JNUSU
-
అనుమానితుల్లో ఆయిషీ!
న్యూఢిల్లీ/చెన్నై/భోపాల్: ఈ నెల 5వ తేదీ రాత్రి జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలకు బాధ్యుల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ ఘటనకు కారకులుగా భావిస్తున్న 9 మంది ఫొటోలను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. ‘మొత్తం 9 మందిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు కాగా, ఇద్దరు ఇతర సంఘాల వారు. వీరిలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. అగంతకులంతా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ జోయ్ టిర్కే తెలిపారు. వర్సిటీలో వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు జనవరి 1 నుంచి 5వ తేదీ ఉండాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలపడం దాడులకు దారితీసిందన్నారు. వర్సిటీలోని పెరియార్ హాస్టల్లోని కొన్ని గదుల్లో మాత్రమే దాడులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, కానీ త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రణ్‌ధవా చెప్పారు. సీసీటీవీ ఉంటే నిందితులను గుర్తించడం సులువుగా ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు దాడికి ముందు రోజే సర్వర్ రూమును «ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. వైఫై డిసేబుల్ చేయడం వల్ల సీసీటీవీ పుటేజీ లభించలేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, స్క్రీన్ షాట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. కాగా, తనపై పోలీసులు చేసిన ఆరోపణలను ఘోష్ ఖండించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తన ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. ఇలా ఉండగా ఈ దాడి ఘటనకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను భద్రపరిచేలా ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఢిల్లీ హైకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) వేశారు. హింసాత్మక ఘటనకు కీలక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీని కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు సేకరించలేదని వారు అందులో తెలిపారు. ఈ పిల్‌పై 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథి తెలిపారు. హెచ్చార్డీ నిర్ణయాలు యథాతథం: వీసీ జేఎన్‌యూ హాస్టల్ ఫీజులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్చార్డీ) శాఖ గతంలో తీసుకున్న నిర్ణయాలను తుచతప్పకుండా అమలు చేస్తామని వీసీ ఎం.జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. వర్సిటీలో 13వ తేదీ నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జేఎన్‌యూ పరిపాలన విభాగం, వీసీతో హెచ్చార్డీ అధికారుల భేటీ అనంతరం వీసీ ఈ విషయాలను వెల్లడించారు. అవసరమనుకుంటే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఖరి గడువును పొడిగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నకారులకు దీపిక మద్దతు బాలీవుడ్ నటి దీపికా పదుకొణే జేఎన్‌యూ సందర్శనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. దీపిక దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే వారికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే పండగ చేసుకునే వారి పక్కన ఆమె నిలబడ్డారని, ఇది చూసి ఆమెను అభిమానించే వారంతా షాక్‌కు గురయ్యారన్నారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి అంటూ పదుకొనే 2011లో ప్రకటించి, తన రాజకీయ అనుబంధాన్ని చాటుకున్నారన్నారు. ‘అక్కడి వారు లాఠీలతో విద్యార్థినులను అభ్యంతరకరమైన రీతిలో కొట్టారు. అలాంటి వారి పక్కన దీపిక నిలబడింది. అది ఆమె హక్కు. ఇతర యువతులపై దాడికి చేసే వారికి కూడా ఆమె మద్దతు తెలుపుతుంది. ఆమెకు ఆ స్వాతంత్య్రం ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధం ఉన్నట్లు 2011లోనే వెల్లడైంది’ అని పేర్కొన్నారు. చెన్నైలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఇరానీ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఆ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. -
జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస నేపథ్యంలో వర్సిటీ అధికారిక విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) వీసీని టార్గెట్ చేసింది. క్యాంపస్‌లో జరిగిన దాడులకు జేఎన్‌యూ వీసీ జగదేశ్‌కుమార్ కారణమని నిందించింది. వీసీ ఒక మాబ్‌స్టెర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో హింసను ప్రేరేపిస్తున్నాడని, తన బాసులను సంతృప్తి పరిచేందుకే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఏబీవీపీ విద్యార్థులే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాలతో కూడిన జేఎన్‌యూఎస్‌యూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో హింసకు వీసీ జగదేశ్ కారణమని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు తమపై దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
జేఎన్‌యూలో హింస
-
సిగ్గుతో తలదించుకుంటున్నా!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ రాహుల్ మెహ్రా ట్విటర్లో స్పందించారు. గూండాలు జేఎన్‌యూలోకి ప్రవేశించి.. అమాయకులైన విద్యార్థులపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులకు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. ‘జేఎన్‌యూలో హింసకు సంబంధించిన వీడియో క్లిప్స్ చూశాక ఢిల్లీ పోలీసు స్టాండింగ్ కౌన్సెల్ అయిన నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. గూండాలు యథేచ్ఛగా జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి.. మారణహోమం సృష్టించారు. విద్యార్థులను తీవ్రంగా గాయపర్చారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బలగాలు ఏం చేస్తున్నాయి?’అంటూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు దాడి చేశారో, ఎవరు బాధితులో అన్నది సందేహముంటే.. ఎబీవీపీ లేదా వామపక్షాల విద్యార్థుల్లో ఎవరికి తీవ్రమైన గాయాలయ్యాయన్న దానినిబట్టి దానిని తేల్చవచ్చునని పేర్కొన్నారు. చదవండి: జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూలో దుండగుల వీరంగం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం హింస చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా, విలపిస్తున్న ఘోష్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దుండగులు వర్సిటీలో భయోత్పాతం సృష్టించారు. ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది. ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. ఏబీవీపీ వారు చేసిన రాళ్లదాడిలోనే తమ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించింది. హాస్టళ్లలోకి చొరబడి ప్రత్యర్థి వర్గాల విద్యార్థులు లక్ష్యంగా దాడి చేశారని, పలువురు టీచర్లను కూడా గాయపర్చారని పేర్కొంది. జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఒక సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారని విద్యార్థులు ఆరోపించారు. దాడికి భయపడి హాస్టళ్లలోని తమ రూముల్లో దాక్కున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని అందులో కోరారు. వర్సిటీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రుల ఖండన జేఎన్‌యూలో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు. ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామని ట్వీట్ చేశారు. విద్యార్థులకు భయపడ్తున్నారు వర్సిటీ విద్యార్థులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందువల్లనే, వారిని భయభ్రాంతులు చేసేందుకే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించాయి. ప్రభుత్వం పంపిన గూండాలే వీరని కాంగ్రెస్ మండిపడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ‘సమరశీల విద్యార్థుల నినాదాలు వింటున్న ఫాసిస్ట్‌లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భయం ప్రతిస్పందనే జేఎన్‌యూలో నేడు చోటు చేసుకున్న హింస’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కోరానన్నారు. ‘జేఎన్‌యూ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. విద్యార్థులను దారుణంగా కొట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే.. దేశం ముందుకు ఎలా వెళ్తుంది?’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. యూనివర్సిటీ వెలుపల స్వరాజ్ అభియాన్‌పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌పై కొందరు దాడికి యత్నించారు. బయట వైపు ఉన్న పోలీసులు, ఇతరులు -
కన్హయ్యను చంపేయండన్న వ్యక్తి ఖాతాలో రూ.150
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంతో ఒక్కసారిగా తనవైపు దేశాన్ని తిరిగి చూసేలా చేసిన వర్సిటీ పీహెచ్డీ స్కాలర్ కన్హయ్య కుమార్‌ను హత్య చేస్తే వారికి రూ.11 లక్షలు చెల్లిస్తానంటూ ఆఫర్ చేసిన ఆదర్శ శర్మ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.150మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతడు కొద్ది నెలలుగా అతడు ఉంటున్న గదికి అద్దె కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. బిహార్‌లోని బెగుసారాయ్కు చెందిన ఆదర్శ శర్మ ది పుర్వాంచల్ సేనకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. రోహిణీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలె కన్హయ్య కుమార్‌ను చంపినవారికి రూ.11 లక్షలు చెల్లిస్తామంటూ పత్రికలు వీధివీధిన దర్శనమిచ్చాయి. వాటిపై పూర్వంచల్ సేన లోగోతోపాటు ఆదర్శ శర్మ సంతకం కూడా ఉంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఆదర్శ చీకట్లోకి వెళ్లిపోయాడు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకోవడమే కాకుండా దాదాపు అన్ని కమ్యూనికేషన్స్ కట్ చేసుకున్నాడు. 'ఎవరూ జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చిపారేస్తారో వారికి పూర్వాంచల్ సేన రూ.11లక్షలు బహుమతిగా ఇస్తుంది' అని శనివారం పోస్టర్లు వెలుగుచూశాయి. -
జేఎన్‌యూలో ఏఐఎస్ఏ క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెం ట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) విజయఢంకా మోగించింది. శుక్రవారం జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఏఐఎస్ఏ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ,ఎల్పీఎఫ్ తరఫున అభ్యర్థులు పోటీపడ్డారు. ఎన్నిక జరిగిన ప్రధాన నాలుగు పోస్టులనూ ఏఐఎస్ఏ గెలుచుకుంది. అధ్యక్షుడిగా పోటీచేసిన అశ్‌తోష్ కుమార్ (ఏఐఎస్ఏ)కు 1,386 ఓట్లు పోలయ్యాయి. ఎల్పీఎఫ్ తరఫున పోటీచేసిన రహీలా పర్వీన్ (377 ఓట్ల తేడా) రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే ఉపాధ్యక్షుడిగా అనంత్ప్రకాష్ (ఏఐఎస్ఏ) తన సమీప ప్రత్యర్థి మహ్మద్ జహిదుల్ దేవన్(ఏబీవీపీ)పై 600 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం జరిగిన పోరులో చింటు కుమారి (ఏఐఎస్ఏ), తన సమీప ప్రత్యర్థి ఆశిష్‌కుమార్ ధనోటియా (ఏబీవీపీ)పై 814 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. సంయుక్త కార్యదర్శిగా ఏఐఎస్ఏకు చెందిన షఫ్కత్ హుస్సేన్, తన సమీప ప్రత్యర్థి ములాయంసింగ్(ఎల్పీఎఫ్)పై 240 ఓట్ల తేడా తో విజయం చేజిక్కించుకున్నారు. గత ఏడాది కూడా జేఎన్‌యూ ఎన్నికల్లో ఏఐఎస్ఏ అన్ని పదవులను కైవశం చేసుకున్న విషయం తెలిసిందే.