధ్యాహ్నం 12.30 సమయంలో కాలేజీ సిబ్బంది హాస్టల్‌కు వెళ్లి చూడగా రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వారు వెంటనే అతన్ని కిందకి దింపి గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాలేజీ సిబ్బంది మృతుని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. రామాంజనేయరెడ్డి మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆంజనేయరెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన
సాక్షి, విజయవాడ : నారాయణ కాలేజ్ హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకోవడంతో కలకలం రేగుతోంది. ఇంటర్ చదువుతున్న శ్రీచరణ్ మృతిపై విచారణ జరపాలని విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసమర్ధ మంత్రుల వల్లే కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మరో ‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: విద్యా వ్యవస్థ రోజురోజుకు విద్యార్థుల పాలిట ఉచ్చులా మారుతోంది. ర్యాంకుల పేరుతో కాలేజీ యాజమాన్యాలు పెంచుతున్న ఒత్తిడికి తాళలేక చాలామంది విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పేరు మోసిన కార్పోరేట్ కాలేజీల్లో ఈ ఉదంతాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తాజాగా వేరవేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన తనీష్ చౌదరి నిడమనురు నారాయణ కాలేజిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం ప్రత్యేక క్లాస్‌లకు హాజరైన అనంతరం అర్దరాత్రి హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిన తోటి విద్యార్ధులు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే తనీష్ విగతజీవుడయ్యాడు. హుటాహుటిన కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న యాజమాన్యం మృతదేహాన్ని గుట్టు చప్పుడుకాకుండా కామినేని ఆస్పత్రికి తరలించారు. తనీష్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు, స్నేహితులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. తెలంగాణలోని వికారాబాద్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం మెమిన్‌పేట్ మండలం ఇర్లపల్లికి చెందిన విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని, కాలేజీ వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నారాయణ’లో మరో నిర్వాకం
విద్యార్థి చెవి కర్ణభేరి పగులగొట్టిన అధ్యాపకుడు గూడూరు: నారాయణ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడి నిర్వాకంతో ఓ విద్యార్థి చెవి కర్ణభేరి పగిలింది. దీంతో ఆ విద్యార్థి చెవి పని చేయకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ ఘటన జరిగింది. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట గ్రామానికి చెందిన మర్రెల దిలీప్‌కుమార్ గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత శుక్రవారం విరామ సమయంలో దిలీప్‌కుమార్ స్నేహితులతో కలసి నీళ్లు తాగేందుకు బయటకు వచ్చాడు. నీళ్లు తాగి లోపలకు వెళుతుండగా.. గణిత అధ్యాపకుడు కిరణ్ దిలీప్‌కుమార్ చెంపపై కొట్టడంతో చెవి వినిపించకుండా పోయింది. కేసు నమోదైంది. -
నారాయణ కాలేజిలో ఫుడ్ పాయిజన్
తిరుపతి: కాలూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో హాస్టల్లో విషాహారం తీసుకుని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి హాస్టల్లో పులిసిన పెరుగన్నం పెట్టడంతో అది తిన్న 30 మంది విద్యార్థులకు తెల్లవారుజామునుంచి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ప్రారంభమయ్యాయి. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. 20 మంది విద్యార్థులను తిరిగి కళాశాలకు తీసుకెళ్లగా మరో పది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇలా నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి
నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరం బుధవారపేటలో నివాసం ఉంటున్న మహానంది, సరస్వతి దంపతుల కుమారుడు సందీప్ స్థానిక నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సందీప్‌ను తరగతి గదిలో మ్యాథ్స్ లెక్చరర్ మందలించినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల ఎదుట చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు లోనైనట్లు సమాచారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోగా.. అప్పటికి ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో కళాశాల ప్రేమయం లేదని చెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు మధ్యవర్తిగా ఈ పంచాయితీ జరిగినట్లు సమాచారం. చివరకు.. తమ కుమారుడు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది నన్నూరు సమీపంలోని నారాయణ బ్రాంచ్‌లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కార్పొరేట్ కళాశాలల్లో ఒత్తిళ్లకు అద్దం పడుతోంది. -
సెలవుల్లో క్లాసులు: నారాయణ కాలేజీపై దాడి
కర్నూలు: వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలకు చెందిన జూనియర్ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడిచేసిన సంఘటన మంగళవారం కర్నూలులో చోటుచేసుకుంది. కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్నారని సమాచారం తెలియడంతో ఏబీవీపీ నాయకులు కొందరు అక్కడికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి, అద్దాలు పగులగొట్టారు. వేసవిలో తరగతులు నిర్వహించవద్దని అధికారులు ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై కళాశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఆర్ఐవో వై.పరమేశ్వరరెడ్డి కళాశాలకు చేరుకుని తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు పంపించివేశారు. మరోసారి తరగతులు నిర్వహిస్తే కళాశాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు జరిమానా
సమాచార హక్కు కమిషనర్ ఉత్తర్వులు శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు(స.హ) చట్టం కింద అడిగిన పలు విషయాలకు నిర్దేశిత గడువులోగా స్పందించని కారణంగా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలలకు స.హ రాష్ట్ర కమిషనర్ తాంతియా కుమారి జరిమానా విధించారు. ఆయా కళాశాలల్లోని పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఓ అర్జీదారుడు కోరారు. నిర్దేశిత గడువులోగా సమాచారాన్ని అందజేయకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స.హ కమిషనర్ స్పందించారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు రూ. 25వేలు, నారాయణ కళాశాలకు రూ.10 వేల జరిమానాతో పాటు మరో రూ.2వేల నష్టపరిహారాన్ని కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ విషయమై జిల్లా ఇంటర్ బోర్డు పరిపాలనాధికారి సుధాకర్, పర్యవేక్షణాధికారి గోపాలరావులను ‘సాక్షి’ వివరణ కోరగా ఉత్తర్వులు చేరలేదని పేర్కొన్నారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
నారాయణ కాలేజి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని నారాయణ జూనియర్ కాలేజిలో చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడి స్వస్థలం కర్నూలు జిల్లా ఉల్లిందుకొండ. అయితే, ఈ ఆత్మహత్య క్యాంపస్ వెలుపల జరిగిందని నారాయణ కాలేజి యాజమాన్యం చెబుతోంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో జరిగిన ఘటనను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
త్రిసభ్య కమిటీకి వినతులు
కడప ఎడ్యుకేషన్: ఈనెల 17వ తేదీన నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన నందిని, మనీషారెడ్డిల మృతిపై విచారణ చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం రాష్ట్ర అతిథి గృహంలో ఉన్న త్రిసభ్య కమిటి సభ్యులకు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. విద్యార్థులు మృతి చెందిన రోజు కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. త్రిసభ్య కమిటి సభ్యులను కలిసిన వారిలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిలా అధ్యక్షుడు అలూరు ఖాజీ ర హ్మతుల్లా, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఉన్నారు. -
విద్యార్థినిల మృతిపై సమగ్ర దర్యాప్తు
కడప: కడప నగర శివార్లలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఈనెల 17న విద్యార్థినులు సాయి మనీషా, నందినిల మృతిపై సమగ్రంగా విచారించి త్వరలో నిజానిజాలు వెల్లడిస్తామని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీ, డీఎస్పీలు స్వయంగా వెళ్లి పరిశీలించారన్నారు. ఈ నెల 18న తాను కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించానన్నారు. ఈ వ్యవహారం బాలికల విషయం కాబట్టి ప్రొద్దుటూరు మహిళా డీఎస్పీ పూజిత నీలంను ప్రత్యేకంగా విచారణ కోసం నియమించామన్నారు. సహాయంగా ఎస్సీ ఎస్టీ సెల్, కడప ఇన్‌ఛార్జి డీఎస్పీ ఎల్.సుధాకర్‌ను నియమించామన్నారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీదారులు, విద్యార్థినిల తల్లిదండ్రుల సమక్షంలోనే ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాలను కిందకు దించామని, నందినికి సంబంధించిన నోటు పుస్తకంలో రాసుకున్న సూసైడ్ నోట్‌ను సీజ్ చేశామని చెప్పారు. ఆ గదిలో ఉంటున్న వారిని పిలిపించి విచారిస్తామన్నారు. నందిని సూసైడ్ నోట్‌ను పూర్తిగా బహిర్గత పరచలేమని, వారి తల్లిదండ్రులతో సంప్రదించి తెలియజేస్తామని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు జరిగిన మరణాలపై ఐఏఎస్ స్థాయి అధికారి విచారిస్తున్నారని వివరించారు. అదే గదిలో ఉంటున్న సహ విద్యార్థిని 5.30 గంటలకు వెళ్లినపుడు వారు గదిలోనే ఉన్నారని, తర్వాత కొద్దిసేపటికి ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
మిన్నంటిన ఆందోళనలు
అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్ఆర్ జిల్లా కడప నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాస్తారొకోలు, ధర్నాలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో నారాయణ విద్యా సంస్థల యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. విదార్థినుల మృతిపై న్యాయ విచారణ జరిపేందుకు మంత్రి కళాశాల కావడంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రమణ, కుళ్లాయప్ప, పవన్, కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కేవై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినిల ఆత్మహత్యలపై సిట్టింగ్‌జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గాదిలింగ, చాంద్‌బాషా, సంతోష్, మున్నా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్య వేధింపులు కారణంగానే విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మ దహనం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక క్లాక్‌టవర్ వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే కళాశాలల్లో ఎంతటి వేధింపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ వీరాంజనేయులు, నాయకులు హరికృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు నిరసనగా బుధవారం రాయలసీమ వ్యాప్తంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి కూడా నేడు విద్యా సంస్థలకు బంద్‌కు పిలుపునిచ్చారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరుణకుమార్ డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తప్పించి నారాయణ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. గుంతకల్లు, కదిరి, ఉరవకొండ, హిందూపురంలలో సైతం విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. -
నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
కడప కార్పొరేషన్ : నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేసి, ఆ యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు. నారాయణ విద్యాసంస్థల ఛెర్మైన్, రాష్ట్ర మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే పరామర్శ అంతకుముందు మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల యాజమాన్యమే ఆ విద్యార్థులను హత్య చేసిందన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికే విద్యార్థులపై ప్రేమలేఖలంటూ విద్యార్థులపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పులి సునీల్‌కుమార్, చల్లా రాజశేఖర్, నాగిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్ నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు కడప/కర్నూలు/అనంతపురం/తిరుచానూరు: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని నారాయణ జూనియర్ కళాశాలలో మనీషా, నందిని ఆత్మహత్య ఘటనలో మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పలు విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. కడపలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నారాయణను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల్ని నడుపుతున్న ప్రైవేటు కాలేజీల తీరుకు నిరసనగా ఈ నెల 19వ తేదీన ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్) పిలుపు నిచ్చిన విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం ప్రకటించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం సహా గత ఏడాది కాలంలో నారాయణ సంస్థల్లో పదుల సంఖ్యలో సంభవించిన మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సలాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ఎవరు కారకులో తేల్చాలని కోరారు. తాము బంద్‌కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించారు. -
కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య
కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన వేధింపులతోనే ఆత్మహత్య: తండ్రి ఆరోపణ గోల్నాక: నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ప్రణీత్కుమార్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థి మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రణీత్ మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు కోసం కాలేజీ యాజమాన్యం వేధించడంతోనే తన కుమారుడు ప్రాణం తీసుకున్నాడని విద్యార్థి తండ్రి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ముత్యాల సంజీవరెడ్డి కుమారుడు ప్రణీత్ కుమార్‌రెడ్డి(17) నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఏంపీసీ (ఐఐటీ) ద్వితీయ సంవత్సరంచదువుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కళాశాల హాస్టల్లోని బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణీత్ బాగానే చదివేవాడని, కాగా, అతను గత పది రోజులుగా తనకు చనిపోవాలని ఉందని, భవనం పై నుంచి దూకితే చనిపోతారా? ఏదైనా తాగితే చనిపోతారా? అని అడగడంతో పాటు చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నట్టు చెప్పేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. సినిమా డెరైక్టర్ కావాలని..? ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి ప్రణీత్ సినిమా డెరైక్టర్ కావాలనుకున్నట్లు సమాచారం. తనకు సినిమా డెరైక్టర్ కావాలనుందని, ఈ చదువు తనకు ఇష్టం లేదని పలుమార్లు అతను తమతో అన్నాడని తోటి విద్యార్థులు కొందరు తెలిపారు. ఈ విషయం అతను తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడన్నారు. వేధింపులే కారణం: తండ్రి నారాయణ కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం తోటి విద్యార్థుల ముందు తన కుమారుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రణీత్ తండ్రి సంజీవరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అంబర్‌పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల ధర్నా నల్లకుంట: ప్రణీత్కుమార్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఏబీవీపీ, టీజీబీపీ, టీఆర్వీపీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం నల్లకుంటలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే ప్రణీత్ మృతికి కారణమని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని, ప్రణీత్ మృతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ సెంట్రల్ జోన్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కడియం రాజు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి టీజీవీపీ రాష్ర్ట అధ్యక్షుడు కల్వకుర్తి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నారాయణ కళాశాల వద్ద నల్లకుంట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య విషయం తెలిసి ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కళాశాల వద్దకు వచ్చారు. ర్యాంకుల కోసం వేధించడం సరికాదు: కిషన్‌రెడ్డి నల్లకుంట: ప్రణీత్ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాంకుల కోసం కార్పొరేట్ కళాశాలలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విరామంలేకుండా చదివిస్తుండటంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంకుల కోసం ఇలా విద్యార్థులను వేధించడం తగదన్నారు. ప్రణీత్ మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జూనియర్లపై రెచ్చిపోయిన సీనియర్లు
దివాన్‌చెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ : ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ మహమ్మారి విజృంభించింది. సీనియర్ల ధాటికి సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి కేంద్రంగా నారాయణ జూనియర్ కాలేజి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎంఈసీ బ్రాంచిని దివాన్ చెరువులో ఏర్పాటు చేసిన రెండు భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఓ భవనంలో తరగతులు, మరో భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌గా వాడుతున్నారు. హాస్టల్ పైఅంతస్తులో జూనియర్లు, గ్రౌండ్ ఫ్లోర్లో సీనియర్లు ఉంటున్నారు. కొందరు సీనియర్లు కొంతమంది జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అర్ధరాత్రి నీళ్లు తీసుకురావాలని, వారి ఎంగిలి కంచాలు కడగాలని, మోకాళ్లపై కుర్చోమని చెప్పి పిడిగుద్దులు కురిపించడం వంటి చేష్టలకు సీనియర్లు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు అధ్యాపకులు సీనియర్లను మందలించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారిపై కూడా తిరగబడడంతో అధ్యాపకులు మిన్నకుండిపోయారు. దీంతో సీనియర్ల వేధింపులపై బాధితులు కళాశాల ప్రిన్సిపాల్‌కి, ఇతర అధ్యాపకులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల్లో కళాశాలను వదిలి వెళ్లనున్న సీనియర్ విద్యార్థులు.. సుమారు 60 మంది జూనియర్లపై శనివారం రాత్రి జులుం ప్రదర్శించారు. డూప్లికేట్ తాళంతో గేటు తెరిచి, పైఅంతస్తులో ఉన్న జూనియర్లను నిద్ర లేపి, గోడ కుర్చీలు, మోకాళ్లపై నిలబడాలంటూ హుకుం జారీ చేశారు. సీనియర్లంటే చులకనగా ఉందా అంటూ దుర్భాషలాడుతూ.. జూనియర్లపై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా తెల్లారిన తర్వాత కూడా గొడవకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న సీనియర్లు తమపై అమానుషంగా ప్రవర్తించేవారని జూనియర్లు ఆరోపించారు. ‘ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు, హాల్ టికెట్ ఇవ్వరు, అంతేకదా!’ అంటూ కాళ్లతో తన్నేవారన్నారు. పరీక్షలు వస్తున్నాయని, కొట్టకండని జూనియర్లు ప్రాథేయపడినా, వైద్య చేయించుకుని పరీక్షలు రాయవచ్చులే అని సీనియర్లు దౌర్జన్యం చేసే వారన్నారు. ఐదు, పది రూపాయలు అప్పు తీసుకోవడం, తిరిగి అడిగితే దుర్భాషలాడి, కొట్టేవారన్నారు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి, ఐదుగురు విద్యార్థులను తమ వెంట తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఈ కళాశాల ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందనడానికి నిదర్శనంగా.. హాస్టల్లోని కొన్ని గదుల్లో రక్తపు మరకలు, చెల్లాచెదురైన పుస్తకాలు, దుస్తులు, సామగ్రి దర్శనమిచ్చాయి. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి కళాశాలకు, హాస్టల్‌కు చేరుకుని, తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాలను నిర్వహించాలని, లేకుంటే వేరే కళాశాలలో తమ పిల్లలను చేర్పించాల్సి వస్తుందని ప్రిన్సిపాల్‌ని హెచ్చరించి నట్టు తెలిసింది. ర్యాగింగ్ కాదు.. అల్లరే.. : ప్రిన్సిపాల్ ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా, ఇది ర్యాగింగ్ కాదంటూ కొట్టివేశారు. విద్యార్థుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ అల్లరికి కారణమన్నారు. ర్యాగింగ్‌పై విద్యార్థులను చైతన్యపరుస్తూ సదస్సులు నిర్వహించే అవసరం తమకు రాలేదన్నారు. దీనిపై బొమ్మూరు సీఐ సాయిరమేషన్ను వివరణ కోరగా కళాశాల వార్షికోత్సవం రోజున విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే ఇందుకు కారణమని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఎన్నికల హడావుడిలో తాము బిజీగా ఉన్నామన్నారు. -
నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్దుల అస్వస్ధత