వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలకు చెందిన జూనియర్ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడిచేశారు.
కర్నూలు: వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలకు చెందిన జూనియర్ కాలేజీపై ఏబీవీపీ కార్యకర్తలు దాడిచేసిన సంఘటన మంగళవారం కర్నూలులో చోటుచేసుకుంది. కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్నారని సమాచారం తెలియడంతో ఏబీవీపీ నాయకులు కొందరు అక్కడికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి, అద్దాలు పగులగొట్టారు. వేసవిలో తరగతులు నిర్వహించవద్దని అధికారులు ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి ఘటనపై కళాశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐవో వై.పరమేశ్వరరెడ్డి కళాశాలకు చేరుకుని తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు పంపించివేశారు. మరోసారి తరగతులు నిర్వహిస్తే కళాశాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.