జేఎన్‌యూలో దుండగుల వీరంగం | Masked men attack JNU students and teachers | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూలో దుండగుల వీరంగం

Published Mon, Jan 6 2020 4:11 AM | Last Updated on Mon, Jan 6 2020 5:14 AM

Masked men attack JNU students and teachers - Sakshi

రక్తమోడుతున్న ఆయిషీ ఘోష్‌. ధ్వంసమైన జేఎన్‌యూ క్యాంపస్‌ లోపలి భాగం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం హింస చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్‌ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.


తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా, విలపిస్తున్న ఘోష్‌ వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దుండగులు వర్సిటీలో భయోత్పాతం సృష్టించారు. ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, డీఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది.

ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్‌లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. ఏబీవీపీ వారు చేసిన రాళ్లదాడిలోనే తమ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఘోష్‌ తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించింది. హాస్టళ్లలోకి చొరబడి ప్రత్యర్థి వర్గాల విద్యార్థులు లక్ష్యంగా దాడి చేశారని, పలువురు టీచర్లను కూడా గాయపర్చారని పేర్కొంది. జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌కు సంబంధించి ఒక సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారని విద్యార్థులు ఆరోపించారు.

దాడికి భయపడి హాస్టళ్లలోని తమ రూముల్లో దాక్కున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రమోద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని అందులో కోరారు. వర్సిటీలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.  

కేంద్ర మంత్రుల ఖండన
జేఎన్‌యూలో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్‌ జైశంకర్‌ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు. ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామని ట్వీట్‌ చేశారు.  

విద్యార్థులకు భయపడ్తున్నారు
వర్సిటీ విద్యార్థులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందువల్లనే, వారిని భయభ్రాంతులు చేసేందుకే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించాయి. ప్రభుత్వం పంపిన గూండాలే వీరని కాంగ్రెస్‌ మండిపడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ‘సమరశీల విద్యార్థుల నినాదాలు వింటున్న ఫాసిస్ట్‌లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భయం ప్రతిస్పందనే జేఎన్‌యూలో నేడు చోటు చేసుకున్న హింస’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్‌ నేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కోరానన్నారు. ‘జేఎన్‌యూ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. విద్యార్థులను దారుణంగా కొట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే.. దేశం ముందుకు ఎలా వెళ్తుంది?’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. యూనివర్సిటీ వెలుపల స్వరాజ్‌ అభియాన్‌పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌పై కొందరు దాడికి యత్నించారు.

బయట వైపు ఉన్న పోలీసులు, ఇతరులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement