అనుమానితుల ఫొటోలను చూపుతున్న పోలీసు అధికారులు
న్యూఢిల్లీ/చెన్నై/భోపాల్: ఈ నెల 5వ తేదీ రాత్రి జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలకు బాధ్యుల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ ఘటనకు కారకులుగా భావిస్తున్న 9 మంది ఫొటోలను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. ‘మొత్తం 9 మందిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు కాగా, ఇద్దరు ఇతర సంఘాల వారు. వీరిలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ ఉన్నట్లు అనుమానిస్తున్నాం.
అగంతకులంతా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ జోయ్ టిర్కే తెలిపారు. వర్సిటీలో వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు జనవరి 1 నుంచి 5వ తేదీ ఉండాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలపడం దాడులకు దారితీసిందన్నారు. వర్సిటీలోని పెరియార్ హాస్టల్‌లోని కొన్ని గదుల్లో మాత్రమే దాడులు చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, కానీ త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రణ్‌ధవా చెప్పారు. సీసీటీవీ ఉంటే నిందితులను గుర్తించడం సులువుగా ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు దాడికి ముందు రోజే సర్వర్ రూమును «ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. వైఫై డిసేబుల్ చేయడం వల్ల సీసీటీవీ పుటేజీ లభించలేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, స్క్రీన్ షాట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. కాగా, తనపై పోలీసులు చేసిన ఆరోపణలను ఘోష్ ఖండించారు.
తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తన ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. ఇలా ఉండగా ఈ దాడి ఘటనకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను భద్రపరిచేలా ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జేఎన్‌యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఢిల్లీ హైకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) వేశారు. హింసాత్మక ఘటనకు కీలక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీని కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు సేకరించలేదని వారు అందులో తెలిపారు. ఈ పిల్‌పై 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథి తెలిపారు.
హెచ్చార్డీ నిర్ణయాలు యథాతథం: వీసీ
జేఎన్‌యూ హాస్టల్ ఫీజులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్చార్డీ) శాఖ గతంలో తీసుకున్న నిర్ణయాలను తుచతప్పకుండా అమలు చేస్తామని వీసీ ఎం.జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. వర్సిటీలో 13వ తేదీ నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జేఎన్‌యూ పరిపాలన విభాగం, వీసీతో హెచ్చార్డీ అధికారుల భేటీ అనంతరం వీసీ ఈ విషయాలను వెల్లడించారు. అవసరమనుకుంటే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఖరి గడువును పొడిగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
దేశ విచ్ఛిన్నకారులకు దీపిక మద్దతు
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే జేఎన్‌యూ సందర్శనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. దీపిక దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే వారికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే పండగ చేసుకునే వారి పక్కన ఆమె నిలబడ్డారని, ఇది చూసి ఆమెను అభిమానించే వారంతా షాక్‌కు గురయ్యారన్నారు.
ప్రధాని పదవికి రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి అంటూ పదుకొనే 2011లో ప్రకటించి, తన రాజకీయ అనుబంధాన్ని చాటుకున్నారన్నారు. ‘అక్కడి వారు లాఠీలతో విద్యార్థినులను అభ్యంతరకరమైన రీతిలో కొట్టారు. అలాంటి వారి పక్కన దీపిక నిలబడింది. అది ఆమె హక్కు. ఇతర యువతులపై దాడికి చేసే వారికి కూడా ఆమె మద్దతు తెలుపుతుంది. ఆమెకు ఆ స్వాతంత్య్రం ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధం ఉన్నట్లు 2011లోనే వెల్లడైంది’ అని పేర్కొన్నారు. చెన్నైలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఇరానీ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఆ పత్రిక ట్విట్టర్‌లో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment